ETV Bharat / state

Ganja Gangs: రాష్ట్రంలో మితిమీరిపోతున్న గంజాయి ముఠాల అరాచకాలు.. ఏమిలేవన్నట్లుగా అధికార యంత్రాంగం..

author img

By

Published : Jul 27, 2023, 9:07 AM IST

Updated : Jul 27, 2023, 10:41 AM IST

Ganja Gangs In AP: రాష్ట్రంలో గంజాయి గ్యాంగులు పెట్రేగిపోతున్నాయి. గంజాయి మత్తులో తూలుతూ గంజాయి గ్యాంగులు చేసే అరాచకాలు అన్నీఇన్నీ కాదు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎక్కడ చూసినా.. నేరగాళ్లను మించిపోయేలా ఈ గంజాయి గ్యాంగుల పాశవికత్వం కనిపిస్తోంది. దాడుల నుంచి కిడ్నాప్​ల వరకు వీరు చేయని నేరాలు లేవు.

గంజాయి
Ganja Gangs

రాష్ట్రంలో మితిమీరిపోతున్న గంజాయి ముఠాల అరాచకాలు

Ganja Gangs increased in Andhra Pradesh: ఇంట్లో ఉన్నా చొరబడి మరీ కత్తులతో నరికేస్తారు.. బయటకొస్తే వాహనాలతో ఢీకొట్టి దాడులకు తెగబడతారు.. బడికెళ్లే చిన్నారుల గొంతులను బ్లేడుతో కోసేస్తారు. నగరం నడిబొడ్డున కిరాతకంగా అంతం చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే రక్తమోడేలా కొడతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పగతో ప్రతీకారం తీర్చుకుంటారు. గట్టిగా నిలదీస్తే మారణాయుధాలతో చెలరేగిపోతారు. హత్యలు, అపహరణలు, అత్యాచారాలు, దాడులు, దారుణాలు.. ఇలా ఒకటేమిటి, కరుడుగట్టిన నేరగాళ్ల ముఠాలను తలదన్నేలా రాష్ట్రంలో గంజాయి గ్యాంగులు పేట్రేగిపోతున్నాయి.

మరి జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? ముఠాలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది? రాష్ట్రంలో 60 వేలమందికిపైగా ఉన్న పోలీసు యంత్రాంగం.. వందల్లో ఉన్న ముఠాలను ఎందుకు అరికట్టలేకపోతోంది? చేత కాలేదా? లేక చేతులు కట్టేశారా? ప్రజలడిగే ఈ ప్రశ్నలకు జగన్‌ సర్కార్‌ సమాధనం ఇవ్వగలదా..?

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు: జగన్‌ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం, ఉదాసీనత, వైఫల్యానికి పరాకాష్ఠగా గంజాయి ముఠాలు తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నాయి. మత్తులో జోగుతూ, తూలుతూ విశృంఖలంగా వ్యవహరిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఎక్కడ చూసినా గంజాయి గ్యాంగుల అరాచకమే. అన్ని నేరాల్లో వీరి ప్రమేయమే. ఊరూరా గంజాయి లభ్యత వెనక అధికార వైసీపీ నాయకులే ఉంటున్నారు. గంజాయికి బానిసలుగా మారి కొందరు నేరాల బాట పడుతుంటే.. ఇప్పటికే నేర ప్రవృత్తిలో ఉన్నవారు మరింత హింసాత్మక నేరాలకు తెగబడుతున్నారు.

గంజాయి మత్తులో ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో​ రెచ్చిపోయి: ఏరా! ఇది ఎమ్మెల్యే కారు కనబడట్లేదా? ఎమ్మెల్యే బండికే అడ్డం వస్తావా? అంటూ గంజాయి గ్యాంగు ఒకటి అనంతపురం జిల్లాలో దాడులకు తెగబడింది. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేరుతో స్టిక్కర్‌ అతికించి ఉన్న కారులో ఓ యువకుడు, నలుగురు మైనర్లు గంజాయి తాగుతూ జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు.. తమ వాహనానికి దారి ఇవ్వలేదని.. ఓ ద్విచక్ర వాహనదారును కొట్టారు. అతని వద్దనున్న 18 వేలు, సెల్‌ఫోన్‌ దోచుకున్నారు. మరో 3 వేలు ఫోన్‌ పే ద్వారా వేయించుకున్నారు. కొంతదూరం వెళ్లాక ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాంగును ఆపడానికి పోలీసులు రోడ్డుపై ఓ పొక్లెయిన్‌, ట్రాక్టర్‌ అడ్డం పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారులో విచ్చలవిడిగా వ్యవహరించినా ఎవరూ ఏమీ చేయలేరన్న లెక్కలేనితనమే వారి బరితెగింపునకు కారణమైంది.

