ETV Bharat / state

Guntur people Problems: వైఎస్సార్​సీపీ నాయకుల ఇళ్ల వరకే రోడ్డు.. సామాన్యులకు ఇబ్బందులు

author img

By

Published : Jul 7, 2023, 9:32 AM IST

Updated : Jul 7, 2023, 3:53 PM IST

Guntur Balajinagar people Problems: వైఎస్సార్​సీపీ నేతల ఇళ్ల కోసం వార్టులో కొత్త రోడ్డు వేసేందుకు నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. ఇలాగైనా వీధి మొత్తం కొత్త రోడ్డు వస్తుందని స్థానికులు సంబరపడ్డారు. ఉన్న రోడ్డు కంటే భారీగా ఎత్తు పెంచేసి నాయకుల ఇళ్ల వరకు మాత్రమే వేయడంతో.. కాలనీ వాసులకు కొత్త సమస్యలు తెచ్చాయి. కొత్త రోడ్డుతో మిగతా రోడ్డు మురుగునీటితో నిండిపోయి దుర్గంధభరితంగా మారడంతో.. బాధిత ప్రజలు భగ్గుమంటున్నారు.

వైసీపీ నేతలకు స్వామిభక్తి చాటుకుంటున్న అధికారులు.. వారి ఇళ్లకు మాత్రమే రోడ్డు
Guntur people Problems

వైఎస్సార్​సీపీ నాయకుల ఇళ్ల వరకే రోడ్డు.. సామాన్యులకు ఇబ్బందులు

Guntur Balajinagar people Problems: గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల అవగాహనారాహిత్యం ప్రజలకు తీవ్ర కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పాత గుంటూరులోని బాలాజీనగర్​లో అధికార పార్టీ నేతల ఇళ్లకు రోడ్డు వేసే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో.. ఆ ప్రాంతంలో మురుగునీటి రోడ్లపైకి చేరింది. ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన అధికార యంత్రాంగమే ఇలా సమస్యలు సృష్టించటం ఏమిటని స్థానికులు ఆందోళనకు దిగారు.

ఓవైపు ఎత్తులో నిర్మించిన సిమెంట్ రహదారి.. మరోవైపు మురుగునీటితో కంపు కొడుతున్న రోడ్డు.. ఇవి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బాలాజీ నగర్ 9వ లైన్లోని దృశ్యాలు. ఈ ప్రాంతంలో నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన రోడ్డు నిర్మాణం ఆ ప్రాంత వాసులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఈ వీధిలో అధికార పార్టీకి చెందిన వారు నివశిస్తుండటంతో వారుండే ప్రదేశం వరకు మాత్రమే సిమెంట్ రోడ్డును మూడు అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టారు. వీధి మొత్తం కాకుండా కొంతమేరకే రోడ్డు వేశారు. దీంతో మీగతా రోడ్డంతా పల్లంగా మారింది. పనులు ప్రారంభించే సమయంలో మాత్రం వీధి చివరి వరకూ రోడ్డు వేస్తామని చెప్పిన అధికారులు.. కొద్దిదూరం మాత్రమే నిర్మించి వదిలేశారు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లపు ప్రాంతంలో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. రహదారి ఎత్తుగా నిర్మించిన వైపు కాలువలు కూడా ఎత్తులోనే ఉన్నాయి. దీంతో అటుగా వెళ్ళాల్సిన వర్షపునీరు, మురుగునీరు ఇవతలి వైపే నిలిచిపోతున్నాయి. దీంతో మురుగునీటితో ఆ ప్రాంతం దుర్గంధభరితంగా మారింది. అదే నీటిలో రాకపోకలు సాగిస్తే ఏం రోగాలు వస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మురుగునీటి కారణంగా దోమలు పెరిగి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా పొంచి ఉందని చెబుతున్నారు.

ఒకేవీధి అయినప్పటికీ ఈ ప్రాంతం రెండు డివిజన్ల పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ రహదారిలో మురుగుకాలువలు, రోడ్డు అభివృద్ధి పనులు తమవి కాదన్నట్లు కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభంలో కురుస్తున్న చిన్న వర్షాలకే మురుగునీరంతా ఇళ్లలోకి వస్తోంది. ఇక భారీ వర్షాలు వస్తే ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మురుగు కాలువల్ని నెలకోసారి కూడా శుభ్రం చేయించని అధికారులు.. కొందరి మెప్పుకోసం రోడ్డు నిర్మాణాన్ని వడివడిగా చేపట్టి కొత్త సమస్య తెచ్చిపెట్టారంటూ గగ్గోలు పెడుతున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగటం లేదని ఇటీవలి కాలంలో గొంతెత్తిన ఎమ్మెల్యే ముస్తఫా ఇక్కడి ప్రజల సమస్యను మాత్రం పట్టించుకోలేదు. తనకు రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే మాట్లడాతారా.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోరా అనే విమర్శలు వస్తున్నాయి.

Last Updated :Jul 7, 2023, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.