ETV Bharat / state

కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు..ఉద్యోగుల వివరాలపై ఆరా!

author img

By

Published : Oct 30, 2020, 4:38 PM IST

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నెల 30లోగా వివరాలు పంపాలని సూచించింది.

ap governament
ap governament

రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డివిజన్లు, మండలాలు, జనాభా, భౌగోళిక స్వరూపం తదితర వివరాలు ఇప్పటికే సేకరించింది. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించింది. ఈనెల 30లోగా వివరాలు పంపాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాల ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. కొన్ని నెలల్లోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఉద్యోగుల వివరాలు అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థానంలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల కేంద్రంగా 3 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

జిల్లాల ఏర్పాటులో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులను సర్ధుబాటు చేయటంపై ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించింది. అధికారులతో పాటు క్యాడర్‌ వారీగా ఉద్యోగుల వివరాలను పంపాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర, జిల్లా క్యాడర్ల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల సమాచారాన్ని ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, సాంఘిక, బీసీ సంక్షేమశాఖలతో పాటు మిగిలిన శాఖల అధికారులు కూడా వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత క్యాడర్ల వారీగా అధికారులు, ఉద్యోగులను సర్ధుబాటు చేయనున్నారు. దీని కోసం సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి స్థానికత వివరాలను కూడా తీసుకోవాలని సూచించారు.

జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగుల అభీష్ఠం మేరకు ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. జిల్లాల విభజనలో ముఖ్యమైన సమాచారాన్ని జిల్లా కలెక్టరు అందజేయాల్సి ఉంది. భౌగోళిక విస్తీర్ణంతో పాటు ఇతరత్రా సమాచారం ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో నూతన జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతమయ్యాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గుంటూరు జిల్లా రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రం నుంచే ఎంతో పేరుంది. మూడు జిల్లాలుగా విడిపోయినట్లయితే రాజకీయంగా పలు మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయనేతలు వివిధ సమీకరణలు చేస్తున్నారు.

ఇదీ చదవండి

క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.