"ఏరా కళ్లు కనబడటం లేదా.. సైరన్​ వేసిన వినబడటం లేదా ఇది ఎమ్మెల్యే బండి అని తిట్టారు. సారీ చెప్పిన కూడా వదలలేదు. నాపై దాడి చేయటమే కాకుండా నగదు లాక్కున్నారు."-బాధిత యువకుడు

"దారుణంగా హింసించటం, కొట్టడం, దుర్భాషలాడటం వంటివి చేశారు. గంజాయి మత్తులో ఉన్నారు. వీళ్ల ఎదురుగానే మద్యం సేవిస్తున్నారు. వీళ్లని బయపెట్టే విధంగా క్రిమినల్​గా వీరితో వ్యవహరించారు."- విశాఖ ఎంపీ

తన కుటుంబసభ్యులను కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు గంజాయి, మద్యం మత్తులో మునిగి తేలారు అంటూ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు. ఎంపీ భార్య, కుమారుడితో పాటు ఆయనకు సన్నిహితుడైన ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేసిన రౌడీషీటర్లు రెండురోజుల పాటు గంజాయి సేవిస్తూ ఆ మత్తులో బందీల కాళ్లు, చేతులు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. రాష్ట్రంలో గంజాయి రాజ్యం ఏలుతోంది అనేందుకు ఇంతకన్నా రుజువు ఏం కావాలి.

ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే: తాడేపల్లి సీఎం జగన్‌ నివాసం ఉంటున్న ప్రాంతం. డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉంది. కట్టుదిట్టమైన పోలీసు నిఘా కొనసాగే హైసెక్యూరిటీ జోన్‌. అలాంటి ప్రాంతంలోనూ గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సీఎం ఇంటికి సమీపంలో నివసించే అంధబాలికని కుక్కల రాజు అనే యువకుడు గంజాయి మత్తులో నరికి చంపేశాడు. కాబోయే భర్తతో కలిసి కృష్ణా తీరంలో విహారానికి వెళ్లిన ఎస్సీ యువతిపై ముగ్గురు యువకులు గంజాయి తాగి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

2021 జూన్‌లో సీఎం జగన్‌ ఇంటికి చేరువలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో రెండో నిందితుడైన రామలింగం వెంకట ప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకటరెడ్డిని పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేదు. గంజాయి తాగిన ముగ్గురు యవకులు.. తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఓ యువతిని వెంటాడి వేధించారు. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు తొలుత స్పందించలేదు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచార కావడంతో హడావుడిగా ఆ యువతిని పిలిపించి ఫిర్యాదు స్వీకరించారు. సీఎం నివాస ప్రాంానికి సమీపంలోనే ….తీవ్రస్థాయిలో గంజాయి నేరాలు జరుగుతున్నాయంటే.. రాష్ట్రంలోని మిగతాచోట్ల ఎంతటి దారుణ పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అధికారులుండే గుంటూరులో సైతం.. గుంటూరులో గత మార్చిలో ఇద్దరు మైనర్లు గంజాయి మత్తులో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ద్విచక్రవాహనంపై విచ్చలవిడిగా తిరుగుతూ ఇద్దరు కాపలాదారులను చంపేశారు. మరో ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచారు. రెండుగంటల పాటు రెచ్చిపోయారు. ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులుండే నగరంలో ఇంత జరిగినా పోలీసులకు తెలియలేదు. గస్తీ, నిఘా కొరవడటంతో గంజాయి గ్యాంగులు రెచ్చిపోయాయి. ఆ ఘటన తర్వాతైనా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా అంటే.. అదీ లేదు. ఈ ఉదాసీనతే గ్యాంగుల నేరాలకు ఊతమిస్తోంది.

మత్తులో పాశావికంగా: శ్రీకాకుళంలోని దమ్మలవీధిలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు టీడీపీ నాయకుడు కేశవ రాంబాబుపై దాడి చేశారు. ఆయన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డుకడ్డంగా వీరంగం సృష్టించారు. వాహనానికి దారివ్వాలని అడిగినందుకు రాంబాబు తలపై ఇనప రాడ్‌తో కొట్టారు. కత్తితో పొడిచేందుకు ప్రయత్నించారు. వాహనంపై నుంచి కిందకు నెట్టేసి దాడిచేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై షేక్‌ ఖాదర్‌ బాషా అనే యువకుడు గంజాయి మత్తులో దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు.

విజయవాడ సమీపంలోని పెనమలూరు వద్ద అజయ్‌సాయి అనే యువకుడిని మరికొందరు యువకులు గంజాయి మత్తులో ఇయర్‌బడ్స్‌ కోసం చంపేశారు. విజయవాడలోని భవానీపురం అవుట్‌ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి మత్తులో ఒక రౌడీషీటర్‌ను మరో రౌడీషీటర్‌, మరికొందరు హత్య చేశారు. గంజాయి మత్తులో తూలుతూ మూడు రోజులు ఆ శవాన్ని వారి మధ్యే ఉంచుకున్నారు. విజయవాడలోని చిట్టినగర్‌లో ఈ మధ్య రెండు గ్యాంగుల గంజాయి మత్తులో పట్టపగలే కత్తులతో దాడులు చేసుకున్నాయి.

తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు సహా రాష్ట్రంలోని అనేక నగరాల్లో.. ఇదే విధంగా గంజాయి మత్తులో గ్యాంగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల రౌడీషీటర్లే ఈ గంజాయి గ్యాంగులను పెంచి పోషిస్తున్నారు. వారెవరో పోలీసులకు తెలిసినా చర్యలు ఉండటం లేదు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అక్రమంగా ఇరికించేందుకు గంజాయి కేసులు ప్రయోగిస్తున్నారన్న విమర్శలున్నాయి.

Last Updated : Jul 27, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.