ETV Bharat / state

విద్యా పురస్కార అవార్డుల విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టలేం: హైకోర్టు

author img

By

Published : Apr 6, 2023, 10:57 PM IST

tenth class awards: పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందజేసే విద్యా పురస్కార అవార్డులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను మినహాయిస్తూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వర్తింపచేస్తూ 2019 నవంబర్ 5న రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను కొట్టివేయడానికి నిరాకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈమేరకు తీర్పు ఇచ్చారు.

tenth class awards
విద్యా పురస్కార అవార్డు

tenth class awards: పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందజేసే విద్యా పురస్కార అవార్డులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను మినహాయిస్తూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వర్తింపచేస్తూ 2019 నవంబర్ 5న రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను కొట్టివేయడానికి నిరాకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈమేరకు తీర్పు ఇచ్చారు.

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ప్రతిభ పురస్కార అవార్డు పథకంలో సవరణ తీసుకొచ్చి కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్లో తీసుకొచ్చింది. ఈ జీవో 82ను సవాలు చేస్తూ.. పలువురు విద్యార్థులు, ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజేశ్వర శర్మ 2019లో హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. గత పథకానికి మార్పులు చేయడం వల్ల 2019లో అవార్డుకు ఎంపికైన తాము అనర్హులమయ్యామని పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు పేర్కొన్నారు. విధాన పరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే పథకం వర్తింపచేయడంలో తప్పులేదన్నారు.

ఎంపికైన విద్యార్థికి రూ.20వేల చొప్పున నగదు పురస్కారం చెల్లించేందుకు ప్రతి విద్యాసంవత్సరానికి ప్రభుత్వం రూ.11.60కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2017-18 విద్యాసంవత్సరాలను పరిశీలిస్తే.. 54%, 53% మంది ప్రైవేటు పాఠశాలల్లో చదివిని విద్యార్థులకు ప్రతిభ అవార్డులు దక్కాయి. గణాంకాలను పరిశీలిస్తే ఏటా 50 శాతం మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అవార్డు పొందుతున్నారు. పథకం ముఖ్య ఉద్దేశం.. విద్యలో నాణ్యతను పెంపొందించడం, పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులో సహకారం అందించడమే. పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం... జగనన్న విద్యా కానుక, మనబడి, నాడు- నేడు, గోరుముద్ద తదితర పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలకు రూ.656, 3000, 1628 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయిస్తోంది. ప్రతిభ అవార్డు పథకానికి పేరు సవరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కార్ అవార్డులు అని పేర్కొన్నారు. దానిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేశారు. పేద, అణగారిని వర్గాలను ఉద్ధరించడానికి విధాన రూపకల్పనలు చేసే అధికారం ప్రభుత్వానికి హక్కుంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వర్తింపచేయాలని పిటిషనర్లు కోరలేరన్నారు. విద్యార్థుల గ్రహణ సామర్థ్యంలో వ్యత్యాసం ఆధారంగా సహేతుకమైన వర్గీకరణ చేయడాన్ని అధికరణ 14ను ఉల్లంఘించినట్లు చెప్పలేమని తెలిపారు. సహేతుకమైన వర్గీకరణను అధికరణ 14 నిషేధించడం లేదన్నారు. 2019 సంవత్సర ప్రతిభ అవార్డులకు ఎంపికైన పిటిషనర్లకు పురస్కారం అందక ముందే పథకం పేరును మార్పుచేసి కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే వర్తింపచేయడాన్ని వివక్షగా చూడలేమన్నారు. ఇచ్చిన హామీ నుంచి ప్రభుత్వం వైదొలగినట్లుగా భావించలేమని.. గత పథకానికి ప్రభుత్వం సవరణలు చేసిందన్నారు. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. అందులో జోక్యం చేసుకోలేమంటూ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.