ETV Bharat / state

AP State Debts: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ధనిక సీఎం

author img

By

Published : May 7, 2023, 12:51 PM IST

AP State Debts: మా రహదారి అప్పుదారి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రోజు గడిచేందుకు అనునిత్యం చేయి చాస్తోంది. ఏ నిబంధనలతో సంబంధంలేకుండా...భవిష్యత్‌ను పట్టించుకోకుండా...కోటానుకోట్ల అప్పులు పుట్టించి..ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం మొదలైన మొదటి నెలలోనే ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. 2,3, రోజుల్లో..మరో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమైంది.

jagan
jagan

ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా

AP State Debts: రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. రోజు గడవాలి అంటే... అప్పు చేయక తప్పని దుస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే.... 6వేల కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకుంటే తప్ప రాష్ట్రంలో రోజులు గడవలేదు. మరోవైపు..... మే 9 నాటికి మరో 3వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం 9 నెలల్లో 30వేల 275 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు అనుమతిస్తే కేవలం 40 రోజుల్లోనే అందులో మూడో వంతు రుణం వాడేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే రుణాల తీవ్రత.... ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఏడాదిలో 300 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే ఉంటోందని కాగ్‌ ఇప్పటికే అనేకసార్లు పేర్కొంది. ఆ రూపేణా చెల్లించే వడ్డీ కూడా తక్కువేం కాదు. ఈ వైఖరి నుంచి బయటపడాలని కాగ్‌ అనేకమార్లు చెబుతూ వచ్చింది. అప్పుచేసి అప్పులు తీర్చే పరిస్థితుల నుంచి బయటపడకపోతే అభివృద్ధి శూన్యమవుతుందని పదేపదే హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెడుతూనే ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం ఏటా రాష్ట్రాలు చేసే అప్పులను..... రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తి ఆధారంగా పరిమితం చేసేలా మార్గనిర్దేశం చేసింది. ఏడాది కాలంలో.... రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి అంచనాను లెక్కించి అందులో 3.5 శాతానికి మించకుండా అప్పు ఉండాలి. 2021-22.. ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా 10లక్షల 61వేల 802 కోట్ల రూపాయలను పరిగణనలోకి తీసుకుని అందులో 3.5 శాతం అంటే 37వేల 163 కోట్ల రూపాయలను రుణపరిమితిగా లెక్క కట్టారు.

దానికి ఆ ఏడాది తిరిగి చెల్లించే రుణాలు 14వేల 429 కోట్ల రూపాయలు కలిపారు. అంతకు ముందు సంవత్సరాల్లో పరిమితికి మించి తీసుకున్న రుణాలు 17వేల 924 కోట్ల రూపాయలను అందులో నుంచి తీసేసి, నికర రుణపరిమితిని 33వేల 668 కోట్ల రూపాయలుగా లెక్కించారు. ఈ మొత్తం నుంచి మళ్లీ కేంద్ర ప్రభుత్వ రుణాల పేరుతో 2వేల500 కోట్ల రూపాయలు, విదేశీ ఆర్థిక సాయం రుణాలు 2వేల కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే పీఎఫ్‌ మొత్తం, ప్రజా రుణం నికర విలువను కూడా మినహాయించి 27వేల 668 కోట్ల రూపాయలనే ఆ ఏడాది నికర రుణ పరిమితిగా తేల్చారు.

ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రాష్ట్రం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న అప్పు ఇంతకు మించి చాలా భారీగా ఉంది. పైగా కార్పొరేషన్ల అప్పులు సైతం ఈ నికర రుణ పరిమితిలోకే వస్తాయని కేంద్రం తేల్చి చెప్పింది. కానీ కార్పొరేషన్ల నుంచి రాష్ట్రం తీసుకుంటున్న రుణాలను మొత్తం రుణ పరిమితి నుంచి మినహాయిస్తున్న దాఖలాల్లేవు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలుత 24వేల 563 కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్‌ రుణానికే అనుమతి ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అది ఏకంగా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు చేరింది. ఒకవైపు వివిధ సంస్థల నుంచి రాష్ట్రం ప్రభుత్వం అప్పులు తీసుకుంటూనే ఉంది. కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు, రుణాల వివరాలు రాష్ట్రం బయటపెట్టడంలేదని కాగ్‌ మొత్తుకుంటూనే ఉంది. ఆ అప్పులు కూడా నికర అప్పుపరిమితిలో కలిపి లెక్కిస్తామని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది. కానీ రుణ పరిమితుల సమయంలో అలా లెక్కించిన దాఖలాలేవీ కనిపించడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర రీతిలో అప్పులు చేస్తోంది. ఓ విశాఖలో వేల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది.

