ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదా.. వాలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డ హైకోర్టు

author img

By

Published : Feb 28, 2023, 8:14 PM IST

Updated : Feb 28, 2023, 10:41 PM IST

High Court fires on volunteer system : వాలంటీర్ల వ్యవస్థ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు అమలు చేయలేదా? ప్రభుత్వ అధికారులు పథకాల లబ్దిదారులను ఎంపిక చేయలేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీ చరిత్రలో సంక్షేమ పథకాల అమలు చేయడం ఇప్పుడేమి మొదటిసారి కాదని గుర్తుచేసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉండగా.. వాలంటీర్లకు ఆ బాధ్యతను ఎలా అప్పగిస్తారంటూ విచారణకు హాజరైన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో ఇంతియాజ్​ను నిలదీసింది.

HC
హైకోర్టు

High Court fires on volunteer system : సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక, వారి అర్హతలను నిర్ణయించే బాధ్యతను వాలంటీర్లకు కల్పించడంపై హైకోర్టు మండిపడింది. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు అమలు చేయలేదా? ప్రభుత్వ అధికారులు పథకాల లబ్దిదారులను ఎంపిక చేయలేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీ చరిత్రలో సంక్షేమ పథకాల అమలు చేయడం ఇప్పుడేమీ మొదటిసారి కాదని గుర్తుచేసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉండగా.. వాలంటీర్లకు ఆ బాధ్యతను ఎలా అప్పగిస్తారంటూ విచారణకు హాజరైన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో ఇంతియాజ్​ను నిలదీసింది.

ప్రభుత్వ అధికారులపై విశ్వాసం లేక వాలంటీర్లకు ఆ బాధ్యతను అప్పగించారా? లేదా ప్రభుత్వ అధికారులు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేరనా? అని సూటిగా ప్రశ్నించింది. వాలంటీర్ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ యాప్​లలో పొందుపరిచే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్, తదితర వివరాలను యాప్​లలో పొందుపరిస్తే లబ్ధిదారుల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సామాజిక సేవ కోసం వాలంటీర్లను నియమించామని చెబుతున్న ప్రభుత్వం.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతలను నిర్ణయించే అధికారాన్ని వారికి ఎలా అప్పగిస్తారని వ్యాఖ్యానించింది. వివరాలు సేకరించడానికి వాలంటీర్లు ఎవరంటూ మండిపడింది. వృద్ధాప్యంలో ఉన్న వారిని చేయిపట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లడం, చిన్న పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడం లాంటివి సామాజిక సేవ అవుతుంది కానీ.. లబ్దిదారులను ఎంపిక చేయడం, వారి అర్హతలను నిర్ణయించడం సామాజిక సేవ ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది.

సామాజిక సేవ అనేది విధి నిర్వహణ కాదని తెలిపింది. పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, వీఆర్వోలు చేయాల్సిన పనిని వాలంటీర్లు చేయడం సామాజిక సేవ అనిపించుకోదని తేల్చిచెప్పింది. వాలంటీర్లకు లబ్ధిదారులను గుర్తించే బాధ్యత అప్పగించడం.. ప్రభుత్వ అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం కాదా? అని నిలదీసింది. సంక్షేమ పథకాలకు, వాలంటీర్ల నియామకానికి తామేమీ వ్యతిరేకం కాదని,.. చట్టం అనుమతిస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని వ్యాఖ్యానించింది. రూ.5 వేలు చెల్లించి వారిని ప్రభుత్వం దోపిడీకి గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యావంతులను దోపిడీకి గురి చేస్తూ చట్టవిరుద్ధంగా వారిని వినియోగిస్తున్నారంది. లబ్ధిదారులను గుర్తించే విషయంలో వాలంటీర్ల పాత్రపైనే తమకు అభ్యంతరం ఉందని తెలిపింది. న్యాయస్థానం లేవనెత్తిన సందేహాలతోపాటు, వాలంటీర్ల ద్వారా పౌరుల సమాచారాన్ని సేకరించడం ద్వారా గోప్యత హక్కుకు ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్ సీఈవోను ఆదేశిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated :Feb 28, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.