ETV Bharat / state

వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలిదశ నిధులు మంజూరు

author img

By

Published : Dec 2, 2020, 10:19 AM IST

పల్నాటి రైతులు కలవరించే వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కాలం కలిసొచ్చింది. దశాబ్దాల నిరీక్షణకు కాలం చెల్లేరోజు దగ్గర పడింది. ప్రస్తుత ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని వరికపూడిశెల తొలిదశ నిర్మాణానికి రూ.340 కోట్లను మంజూరు చేసింది.

early-funding-for-construction-of-varikapudisaila-uplift-scheme
వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలిదశ నిధులు మంజూరు

చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పల్నాడు వాసుల గొంతు తడవడం లేదు. గుంటూరు జిల్లాలోని అతి తీవ్ర కరవు ప్రాంతాలైన వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాల వాసులకు తాగు, సాగునీరు అందని పరిస్థితి. దశాబ్దాలుగా రైతుల ఆందోళనతో వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రులు శంకుస్థాపన శిలాఫలకాలు వేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎప్పటికప్పుడు సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభించలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం వరికపూడిశెల తొలిదశ నిర్మాణానికి రూ.340 కోట్లను మంజూరు చేసింది. టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేయడంతో కదలిక మొదలైంది. ఈప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ)లో చేర్చింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టుకు నిధులు అందిస్తారు. దీంతో నిధుల సమస్య కూడా లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలిదశలో వెల్తుర్తి మండలానికి, మలిదశలో దుర్గి, బొల్లాపల్లి మండలాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అటవీశాఖ అనుమతులు రెండు దశలకు ఒకేసారి తీసుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి మండలాలు. వినుకొండ నియోజకర్గంలోని బొల్లాపల్లి మండల పరిధిలో 72,776 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. వెల్దుర్తి మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం ద్వారా కృష్ణానది నుంచి నీటిని బయటకు తోడనున్నారు. ఇక్కడ నుంచి పైపులైన్ల ద్వారా చెరువులు, నీటికుంటలు నింపి వ్యవసాయ భూములకు నీటిని మళ్లించనున్నారు. వెల్దుర్తి మండలం మొత్తం గ్రామాలు, దుర్గి మండలంలో సాగర్‌ కాలువల ద్వారా నీరు అందే ప్రాంతం మినహా మిగిలిన భూభాగానికి నీరు ఇస్తారు. బొల్లాపల్లి మండలానికి పూర్తిస్థాయిలో కృష్ణా జలాలు అందించనున్నారు.

అటవీ భూముల సేకరణ వేగవంతం..

దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు జరుగుతున్నా అటవీ శాఖ నుంచి అనుమతులు లేక అడుగు ముందుకు పడలేదు. ఈసారి అటవీశాఖ అనుమతులు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. అటవీ, జలవనరులశాఖ యంత్రాంగం సంయుక్తంగా సర్వే చేసి 50 ఎకరాలు అటవీభూమి అవసరమని గుర్తించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో రెవెన్యూభూమి ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సర్వే సైతం పూర్తి చేశారు. అటవీశాఖ నుంచి సేకరిస్తున్న భూమి, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న భూమికి సంబంధించిన డిజిటల్‌ మ్యాపులు, డీజీపీఎస్‌ సర్వే, తదితర వివరాలు తయారుచేయడానికి రూ.10,500 చెల్లించాలని జలవనరులశాఖకు అటవీశాఖ లేఖ రాసింది. ఈప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేసి పూర్తి వివరాలతో మొదటి దశ అనుమతికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేస్తారు. అనుమతి రాగానే మొదటి దశ పనులు చేసుకోవడానికి వెసులుబాటు లభిస్తుందని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ఆకృతులు, సర్వే కొలిక్కి రావడంతో పనులకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి:

వేధిస్తున్న నిధుల కొరత... ప్రత్యామ్నాయాల వైపు అధికారుల దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.