ఖజానాకు వచ్చే పది మద్యం డిపోల ఆదాయాన్ని కార్పొరేషన్‌కు మళ్లించేసి, ఆ రాబడిని తనఖా పెట్టి 25 వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కార్పొరేషన్‌ మూడేళ్లనాడే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన సాయం చేసిన ప్రభుత్వం.. ఆ డబ్బులను తన అవసరాలకు వాడుకుంది. 25 వేల కోట్ల రూపాయల ఒప్పందం ఉన్నా బ్యాంకులు 23వేల 200 కోట్ల రూపాయలే ఇచ్చాయి. ఈ అప్పులు తప్పని, ఇలా రుణాలు తీసుకోవడంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఏపీ కార్పొరేషన్లకు రుణాలిచ్చేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని బ్యాంకులనూ హెచ్చరించడంతో..ఎస్‌బీఐ..ఏపీఎస్‌డీసీకి ఇస్తానన్న పూర్తి రుణం ఇవ్వనేలేదు.

ఈ పాచిక పారకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం వేసింది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్‌ను తగ్గించింది. బెవరేజస్‌ కంపనీ ఏర్పాటు చేసి, అదే సెస్‌ విధించి వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆ రాబడిని కార్పొరేషన్‌ రాబడిగా చూపించి 12వేల 500 కోట్ల వరకు అప్పు తీసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి కూడా రుణాలు తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థికశాఖ తప్పు పట్టింది. ఏపీఎస్‌డీసీ ద్వారా అప్పులు తీసుకున్న విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 (3)కు విరుద్ధమని లేఖ కూడా రాసింది. నికర రుణపరిమితి లెక్కకట్టే క్రమంలో కార్పొరేషన్ల అప్పులు పరిగణనలోకి తీసుకోకపోవడంవల్ల ఆంధ్రప్రదేశ్‌ అధిక అప్పులు చేసేందుకు కేంద్రమే ఆస్కారం కల్పించినట్లవుతోందనే విమర్శ వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి 9నెలల కాలానికి ఏపీకి 30వేల 275 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకే కేంద్రం అనుమతిచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీని 14లక్షల 40వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అందులో 3.5 శాతాన్ని నికర రుణపరిమితిని లెక్కించి దానికి ఈ సంవత్సరంలో తిరిగి చెల్లించే రుణాల మొత్తాన్ని కలిపి ఎంత అప్పులు చేయవచ్చో తేలుస్తారు. వాటికి ప్రజారుణం, కేంద్ర రుణాలు, ఇతర రుణాలు మినహాయిస్తారు. ఏపీడీఎస్సీ ద్వారా గతంలో తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మినహాయిస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన దాదాపు 12,500కోట్ల రూపాయల రుణం మినహాయిస్తామని కూడా కేంద్రం ఇటీవల పేర్కొందని తెలిసింది. పాత ప్రభుత్వంలో.... అదనంగా చేసిన అప్పులను కూడా విడతల వారీగా మినహాయించే విషయంపై చర్చ జరుగుతోంది. ఉంది. కొన్నింటిని మినహాయించడం వల్లే రుణ అనుమతుల మొత్తం తగ్గిందా అన్న విషయం పై చర్చ సాగుతోంది. మరోవైపు ప్రారంభంలో కేంద్రం కోత పెడుతున్నా చివరికి రాయితీలిచ్చి అప్పులకు ద్వారాలు తెరుస్తోందనే వాదన వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.