ETV Bharat / state

కోర్టును మోసం చేయాలనుకుంటే మూల్యం చెల్లించాల్సిందే - ఎస్సై అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 10:50 AM IST

Andhra_Pradesh_High_Court_Fires_on_SI_Candidates
Andhra_Pradesh_High_Court_Fires_on_SI_Candidates

Andhra Pradesh High Court Fires on SI Candidates: కోర్టు హాలులో తమ సమక్షంలో ఎత్తు కొలుస్తామని ప్రకటించాక కూడా ఎస్సై అభ్యర్థులు తాము అర్హులమేనని వైద్యుల నుంచి ధ్రువపత్రాలు తీసుకురావడంపై హైకోర్టు మండిపడింది. సాక్ష్యాధారాలను సృష్టించి కోర్టును మోసం చేద్దామనుకుంటున్నారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం వ్యవహరించడానికి హైకోర్టు ఆటస్థలం కాదని, కోర్టు ధిక్కరణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగాలలో పాల్గొనకుండా పేర్లు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.

Andhra Pradesh High Court Fires on SI Candidates: ఎస్సై నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు తప్పుడు వైద్య ధ్రువపత్రాలు ఉంచుతారా అని ప్రశ్నించింది. కోర్టును మోసం చేద్దామనుకుంటున్నారా అని మండిపడింది. పిటిషనర్లు క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ వైద్యశాలలో సామాజిక సేవ చేసే శిక్ష ఎన్ని రోజులో అఫిడవిట్ పరిశీలించి చెబుతామని కోర్టు తెలిపింది.

కోర్టును మోసం చేద్దామనుకుంటున్నారా: కోర్టు హాలులో తమ సమక్షంలో ఎత్తు కొలుస్తామని ప్రకటించాక కూడా ఎస్సై అభ్యర్థులు తాము అర్హులమేనని వైద్యుల నుంచి ధ్రువపత్రాలు తీసుకురావడంపై హైకోర్టు మండిపడింది. సాక్ష్యాధారాలను సృష్టించి కోర్టును తప్పుదోవపట్టించి మోసం చేద్దామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి హైకోర్టు ఆటస్థలం కాదని, కోర్టును ఫూల్‌ చేద్దామనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించింది. తప్పుడు వైద్య ధ్రువీకరణపత్రాలు కోర్టు ముందు ఉంచడం ద్వారా సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించింది. సాక్ష్యాలను సృష్టించడం ద్వారా ఉద్యోగాలు పొందొచ్చని భవిష్యత్తుతరాల వారికి చెప్పాలనుకుంటున్నారా అని నిలదీసింది.

ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ - అభ్యర్థులంతా హాజరు కావాలని ఆదేశం

మూల్యం చెల్లించాల్సిందే: పిటిషనర్లు ఈ చర్యను అమాయకత్వంతో చేసినట్లుగా భావించటం లేదంది. కోర్టుధిక్కరణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగాలలో పాల్గొనకుండా బ్లాక్‌ లిస్ట్‌లో పేర్లను చేర్చేలా ఆదేశిస్తామని హెచ్చరించింది. చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అడ్డుకోవాలని భావించే వారికి ఇదో గుణపాఠం కావాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. నమ్మకం ఉంచాల్సిన వ్యవస్థలను నిందించడం ఫ్యాషనై పోయిందని ఆగ్రహించింది. వేలెత్తి చూపేటప్పుడు రెండు, మూడుసార్లు ఆలోచించాలని హితవు పలికింది.

క్షమాపణలు చెప్పిన పిటిషనర్ల తరఫు న్యాయవాది: ఒకానొక దశలో శిక్ష విధించేందుకు సిద్ధపడింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ కోర్టుకు పలుమార్లు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పిటిషనర్లు నిరుద్యోగులని, పేదలని, వారిపై చర్యలకు ఆదేశిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తన సూచనల మేరకు ప్రభుత్వ వైద్యుల నుంచి పిటిషనర్లు ధ్రువపత్రాలు తెచ్చారన్నారు. శిక్ష విధించకుండా కనికరం చూపాలన్నారు.

పిటిషనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని: ఆ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శిక్షను సామాజిక సేవా శిక్షగా మారుస్తామని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మూడు నెలలు సేవలు చేసే విషయమై తగిన ఆదేశాలిస్తామంది. క్షమాపణలు చెబుతూ కోర్టులో అఫిడవిట్‌ వేయాలని సూచించింది. సామాజిక సేవ శిక్ష ఎన్ని రోజులనే విషయంపై సోమవారం తగిన ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

ఎస్‌ఐ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసిన ఏపీ హైకోర్టు

High Court Hearing on AP Sub Inspector Recruitment: 2018 నాటి ఎస్సై నోటిఫికేషన్‌ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన తాము 2023 నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించాన్ని సవాలు చేస్తూ 24మంది అభ్యర్థులు హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఎస్సై పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని నవంబర్‌ 17వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 5న విచారణ జరిపిన ధర్మాసనం, కోర్టు హాలులో ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలిపించింది.

పిటిషనర్లు తప్పుచేశారు: అనర్హులని తేలడంతో వైద్యులిచ్చిన ధ్రువపత్రాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో ఐజీ కోర్టుకు నివేదిక అందజేశారు. దానిని పరిశీలించిన ధర్మాసనం ఎత్తును కొలవకుండానే ధ్రువపత్రాలు ఇచ్చినట్లుందని, వైద్యుల నుంచి సంతకాలు తీసుకొని ఆ దస్త్రంపై పిటిషనర్లే ఎత్తును రాసుకున్నారని తెలిపింది. కోర్టులో ఎత్తుకొలుస్తామని చెప్పిన తరువాత వైద్యుల నుంచి ధ్రువపత్రాలు తీసుకొచ్చి పిటిషనర్లు తప్పుచేశారని వ్యాఖ్యానించింది.

హైకోర్టు సమక్షంలో ఎస్​ఐ అభ్యర్థుల ఎత్తు కొలిచే ప్రక్రియ - హాజరుకావాలని ఆదేశాలు

వ్యవస్థపై నమ్మకం కలిగేందుకే ఆ నిర్ణయం: ఎస్సై పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికి వ్యవస్థపై నమ్మకం కలిగేందుకే కోర్టులో కొలతలు తీసేందుకు నిర్ణయించామని తెలిపింది. వ్యవస్థలో పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి తాము తగిన ఆదేశాలిస్తామంది. బుట్టలో కుళ్లిన ఓ యాపిల్‌ను చూపించి మొత్తం పళ్లు కుళ్లిపోయాయనే భావన కల్పించేందుకు యత్నించడం సరికాదని వ్యాఖ్యానించింది. నియామకాలను అడ్డుకునే ఇలాంటి చర్యలను అనుమతిస్తే ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎప్పటికి పూర్తికాదని తెలిపింది.

యాంత్రిక ధోరణిలో ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆదేశిస్తాం: కోర్టుల్లో కేసులు తేలేందుకు ఎదురు చూస్తూ కొందరు అభ్యర్థుల పదవీ విరమణ వయస్సు దాడిపోతోంటుందని గుర్తుచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంతమందికి అవినీతి కేంద్రంగా మారిందని, వారి మోసపు మాటలు విని వందలాది మంది లక్షల్లో సొమ్ము చెల్లించి మోసపోతున్నారని తెలిపింది. యాంత్రిక ధోరణిలో ధ్రువపత్రాలు ఇవ్వకుండా వైద్యులను ఆదేశించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తామని తెలిపింది. తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. క్షమాపణలు కోరుతూ పిటిషనర్లు అఫిడవిట్లు వేసేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.