రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
Published: Nov 13, 2023, 8:24 AM


రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
Published: Nov 13, 2023, 8:24 AM

Diwali Festival Celebrations in AP: టపాసుల మోతలు, తారజువ్వల వెలుగుల్లో రాష్ట్రంలో ఊరువాడ దీపావళి సందడిగా సాగింది. పిల్లలు, పెద్దలు కలసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకొన్నారు. పలుచోట్ల అట్టహాసంగా నరకాసుర వధ కార్యక్రమాలు నిర్వహించారు.
Diwali Festival Celebrations in AP: రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి, నరక చతుర్ధశి వేడుకగా జరిగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలగుంటలో నరకాసుర వధ అట్టహాసంగా నిర్వహించారు. 25 అడుగుల నరకాసుర ప్రతిమకు సుమారు రెండున్నర లక్షల టపాసులు అమర్చి చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతిలో బాణసంచా కాల్చుతూ దీపావళి వేడుకలు జరుపుకొన్నారు.
Naraka Chaturdashi Celebrations in AP: కర్నూలులో చిన్నారులు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో ఇళ్ల ముందు బాణసంచా పేల్చారు. నెల్లూరులోని వీధులు టపాసుల మోతతో మారుమోగాయి. దీపాల వెలుగుల్లో నివాసాలు, దుకాణ సముదాయాలు కాంతులీనాయి. విజయవాడ పడమటలంక చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ అనాధల విద్యాసంస్థలో చిన్నారులు కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు కాలుస్తూ సందడి చేశారు.
Grand Diwali Celebrations in Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ప్రజలు ప్రమీదలు వెలిగించి వేడుకలు జరుపుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మహిళలు లక్ష్మీ పూజలు నిర్వహించి పిల్లలతో దివిటీలు కొట్టించి వేడుకలు నిర్వహించారు. విశాఖ శారదాపీఠంలో దీపావళి వేడుకల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Diwali 2023: పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రాజశ్యామలా అమ్మవారి ఆలయంలో శాస్త్రీయంగా మతాబులు కాల్చారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్ధులు దివిటీలు కొట్టి బాణసంచా కాల్చారు. విశాఖలోని వీధుల్లో విద్యుత్ దీపాలు, ప్రమీదలతో నివాసాలను అలంకరించారు. టపాసులు కాల్చుతూ.. సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ నగరవాసులు సందడి చేశారు. శ్రీకాకుళం డైమండ్ పార్క్ సమీపంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. పాము అకారంలో ఉన్న బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Fire Accidents During Diwali Celebrations: మరోవైపు.. దీపావళి వేళ టపాసుల నిప్పురవ్వలు ఎగిసిపడి పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గుంటూరులోని గౌరీ శంకర్ థియేటర్ రోడ్డులో బాణసంచా నుంచి నిప్పురవ్వలు పడి ఆటోమొబైల్ స్పేర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మూడంతస్తుల దుకాణంలో పై రెండు అంతస్తులలో టైర్లు, ఇంజిన్ ఆయిల్ తదితర ఆటోమొబైల్ సామగ్రి ఉండటంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి.
నాలుగు ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్మెంట్లోని ప్లాట్లోకి తారాజువ్వలు దూసుకెళ్లాయి. కర్టెన్లకు మంటలు అంటుకుని దట్టమైన పొగలు అలుముకోవడంతో అపార్ట్‌మెంట్‌లో నివాసముండేవారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
