ETV Bharat / state

GDCCB: డీసీసీబీ సొసైటీల్లో అక్రమాలపై చర్యలకు పాలకవర్గం తీర్మానం

author img

By

Published : Mar 18, 2022, 9:20 PM IST

Guntur DCCB News: గుంటూరు జిల్లాలోని డీసీసీబీ సొసైటీల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసింది. ఏడు బ్యాంకుల మేనేజర్లను సస్పెండ్​ చేయాలని తీర్మానించింది. ఈమేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం అత్యవసర సమావేశమైంది.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు
GDCCB Governing Body Meeting

గుంటూరు జిల్లాలోని ఏడు డీసీసీబీ సొసైటీల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ ఏడు బ్యాంకుల బ్రాంచి మేనేజర్లను సస్పెండ్​ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలోని డీసీసీబీ సొసైటీల్లో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం అత్యవసర సమావేశమైంది. డీసీసీబీ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి బ్యాంకు సీఈవోతోపాటు నాబార్డు నుంచి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సొసైటీల్లో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణపై చర్చించారు.

సమావేశం తీర్మానాలు..

డీసీసీబీ సొసైటీల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసింది. ఏడు బ్యాంకుల బ్రాంచి మేనేజర్లపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు ఆయా సొసైటీల సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు సంబంధిత సొసైటీ అధ్యక్షులకు పాలకవర్గం సూచించింది. గుంటూరు, కొరిటపాడు, కాకుమాను, తుళ్లూరు, ఫిరంగిపురం, ఉండవల్లి, ప్రత్తిపాడు బ్రాంచి మేనేజర్లు సస్పెండ్​ చేసింది. ఈ వ్యవహారంలో కార్యదర్శుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.

మొత్తం 16 సొసైటీల్లో అక్రమాలు..

జిల్లాలో మొత్తం 16 సొసైటీల్లో అక్రమాలు జరిగాయి. నకిలీ పాసు పుస్తకాలు పెట్టి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల పేరుతోనూ రుణాలు పొందారు. వీటన్నింటిపై ఈటీవీ భారత్​, ఈనాడులో వరుస కథనాలు వచ్చాయి. దీంతో విపక్షాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రూ. 500 కోట్ల మేర అవినీతి జరిగిందని.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని తెదేపా నాయకులు ఆరోపించారు. దీంతో మొత్తం వ్యవహారంపై సమీక్షించేందుకు డీసీసీబీ పాలకవర్గం సమావేశమైంది. లోన్లు తీసుకున్నవారు సంబంధిత సొసైటీకి చెందినవారు కాకపోయినా.. రుణాలు ఎలా ఇచ్చారని విచారించారు.

అయితే కొన్నిచోట్ల ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే రుణాలు మంజూరు చేసినట్లు మేనేజర్లు చెబుతున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న డీసీసీబీలో ఇంతటి భారీస్థాయి అక్రమాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ స్థాయిలో అక్రమాలు జరగడం బ్యాంకు ప్రతిష్ఠకే ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశమైన పాలకవర్గం.. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసింది.

ఇదీ చదవండి: అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.