ETV Bharat / state

అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం..49 మందికి ధిక్కరణ నోటీసులు

author img

By

Published : May 26, 2020, 5:40 PM IST

Updated : May 27, 2020, 7:06 AM IST

న్యాయవ్యవస్థను కించపరిచేలా న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్టులు, వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరిపిన న్యాయస్థానం... ఎంపీ నందిగం సురేశ్‌ సహా 49 మందికి ధిక్కరణ నోటీసులు జారీ చేసింది

highcourt-issues-notices-to-ycp-leaders
అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం

న్యాయస్థానం హుందాతనాన్ని దిగజార్చడం, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ప్రసారమాధ్యమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనికి ఆధారాలను సేకరించడంతో పాటు వివిధ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు తానుగా (సుమోటో) కోర్టు ధిక్కరణగా పరిగణించింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్ట్‌) ఈ వ్యవహారంపై సమావేశమై చర్చించారు. అనంతరం మంగళవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. మీడియాలో పోస్టులు, వీడియో క్లిప్పింగ్‌లు చూశాక ఇవన్నీ న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలని అభిప్రాయపడ్డారు. కోర్టు ధిక్కరణగా పరిగణించేందుకు ఈ వ్యవహారంలో తాను రాతపూర్వక ఆమోదం తెలిపానన్నారు. ఏజీ, కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం


తాము ఇటీవల ఇచ్చిన తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకొని న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు పెట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై కోర్టుకు లేఖలు, ఈమెయిల్స్‌ అందాయి. ఆధారాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, సుమోటోగా కోర్టు ధిక్కరణగా తీసుకుని విచారించింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వేదికగా న్యాయస్థానం ప్రతిష్ఠను దిగజార్చేలా అభ్యంతరకర పోస్టులు పెట్టిన 49 మందికి నోటీసులిచ్చింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తన వాదన వినిపిస్తూ పోస్టింగులలో ఉపయోగించిన పదజాలం చూసి తన నోట మాట రావడం లేదన్నారు.

విదేశీ వేదికలతో ఇక్కడ వ్యాఖ్యలా?
విదేశాలకు సంబంధించిన సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకొని దేశ న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని నిలువరించలేమా? అని మరో కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని హైకోర్టు ప్రశ్నించింది. కనీసం ఆ కంపెనీల పైనా చర్యలు తీసుకోలేకపోతున్నామంది. వాట్సప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర మాధ్యమాలు ఇతర దేశాలవని, అక్కడ ఇలాంటి పోస్టులు పెడితే తక్షణం అరెస్టు చేస్తారని గుర్తుచేసింది. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) రాజశేఖర్‌ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 16, 18 తేదీల్లో ఏడుగురిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో పురోగతి లేదని రాష్ట్ర డీజీపీ, సీఐడీపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆర్‌జీ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సీఐడీ నమోదు చేసిన కేసుల్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో దర్యాప్తు చేసే సంస్థకు బదిలీ చేయాలని కోరారు. దేశ న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగులు పెట్టకుండా స్వీయ నియంత్రణ చేసేలా ఆయా మాధ్యమాల యాజమాన్యాల్ని ఆదేశించాలని కోరారు. హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పిటిషనర్‌ తరఫున న్యాయవాది అశ్విన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. అభ్యంతరకర పోస్టులను పెట్టకుండా నియంత్రించాలన్నారు. దీనిపై వివరాలు సమర్పించాలని కేంద్రం తరఫు సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) హరినాథ్‌, అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను ఆదేశిస్తూ.. విచారణను 29కి వాయిదా వేసింది.

ఆ 49 మంది వీరే..

కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీచేసిన వారిలో.. నందిగం సురేష్‌, ఆమంచి కృష్ణమోహన్‌, రవిచంద్రారెడ్డి, మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, దరిశ కిశోర్‌రెడ్డి, చందు రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, జె.వెంకట సత్యనారాయణ, గంజి అర్జున్‌, ఎ.శ్రీధర్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, సతీష్‌కుమార్‌, కె.గౌతమి, లింగారెడ్డి, డా.రవికుమార్‌, సమీర్‌ రాథోడ్‌, పి.శ్రీను, జి.రమేశ్‌, చిరంజీవి, డి.ప్రేమ్‌చంద్‌, వెంకటరెడ్డి, రవిజగన్‌, కత్తి మహేశ్‌, సీహెచ్‌ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్‌.ఆనంద్‌, సీహెచ్‌ సతీష్‌, మారుతీరెడ్డి, అమనుల్లాహ్‌ఖాన్‌, ఎస్‌.బాను, ఎం.శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, బి.విష్ణు, ఎం.ఇంద్రసేనారెడ్డి, ఇంటూరు రవికిరణ్‌, లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, టి.శ్రీనాథ్‌, ఆర్‌.శ్రీనివాసరెడ్డి, డెవిల్స్‌ అటార్నీ, కె.నాగేంద్రకుమార్‌, డీబీ కుమార్‌, ఎస్‌.శ్రీనాథ్‌, ఈ.లోకేశ్‌, లోకేశ్‌రెడ్డి, ఎస్‌.మణికుమార్‌, సాయికిరణ్‌ రెడ్డి, పల్లి వెంకటరెడ్డి, మాన్విత ఉన్నారు.

ఇదీ చదవండి:

సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై విచారణ జూన్​ 22కి వాయిదా

Last Updated : May 27, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.