ETV Bharat / state

R5 zone Issue: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jul 17, 2023, 7:32 PM IST

Updated : Jul 17, 2023, 8:52 PM IST

R5
R5

R5 zone Farmers Fire On Cm jagan: సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడకముందే R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో తట్ట కంకర వేయలేని ముఖ్యమంత్రి.. సభా ప్రాంగణానికి మాత్రం వందల లారీల కంకర డస్ట్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

R5 zone Farmers Fire On CM Jagan: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అండదండలతో అక్రమ నిర్మాణాలు, అక్రమ దందాలు, అక్రమ మట్టి తవ్వకాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయి. వైసీపీ నాయకుల అక్రమాలపై రైతులు, ప్రతిపక్షాలు న్యాయస్థాలను ఆశ్రయించగా.. తక్షణమే వాటిని ఆపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. అధికార పార్టీ నాయకులు మాత్రం పట్టించుకోవటం లేదు. మరోవైపు కొన్ని వివాదాలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆర్‌-5 జోన్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించక ముందే జగన్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో పేదలకిచ్చిన సెంటు స్థలంలో చర్యలు చేపట్టడం, ఈ నెల 24వ తేదీన ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయబోతుండటంపై రైతులు, స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆర్-5 జోన్‌లో సెంట్ స్థలాలు..నిలిచిన నీళ్లు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో సుమారు 900 మంది పేదలకు సెంట్ స్థలాలను కేటాయించింది. తాజాగా ఆ స్థలాల్లో విద్యుత్ సరఫరా కోసం అధికారులు స్తంభాలను కూడా పాతారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఈ ప్రాంతంలో కురిసిన చిన్నపాటి వర్షానికే సెంట్ స్థలాల్లో భారీగా నీరు చేరింది. తేలికపాటి వర్షానికి నీళ్లు చేరితే.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం చెరువుగా మారుతోందని స్థానికులు వాపోయారు. నీళ్లు నిలువ ఉండే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వారిని (పేదలను) మోసం చేయడమేనని రైతులు మండిపడ్డారు.

సీఎం సభకు వంద లారీల కంకర డస్ట్.. రాజధానిలో పేదలకు ఇచ్చిన సెంట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్.. భూమి పూజ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. కృష్ణాయ్యపాలెంలోని సెంట్ స్థలాల వద్ద భూమి పూజ చేసిన అనంతరం.. సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సభా ప్రాంగణం బురదమయం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బండరాళ్లు సరఫరా చేసే యాజమాన్యాలకు వంద లారీల కంకర డస్ట్ తరలించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కంకర డస్ట్ తరలించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని యజమానులను హెచ్చరిస్తున్నారు. దీంతో సభా ప్రాంగణానికి ఇప్పటికే దాదాపు 20 లారీల కంకర డస్ట్​ను తరలించారు.

రాజధానిలో సీఎం జగన్ తట్ట కంకర వేయలేదు.. దీనిపై రాజధాని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి బురద అంటకూడదనే ఉద్దేశ్యంతో వందలకొద్దీ లారీల కంకర డస్ట్‌ను తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధానిలో తట్ట కంకర వేయలేని ముఖ్యమంత్రి.. సభా ప్రాంగణానికి మాత్రం 100 లారీల కంకర డస్ట్‌ను ఎలా తరలిస్తారు..? అంటూ ప్రశ్నించారు. ఆర్5 జోన్ వివాదం కోర్టులో ఉండగా.. ఎలా సెంట్ స్థలాలను కేటాయిస్తారంటూ ఆగ్రహిస్తున్నారు.

ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు విచారణ.. మరోవైపు ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడకముందే ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు.. దమ్మాలపాటి, ఉన్నం మురళీధర్‌లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాదులు వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Last Updated :Jul 17, 2023, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.