Farmers Self Cleaned Field Drains: వ్యవసాయ పనులు ప్రారంభించే నాటికి వర్షాలు పడితే అన్నదాతలకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ఐతే పాలకుల నిర్లక్ష్యానికి ఆ సంతోషం ఎంతో సమయం ఉండటం లేదు. డ్రైయిన్లలో పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికే నీరు పంట పొలాల్లోకి చేరి అవి చెరువుల్ని తలపిస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో రైతులే చందాలు వేసుకుని కాలువల్ని శుభ్రం చేస్తున్నారు. నాలుగేళ్లుగా పూడికల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ పనులు జోరందుకున్నా.. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం పంటకాలువలు, డ్రెయిన్ల నిర్వహణను గాలికొదిలేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూడికలు తీయకపోవడంతో కొల్లిపర మండలంలోని డ్రెయిన్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ గుర్రపుడెక్క, తూటికాడ పెరగడంతో మురుగు ముందుకు పోకుండా నిలిచిపోయిందని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు వెళ్లే మార్గం లేక పంట పొలాలు నీట మునిగాయని కొల్లిపర మండలంలోని అత్తోట, కుంచవరం, మున్నింగి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కృష్ణాడెల్టా పరిధిలో కాలువల నిర్వహణను పట్టించుకున్న నాథుడే లేరని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని కాలువల్లో పూడిక తీయించుకున్నామని చెబుతున్నారు.
Rayalaseema Canals Ruins: పంట కాలువలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం
"చాలా రోజులుగా కాలువలో నీరు నిలబడిపోయింది. మురుగుపోయే పరిస్థితి లేదు. కొన్ని పొలాల్లో నీరు అలాగే నిల్వ ఉంది. పంటలు వేసి ఉన్నాయి. ముందుగా పూడిక తీసి ఉంటే వచ్చిన నీరు వచ్చినట్లు పోయి ఉండేది." -రైతు
"ఇంతకముందు కాలువ పూడికలను ప్రభుత్వమే తీయించేది. ఇప్పటి ప్రభుత్వం వచ్చినా తర్వాత మమ్మల్ని పట్టించుకున్నదే లేదు. ఇప్పుడు మేమే సొంతంగా తీయించుకుంటన్నాము." -రైతు
కొల్లిపర మండలంలో సుమారు 22 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. అందులో 14 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు వర్షాలు పడగానే వరి ఎద పెట్టారు. ఐతే పూడిక సమస్యలతో వాన నీరు ముందుకు వెళ్లే మార్గం లేకపోవడంతో అవి వరి పొలాల్లోకి వచ్చి చేరాయి. దీంతో వేల రూపాయల పంట పెట్టుబడి.. నీటి పాలైందని బాధిత రైతులు వాపోతున్నారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా.. నిధుల కొరత కారణమంటూ చేతులెత్తేశారు. ఎన్నిరోజులైనా నీరే వెళ్లే మార్గం కనిపించకపోవడంతో రైతులే సొంత ఖర్చులతో కాలువ శుభ్రం చేయించినట్లు చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న కొల్లిపర, నందివెలుగు, దుగ్గిరాల ,తెనాలి మండలంలోని గ్రామాల్లో సైతం పంట కాలువలు పూడికతో నిండిపోయి రైతులకు సమస్యగా మారాయని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని పూడికలు తీసి సాగునీరుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీటి సంఘాలు ఉన్నప్పుడు, నీటి సంఘాల అధ్యక్షులు నీటి పారుదల, వ్యవసాయ శాఖలను సమన్వయం చేసుకుంటూ కాలువ నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకునేవారని.. ఇప్పుడా ఆ పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదంటున్నారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి కృష్ణాడెల్టా ప్రాంతంలోని పంట కాలువలు, డ్రెయిన్ల పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.