ETV Bharat / state

ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలు.. ఆ కార్డుల్లో హెల్త్​ హిస్టరీ

author img

By

Published : Oct 28, 2022, 7:27 PM IST

Updated : Oct 28, 2022, 8:12 PM IST

CM Jagan on Arogyashri treatment: ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరో 809 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్‌ హిస్టరీ పొందుపరచాలని సీఎం ఆదేశించారు. నిరంతరం రికార్డులు అప్‌డేట్ చేయాలన్నారు. వైద్యఆరోగ్యశాఖలో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

CM Jagan
వైద్యఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

CM Jagan on Arogyashri treatment: వైద్యఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు లేకుండా చర్యలు చేపట్టడంతో... ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలను చేర్చే ప్రక్రియను సీఎం ప్రారంభించారు. ఇప్పటివరకు 2వేల 446 రకాల చికిత్సలు అందిస్తుండగా... ఇప్పుడు ఆ సంఖ్య 3వేల 255కి చేరినట్లు చెప్పారు. పేదలకు వైద్యం అందించడంలో అలసత్వానికి తావులేదన్న సీఎం.. ఆస్పత్రుల్లో అవసరమైనంత మంది వైద్యులు ఉండాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుతో ఏడాదికి రూ.2వేల 894.87 కోట్లు ఖర్చు కానుండగా, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్‌ హిస్టరీ నిక్షిప్తం చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్‌ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై సీఎం ఆరా తీయగా... అక్టోబర్ 21 నుంచి ట్రయల్‌ రన్‌ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు సహా మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారని ముఖ్యమంత్రికి నివేదించారు. మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో సుమారు 46వేల పోస్టులు భర్తీ చేసినట్లు సీఎం వివరించారు. ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు గుర్తు చేశారు.

ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సరఫరాలో సమస్యలు రాకుండా ఇప్పుడున్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్లను భవిష్యత్తులో కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. విలేజ్‌ క్లినిక్స్‌లో మందులు అయిపోతే... సమీపంలోని పీహెచ్‌సీ నుంచి సరఫరా చేసే ఏర్పాటు చేస్తామన్నారు. మందుల పంపిణీ, నిల్వ, కొరతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. మండలాల వారీగా ప్రతి విభాగానికీ పర్యవేక్షణ అధికారులు ఉండేలా చూడాలని సీఎం సూచించారు. తహసీల్దార్, ఎండీవో, ఎంఈవో తరహాలో ప్రతి ప్రభుత్వ విభాగంలో పనిచేసే వారిపై పర్యవేక్షణకు మండలస్థాయి వ్యవస్థ ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. వైద్యఆరోగ్యశాఖలోనూ మండలస్థాయిలో పర్యవేక్షణ చేయాలని నిర్దేశించారు.

గాలి కాలుష్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, స్కూళ్లు, అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని.. గుర్తించిన వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రక్తహీనత కేసులను జీరోకి తీసుకురావాలన్న సీఎం... దీనిపై స్త్రీ-శిశు సంక్షేమ శాఖతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు కలిసి పని చేయాలన్నారు. ఇందుకోసం ప్రసవ సమయంలో హైరిస్క్‌ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు గాయపడితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించాలని సీఎం నిర్దేశించారు. వైద్యఆరోగ్య శాఖలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 28, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.