ప్రాథమిక ఆధారాలు లేవు - మద్యం విధానంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు: హైకోర్టు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 11, 2024, 12:36 PM IST

AP_High_Court_Grants_Anticipatory_Bail_to_Chandrababu

AP High Court Grants Anticipatory Bail to Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్యం కేసులో హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దర్యాప్తునకు సహకరించాలని, కేసు విషయంలో ఎవరినీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభపెట్టొద్దని, బెదిరించొద్దని తెలిపింది.

AP High Court Grants Anticipatory Bail to Chandrababu : మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనరేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వారు ముందస్తు బెయిలు కోసం పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై గతంలోనే వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Chandrababu Anticipatory Bail in Three Cases : ఎన్నికైన ప్రభుత్వానికి తన సొంత విధానాన్ని అనుసరించే అధికారం ఉంటుందని ఆ విధానంలో అక్రమాలు లేనంతవరకూ విధాన రూపకర్తలకు దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదని న్యాయమూర్తి టి. మల్లిఖార్జునరావు అన్నారు. బార్లకు ప్రివిలేజ్‌ రుసుము తొలగింపు వల్ల వచ్చే ఆర్థిక పర్యవసానాల గురించి ప్రశ్న లేవనెత్తిన తర్వాతే అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనరేశ్‌ను బదిలీ చేసినట్లు పేరొన్నారు. అనంతరం కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఎంకే మీనా నుంచి వచ్చిన ప్రతిపాదన తర్వాతే ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న శ్రీనరేశ్‌ తరఫు న్యాయవాది వాదనలో బలముందన్నారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపునకు ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందకపోవడాన్ని అప్పటి మంత్రి, ముఖ్యమంత్రికి ఆపాదించడానికి వీల్లేదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

పేదల కోసమే ఉచిత ఇసుక విధానం - చంద్రబాబు లబ్ది పొందారనే దానిపై ఆధారాలేవి: హైకోర్టు

విధివిధానాలను మంత్రులు, ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత అధికారులదేనన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నామన్నారు. మద్యం దుకాణాలకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని కాగ్‌ తుది నివేదికలో పేర్కొనలేదన్న శ్రీనరేశ్‌ తరఫు న్యాయవాది వాదనలో బలముందని అభిప్రాయపడ్డారు. లాటరీ విధానంలో మద్యం దుకాణాలను ఎంపిక చేస్తున్నందున భవిష్యత్తులో ఎంపికయ్యే మద్యం దుకాణాల యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నే తలెత్తదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌కు వాయిదా పద్ధతిలో లైసెన్స్‌ రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించే విషయంలో నోట్‌ఫైల్‌ను పరిశీలిస్తే న్యాయశాఖ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోందని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదని ప్రతిపాదనను క్యాబినెట్‌ ముందు ఉంచాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు, న్యాయశాఖ సలహా ఆధారంగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పిటిషనర్లు నేరానికి పాల్పడినట్లు చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు.

పిటిషనర్లు ఎలా జోక్యం చేసుకున్నారు? : నిబంధనలకు విరుద్ధంగా డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చే వ్యవహారంలో పిటిషనర్ల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ సీఐడీ సమర్పించని నేపథ్యంలో పిటిషనర్లకు దురుద్దేశాలు ఆపాదించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డిమాండ్‌ ఆధారంగా ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వివిధ బ్రాండ్ల మద్యానికి ఆర్డర్‌ ఇస్తుంది. ఎక్సైజ్‌శాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంలో పిటిషనర్ల ప్రాత ఉండదన్న సీనియర్‌ న్యాయవాదుల వాదనతో ఏకీభవిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. APBCL రోజువారీ కార్యకలాపాలలో పిటిషనర్లు ఎలా జోక్యం చేసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించలేదు - నేడు రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు

రాజకీయ కారణాలతో కేసు పెట్టారా? : ప్రస్తుత ప్రభుత్వం మద్యం నూతన విధానాన్ని తీసుకొచ్చిన నాలుగేళ్ల తర్వాత పిటిషనర్లపై కేసు నమోదు చేశారన్న న్యాయమూర్తి కొత్త విధానాన్ని తీసుకొచ్చేటప్పుడు గత ప్రభుత్వ విధానాన్ని ఈ ప్రభుత్వం సమీక్షించి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదులో తీవ్ర జాప్యానికి గల కారణాలను ప్రభుత్వం వివరించలేదన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పిటిషనర్లపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు అవుతాయా లేదా, రాజకీయ కారణాలతో కేసు పెట్టారా లేదా అనే వ్యవహారంపై అభిప్రాయం వ్యక్తం చేసేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. నేరంలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు రుజువు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలను సేకరించాలని సూచించారు.

బెయిలు మంజూరు : ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే గత ప్రభుత్వ నిర్ణయాలపై సందేహించాలి తప్ప గతంలో వేరేపార్టీ అధికారంలో ఉందన్న కారణంతో సందేహించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు నమోదులో నాలుగేళ్ల జాప్యానికి కారణాలను వెల్లడించకపోవడాన్ని బెయిలు మంజూరు చేసే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.

వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్నందున ఎక్సైజ్‌శాఖపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు నియంత్రణ లేదు. కేసులో ఆధారాలను తారుమారు చేసినట్లు ఆధారాలు లేవు. మొదటి నిందితుడు శ్రీనరేశ్‌ పదవీ విరమణ చేశారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం అధికారంలో లేరు. కేసు దస్త్రాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిటిషనర్లకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు ఎలాంటి అవరోధం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది. నేర ఘటన 2014-17 మధ్య చోటు చేసుకుందని సీఐడీ చెబుతున్ననేపథ్యంలో పిటిషనర్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వారికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

CID on Chandrababu Liquor Case: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ.."అప్పటి వరకు అరెస్టు చేయమన్న సీఐడీ"

మద్యం విధానంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు: హైకోర్టు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.