ETV Bharat / state

వలస కూలీలకే అనుమతి : సీఎం జగన్

author img

By

Published : May 4, 2020, 5:30 PM IST

Updated : May 5, 2020, 6:51 AM IST

లాక్‌డౌన్‌ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులనే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని తెలిపింది. వెెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు పరిశీలించి, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాక అవకాశం కల్పిస్తామని తెలిపింది.

cm jagan
cm jagan

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారికి పరీక్షలు నిర్వహించాల్సిన విధానంపైనా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.

రాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నవారు... ఆయా రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌లలో ఏ జోన్‌లో ఉన్నారో నిశితంగా చూస్తున్నామని, దాన్ని నిర్ధరించుకున్న తర్వాతే వలసకూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రానికి వచ్చేందుకు స్పందన వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా, ఇతర మార్గాల్లో విజ్ఞప్తి చేసినవారూ ఉన్నారని తెలిపారు. టెలిమెడిసిన్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని, కీలకమైన కాల్‌సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

కుటుంబ సర్వేలో గుర్తించినవారికి నేటితో పరీక్షలు పూర్తి
రాష్ట్రంలో కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి మంగళవారంలోగా పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రెడ్‌జోన్‌లలోని ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలపై అధికారులు చెప్పిన సమాచారం ఇదీ..!

  • ప్రతి 10 లక్షల జనాభాకు 2,345 పరీక్షలతో ప్రథమస్థానంలో రాష్ట్రం
  • ఆదివారం వరకు రాష్ట్రంలో మొత్తం 1,25,229 పరీక్షలు
  • రాష్ట్రంలో ఇప్పటికి కరోనాతో 33 మంది మృతి
  • రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రయోగశాలలు 11
  • 45కేంద్రాల్లో 345 ట్రూనాట్‌ మిషన్లతో పరీక్షలు
  • 11 ఆర్టీపీసీఆర్‌ ల్యాబుల్లో 22 మిషన్‌లు. ప్రతి జిల్లాలో 4 మిషన్లు ఉంచేందుకు ప్రయత్నం
  • రోజువారీ పరీక్షల సామర్థ్యం 6 వేల నుంచి 10 వేలకు పెరిగింది

మూడింట ఒక వంతు ప్రభుత్వం కొనాలి
ఎంఫాన్‌ తుపాను రాష్ట్రంవైపు వస్తే ఎదుర్కొనేందుకు విద్యుత్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని.. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ‘‘తుపానుని దృష్టిలో ఉంచుకుని కళ్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. వర్షాల వల్ల దెబ్బతినేందుకు అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి. ప్రతి పంటలో మూడింట ఒక వంతు ‘మార్కెట్‌ జోక్యం’ కింద కొనేందుకు అధికారులు సిద్ధం కావాలి. వాటికి తగిన మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'సాధారణ జ్వరమే అని అనటం వల్లే ఇలాంటి పరిస్థితి'

Last Updated :May 5, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.