ETV Bharat / state

రైతుల కష్టాలకు చెక్‌ పెట్టేలా 'రోబో ట్రాక్టర్‌'.. ఐదు రకాల పనులు అవలీలగా

author img

By

Published : Mar 12, 2023, 12:31 PM IST

Robo tractor: వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తూ.. సాగును నష్టాలమయంగా మారుస్తున్నాయి. సాంకేతికతతోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపగలమని నమ్మిన కొందరు యువకులు.. ఓ చిట్టి రోబో ట్రాక్టర్‌కు రూపకల్పన చేశారు. ఐదు రకాల వ్యవసాయ పనుల్ని ఈ రోబోతో చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ యంత్రం ఎలా ఉంటుంది, ఏ విధంగా పని చేస్తుంది.. ఓ సారి చూసేద్దామా..

Robo tractor
Robo tractor

రైతుల కష్టాలకు చెక్‌ పెట్టేలా రోబో ట్రాక్టర్‌ రూపకల్పన.. ఐదు రకాల పనుల్ని అవలీలగా!

Robo tractor: చిన్నపాటి యుద్ధ ట్యాంకర్​లా కనిపిస్తోన్న ఈ పరికరం.. వ్యవసాయానికి సంబంధించి ఐదు రకాల పనుల్ని అవలీలగా చేస్తుంది. హైదరాబాద్​కు చెందిన ఓ అంకుర సంస్థ ఈ రోబో పరికరాన్ని రూపొందించింది. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు రైతులకు రోబో సాంకేతికత గురించి వివరించేందుకు గుంటూరు తీసుకువచ్చారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు పరికరం తీరుని ప్రదర్శించి చూపారు. ప్రస్తుతం రైతులు ఏ పంట వేసినా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆ సమస్య తీర్చటం కోసం రకరకాల ఉపకరణాల్ని వాడుతున్నారు. ముఖ్యంగా పురుగుమందుల పిచికారి కోసం డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అది కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇపుడీ రోబో ట్రాక్టర్ డ్రోన్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు. పురుగు మందుల పిచికారితో పాటు విత్తనాలు వేయటం, మొక్కలు నాటడం, కలుపు తీయటం, ఎరువులు చల్లటం వంటి పనులు దీనితో చేయొచ్చు.

చిన్నపాటి ట్రాక్టర్ లాంటి పరికరానికి పనికి తగ్గట్లుగా ఐదు రకాలు ఉపకరణాల జోడిస్తారు. ఏ పొలంలో అయితే పనులు చేయాలో ఆ పొలాన్ని ముందుగా మ్యాపింగ్ చేసి.. ఏ పని చేయాలో సంబంధిత ఉపకరణాన్ని జోడిస్తే చాలు ఈ రోబో పని పూర్తి చేస్తుంది. రైతులకు సాంకేతికతను దగ్గర చేసేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు పరికరం రూపకర్తలు తెలిపారు. రోబోటిక్స్​తో వ్యవసాయంలోని చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుందని తయారీదారుల్లో ఒకరైన త్రివిక్రం కుమార్ తెలిపారు. రోబో ట్రాక్టర్ రిమోట్ ద్వారా పని చేస్తుంది. 3గంటల ఛార్జింగ్ చేస్తే 5 నుంచి 6 గంటలు పని చేస్తుంది. అదనపు బ్యాటరీ తీసుకుంటే మరో 2గంటలు నడుస్తుంది. అలా 8 గంటల్లో 4 ఎకరాల్లో పురుగుమందుల పిచికారీ పూర్తి చేయొచ్చు. ఇతర రకాల పనులైతే రెండు ఎకరాల్లో చేయగలదని.. రూపకర్తలు తెలిపారు.

ఆరుతడి పంటలకు సరిపడేలా ఈ పరికరాన్ని రూపొందించారు. రెండు సాళ్ల మధ్య 2 అడుగుల ఖాళీ ఉంటే వాహనం వెళ్లటానికి అనువుగా ఉంటుంది. పంట రకాన్ని బట్టి ఎత్తుని మార్చుకోవచ్చు. పురుగుమందుల పిచికారీకి అవసరమైన ట్యాంకర్ సైజ్ కూడా 25 నుంచి 72 లీటర్ల సామర్థ్యం ఉండేలా ఏదైనా అమర్చుకోవచ్చు. దీని ధర దాదాపు 2లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం రైతులకు ఈ సాంకేతికత అలవాటు చేసే క్రమంలో అద్దె విధానంలో అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోబో ట్రాక్టర్​కు సంబంధించి మరికొన్ని పరిశోధనలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న పనులు మరింత వేగంగా, సులువుగా చేసేలా ప్రయోగాలు జరుగుతున్నాయని రూపకర్తలు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.