ETV Bharat / state

యాదాద్రి పవర్‌ ప్రాజెక్ట్​.. దేశ కీర్తిప్రతిష్టను పెంచుతుంది: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Nov 28, 2022, 8:13 PM IST

CM KCR Nalgonda Tour: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్‌ కేంద్రాలు దేశం కీర్తి ప్రతిష్టలను పెంచుతాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి .. ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

CM KCR Nalgonda Tour
CM KCR Nalgonda Tour

CM KCR Nalgonda Tour: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్‌ వద్దకు వెళ్లారు. తొలుత ప్లాంట్‌ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన సీఎం... 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌ చేరుకొని నిర్మాణపనులు పరిశీలించారు. ప్లాంట్‌ నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆ ఉద్దేశ్యంతోనే దామరచర్ల ఎంపిక: పవర్‌ప్లాంట్‌కి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను సీఎం పరిశీలించారు. ప్లాంట్‌లో కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గునిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్‌విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర నిర్వహణలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరమనే విషయంపై సీఎం ఆరాతీశారు. నీటిసరఫరాకు కృష్ణాఋ నీటిని సరఫరాచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

100 ఎకరాలు సేకరించండి: విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేలమంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మాణంచేయాలని కేసీఆర్ ఆదేశించారు. అక్కడే భవిష్యత్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం ప్రత్యేకంగా 100 ఎకరాలు సేకరించాలని సీఎం సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి 50 ఎకరాలు కేటాయించాలన్న సీఎం.. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలని చెప్పారు. పవర్‌ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌సర్వీస్ ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్‌వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వేక్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అధికారులకు దిశానిర్దేశం: విద్యుత్‌ కేంద్రం కోసం భూమి ఇచ్చిన రైతులతోపాటు, గతంలో సాగర్‌ప్రాజెక్టుకు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు కలెక్టర్‌ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించిన కేసీఆర్ అక్కడిక్కడే తగుచర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వారికి సీఎం అభినందనలు: యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండుయూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని మిగతావి జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వివరించారు. కరోనా వల్ల ఏడాదిన్నరకు పైగా ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు సీఎంకి తెలిపారు. పవర్ ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

  • దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు పరిశీలించారు. pic.twitter.com/m4y7ZJoUGK

    — Telangana CMO (@TelanganaCMO) November 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.