ETV Bharat / state

పాత గోడలకు కొత్త రంగులు..! గుంటూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు చూస్తే షాక్

author img

By

Published : Mar 29, 2023, 9:20 PM IST

Updated : Mar 29, 2023, 10:12 PM IST

Swachh Survekshan works : గుంటూరులో జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు నవ్వు తెప్పిస్తున్నాయి. సుందరీకరణకు సంబంధించి మౌలిక సదుపాయాలు, వసతులు తీర్చిదిద్దాల్సి ఉండగా.. అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. పాత గోడలకు రంగులు వేసి మమ అనిపిస్తున్నారు. ప్యాచ్‌ వర్కులు, మరమ్మతు చేయకుండానే రంగులు వేస్తూ.. మసిపూసి మారేడు కాయ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

గుంటూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు
గుంటూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు

Swachh Survekshan works : పైన పటారం.. లోన లొటారం అనే మాట ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సుందరీకరణ పనులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. పగిలిపోయిన డివైడర్లు, పెచ్చులూడిన వంతెనలు, నెర్రెలు వచ్చిన గోడలకు మరమ్మతు చేయకుండానే రంగులు వేసి సరిపెడుతున్నారు. పైపైన రంగుల పూతలు, నాసిరకం పనులతో గుత్తేదారులు సరిపెడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

నగర సుందరీకరణ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించటం కోసం గుంటూరు నగరపాలక సంస్థ వివిధ రకాల పనులు చేపడుతోంది. దీనికోసం భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నా... ఆ పనులకు సార్థకత ఉండడం లేదు. ముఖ్యంగా డివైడర్లు, వంతెనలు, గోడలకు రంగులు వేసే పనులు ప్రణాళికాబద్ధంగా సాగడం లేదు. డివైడర్‌కు వేసిన రంగులు అందంగా కనిపించాలంటే కనీసం దానిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగించి తొలుత సున్నం వేయాలి. మక్కు పెట్టిన తర్వాత చివరిగా పెయింటింగ్‌ వేయాలి. ఇలా చేస్తే ఆ రంగుల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో.. ఏం రంగులు వేస్తున్నారో, వాటి నాణ్యత ఏమిటో పట్టించుకోవడం లేదు. పనులు దక్కించుకున్న గుత్తేదారులు అడ్డదిడ్డంగా రంగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా డివైడర్‌కు ప్యాచ్‌ వర్కులు ఉంటే వాటికి మరమ్మతు చేయకుండానే రంగులేసి గుత్తేదారులు చేతులు దులిపేసుకుంటున్నారు.

అవగాహన శూన్యం... స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో భాగంగా రంగులు వేస్తున్నామని చెబుతున్న అధికారులు.. ఆ స్ఫూర్తి ప్రజలకు తెలియజేయటం మరిచారు. ప్రజల్ని సైతం సుందరీకరణ, స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్తుల్ని చేసే సందేశాలు ఎక్కడా కనిపించటం లేదు. కనీసం తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు ఎలా అందించాలో తెలిపే బొమ్మలు కూడా లేవు. అసలు నగరంలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతు విషయం మర్చిపోయిన అధికారులు.. రంగులు వేసి అందంగా చేశామని చెబితే ఉపయోగం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఇలాంటి పనులు చేయిస్తున్న అధికారులు వాటి నాణ్యత విషయం కూడా ఆలోచించాలంటున్నారు.

నాసిరకమైన రంగులు వాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారు. ఒక్క వర్షం వచ్చినా రంగు అంతా కొట్టుకుపోతుంది. ఏ మాత్రం మరమ్మతు లేకుండా రంగులు వేసి మమ అనిపిస్తున్నారు. కనీసం ఇళ్ల ముందు గుంతలైనా పూడ్చాలి. - సిరిపురపు శ్రీధర్, ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు

డివైడర్లకు వేస్తున్న రంగులు గమనిస్తే.. పైన పటారం లోన లొటారం అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులు బయట నుంచి వచ్చిన వాళ్లు చూస్తే నమ్ముతారేమో గానీ, స్థానిక ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాధనం వృథా కావడం దారుణం. -కొండా శివరామిరెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి

పనులు ప్రారంభించాక టెండర్లు.. పనులకు సంబంధించి టెండర్ల కేటాయింపులోనూ యంత్రాంగం రహస్యంగా వ్యవహరించింది. రంగులు వేయటం మొదలుపెట్టిన తర్వాతే టెండర్లు నిర్వహించి పనులు కట్టబెట్టిన విషయం బయటకొచ్చింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్‌ నోటిఫికేషన్‌ పెట్టి పారదర్శకంగా చేపట్టాల్సిన నగరపాలక అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్ 11వ తేదీన మైనార్టీ దినోత్సవం సందర్భంగా సీఎం గుంటూరు వచ్చినప్పుడు హడావుడిగా డివైడర్లకు రంగులు వేయించారు. నాలుగు నెలలకే మళ్లీ అవే డివైడర్లకు రంగులు వేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రజాప్రతినిధులు తమ వాటాలు, దోపిడీ కోసం సుందరీకరణ పేరుతో పనులు చేపడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరమ్మతు తర్వాతే రంగులు వేయాలని, ఉన్నతాధికారులు సైతం పనుల్ని పర్యవేక్షించాలని సూచిస్తున్నారు.

నాసిరకం పనులపై సర్వత్రా విమర్శలు... స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు కేవలం రంగులు చూసి రావు. నగరంలో ప్రజలకు అందుతున్న సేవలు, స్వచ్ఛత విషయంలో చేపట్టిన కొత్త తరహా కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలన్నీ ప్రాతిపదిక చేసుకుంటారు. కానీ వాటి విషయంలో దృష్టి సారించని యంత్రాంగం, పాలకమండలి సుందరీకరణ పేరుతో ఇలా నాసిరకం పనులు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని రగిలించేలా, చైతన్యం తెచ్చేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే నగరంలో ప్రజారోగ్యం మెరుగుపడి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

పనులపై పర్యవేక్షణ కొరవడింది. ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది. సుందరీకరణ పనులపై కమిషనర్ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకోవాలి. - పి.సమత, కార్పోరేటర్, గుంటూరు

పూర్తిగా దోపిడీ జరుగుతోంది. అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు. పని తీరు మార్చుకోవాలని చెప్తున్నా మారడం లేదు. ఇదే విషయాన్ని కౌన్సిల్ లో ప్రస్థావిస్తాం. - బాలాజి, కార్పోరేటర్, గుంటూరు

నగరంలో ప్రజా సమస్యలతో పాటు పెండింగ్ పనులు పక్కనపెట్టారు. ప్రజలను మోసం చేసేలా రింగు రోడ్లలో రంగులు వేస్తున్నారు. వేసవి ప్లానింగ్ పై పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదు. -బాబు, కార్పోరేటర్, గుంటూరు

గుంటూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ పనులు

ఇవీ చదవండి :

Last Updated :Mar 29, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.