ETV Bharat / state

భారాసలోకి భారీగా చేరనున్న ఏపీ నేతలు.. లిస్టులో తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు

author img

By

Published : Jan 1, 2023, 5:02 PM IST

Updated : Jan 1, 2023, 10:47 PM IST

భారాసలోకి భారీగా చేరనున్న ఏపీ నేతలు
భారాసలోకి భారీగా చేరనున్న ఏపీ నేతలు

16:48 January 01

కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరనున్న తోట చంద్రశేఖర్

భారాసలోకి భారీగా చేరనున్న ఏపీ నేతలు

BRS in AP: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న భారత్‌ రాష్ట్ర సమితి.. ఆ దిశగా పార్టీని విస్తరించే కార్యక్రమాలు వేగవంతంచేసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకమయ్యేందుకు కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందులోభాగంగా.. అక్కడి రాజకీయనాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు అఖిలభారత సర్వీసుల్లో పనిచేసి.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నవారిని బీఆర్​ఎస్​లోకి ఆహ్వానిస్తున్నారు.

బీఆర్​ఎస్​లోకి తోట చంద్రశేఖర్: జనసేన నేత తోట చంద్రశేఖర్.. బీఆర్​ఎస్​ చేరేందుకు రంగం సిద్ధమైంది. ఐఏఎస్​ అధికారిగా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తోట చంద్రశేఖర్‌.. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున ఏలూరు పార్లమెంట్‌ స్థానంలో బరిలోదిగి ఓటమి చెందారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీచేసినా విజయం వరించలేదు. 2020 నుంచి జనసేనకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్.. పార్టీని ఏపీకి విస్తరిస్తుండటంతో అందులో చేరి అదృష్టం పరిక్షించుకోవాలని భావిస్తున్నారు.

చంద్రశేఖర్‌తోపాటు మాజీమంత్రి రావెల కిశోర్ బాబు.. బీఆర్​ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. ఐఆర్​ఎస్ అధికారిగా రాజీనామాచేసి 2014లో టీడీపీలో చేరి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రావెల ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవికోల్పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉండి.. 2018లో జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు.

ప్రస్తుతం బీఆర్​ఎస్ వైపు మొగ్గు: అనంతరం రావెల.. బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. దాదాపు ఏడాది క్రితం బీజేపీని వీడిన రావెల.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీఆర్​ఎస్ వైపు మొగ్గుచూపారు. 2019లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున పోటీ చేసిన చింతల పార్థసారథి.. బీఆర్​ఎస్ గూటికి చేరనున్నారు. 2019లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ అనుకూలంగా లేకపోవడంతో.. బీఆర్​ఎస్​ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్థసారథి గతంలో ఐఆర్​ఎస్​ అధికారిగా పనిచేసి.. ముందస్తు పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు.

విజయవాడలో బీఆర్​ఎస్​ కార్యాలయం: విజయవాడలో బీఆర్​ఎస్​ కార్యాలయం ఏర్పాటు కోసం కొందరు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలో కార్యాలయం ప్రారంభించనున్నారు. ఆ లోగా కొందరు నేతలను బీఆర్​ఎస్​లో చేర్చుకోవటం ద్వారా.. పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లటం సులువవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ బీఆర్ఎస్ తరఫున కార్యకలాపాలు మొదలయ్యాయి.

అక్కడ విద్యార్థి, యువజన విభాగాలు ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఏపీ స్టూడెంట్స్, యూత్ జేఏసీకి చెందిన రాయపాటి జగదీష్ ఈమేరకు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీని ధీటుగా ఎదుర్కోవటంలో కేసీఆర్ ముందున్నారని.. అందుకే బీఆర్​ఎస్​ కార్యకలాపాల్లో భాగస్వామ్యులయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

తెలంగాణకు హైదరాబాద్ కామధేనువు.. : మంత్రి కేటీఆర్‌

Last Updated : Jan 1, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.