ETV Bharat / state

Fire accident: అయ్యో.. వలస కార్మికులు.. ఆరుగురి ప్రాణాలు అగ్గిపాలు..!

author img

By

Published : Jul 31, 2021, 6:04 AM IST

Updated : Jul 31, 2021, 9:36 AM IST

విరివిగా రసాయనాల వాడకం.. కాగితాలకే పరిమితమైన పర్యావరణ నిబంధనలు.. పట్టించుకోని అధికార యంత్రాంగం.... వెరసి పేదల బతుకులను బుగ్గిపాలు చేశాయి. గుంటూరు జిల్లా లంకవానిదిబ్బలో రొయ్యల చెరువుల్లో పనిచేసేందుకు వచ్చే వారికి కనీస వసతులు కల్పించకపోవడం వారి ప్రాణాల మీదకి వచ్చింది. రేపల్లె మండలం లంకెవానిదిబ్బ సమీపంలో రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది.

six migrant workers
రొయ్యల చెరువు వద్ద అగ్నిప్రమాదం

నిరుపేద కుటుంబాలకు చెందినవారు పొట్టకూటి కోసం ఒడిశా నుంచి గుంటూరు జిల్లాకు వలస వచ్చారు. ఊహించని విధంగా అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో నిద్రలోనే మృత్యుఒడికి చేరారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. మరో ఆరుగురు త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. రాయగఢ్ జిల్లాకు చెందినవారు ఇక్కడి బెయిలీ ఆక్వాఫాంలో మేత వేయటం, రసాయనాలు చల్లడం, మోటార్ల నిర్వహణ, కాపలా కాయటం వంటి పనులు చేస్తుంటారు. చెరువు పక్కనే ఉన్న షెడ్లలో వీరికి వసతి కల్పించారు.

పది మంది నిద్రిస్తున్న షెడ్డులో గురువారం రాత్రి 11.45కు పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. వేడికి గదిలో నిద్రిస్తున్న వారిలో నలుగురికి మెలకువ వచ్చి బయటకు పరుగుతీశారు. గది బయట మంచంపై నిద్రిస్తున్న సూపర్‌వైజర్లు జి.లింగారావు, పి.బాపిరెడ్డిలను నిద్రలేపారు. పొగ ధాటికి వారు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈలోగా పక్క గదుల్లో ఉన్నవారు లేచి వచ్చి తీవ్రంగా శ్రమించి మంటలార్పారు.

కాస్త చల్లబడ్డాక చూస్తే లోపల ఆరుగురు గుర్తుపట్టలేని విధంగా బూడిదగా మారారు. ప్రమాద స్థలం భయానకంగా ఉండటం, మృతదేహాలను ముట్టుకుంటే రాలిపోయేలా కనిపించడంతో పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. అక్కడే పంచనామా నిర్వహించారు. మృతుల్లో ఒకరు మినహా అందరూ బాలకార్మికులేనని వారి స్వస్థలాలనుంచి అందిన సమాచారంబట్టి తెలుస్తోంది. ఇక్కడి అధికారులు మాత్రం ముగ్గురు 18ఏళ్ల వారని, ఇద్దరు 19, ఒకరు 23ఏళ్లవారని స్పష్టం చేస్తున్నారు. కుటుంబీకులు వచ్చాక మృతదేహాలను తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. మృతదేహాలు ఇప్పటికీ దుర్ఘటన స్థలం వద్దే ఉన్నాయి.

దోమల కాయిల్స్‌ వల్లే ప్రమాదమా?

గదిలో జరిగిన ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణమని తొలుత అందరూ భావించారు. ఈ దాఖలాలు లేవని విద్యుత్‌ సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన గదిలో రొయ్యల చెరువులో రసాయనాలు, బ్లీచింగ్‌ పౌడర్‌ బస్తాలున్నాయి. మండే స్వభావం ఉండే ఫార్మాల్డిహైడ్‌ను ఇక్కడ వాడుతున్నారు. అది మండినప్పుడు వచ్చే పొగ వల్ల స్పృహ కోల్పోయే ప్రమాదముంది. రాత్రివేళ దోమలు కుట్టకుండా వెలిగించిన కాయిల్స్‌ ఈ రసాయనంపై పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఫోరెన్సిక్‌ బృందం ఆధారాలను సేకరించింది. వారి నివేదిక ఆధారంగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూటా? ఇతర కారణాలా? తెలుస్తాయని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.

అంతా విద్యార్థులేనా?

రాయగడ జిల్లా గుణుపురం సమితి పుల్లుపుటి గ్రామానికి చెందిన కరుణాకర సబర (14), పాండవ సబర (17), మోహన సబర (13), జుంపాపూర్‌కు చెందిన రామ్మూర్తి సబర (15), మోతీలాల్‌నగర్‌కు చెందిన నవీన్‌ సబర (23), గజపతి జిల్లా సనోతుండి గ్రామానికి చెందిన మహేంద్ర సబర (15) మరణించారని ఒడిశాలోని మృతుల సంబంధీకులు చెబుతున్నారు. పిల్లలంతా వివిధ పాఠశాలల్లో చదువుతున్నట్లు సమాచారం.

‘కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూతపడటం, ఆన్‌లైన్‌ చదువులు కొనసాగుతుండడంతో పనికి వెళ్లి సంపాదించిన డబ్బుతో స్మార్ట్‌ఫోను కొనుక్కోవచ్చనే ఆశ చూపి మధ్యవర్తులు మా పిల్లలను తీసుకెళ్లారు. పనిచేస్తున్నా డబ్బులివ్వడం లేదని, తిరిగి వచ్చేస్తున్నామని బుధవారంవారు రైల్వేస్టేషన్‌ నుంచి ఫోన్‌ చేసి మాకు చెప్పారు. చెరువు పనులు చేయించే యజమాని స్టేషన్‌కు వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చేసి ఉంటే ప్రాణాలు దక్కేవి. గురువారం అర్ధరాత్రి దాటాక వారు చనిపోయారని ఫోన్‌ చేశారు’ అని కుటుంబీకులు రోదిస్తున్నారు. 18 ఏళ్లలోపువారితో పనులు చేయించడం నేరమని, వారిని తీసుకెళ్లిన వారిపై కేసు నమోదు చేయిస్తామని గుణుపురం కార్మిక అధికారి స్వాతిలగ్న పద్రా తెలిపారు.

ఆరుగురి ప్రాణాలు అగ్గిపాలు

ఇదీ చదవండి..

murder: కోడలిని కత్తితో నరికి హత్య చేసిన మామ

Last Updated : Jul 31, 2021, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.