ETV Bharat / state

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే

author img

By

Published : May 1, 2021, 4:01 AM IST

Updated : May 1, 2021, 4:51 AM IST

రాజధాని కోసం 500 కాదు.. 5వేల రోజులైనా పోరాటం కొనసాగిస్తామని... అమరావతి రైతులు, ఐకాస నేతలు తేల్చిచెప్పారు. రాజధాని అంశంలో వైకాపా ప్రభుత్వ తీరును.. న్యాయనిపుణులు తప్పుపట్టారు. ఏ రహస్య అజెండాతో అమరావతిని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. అమరావతి ఐకాస నేతలు ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశం.. రాజధాని సంకల్పానికి కొత్త ఊపిరిలూదింది

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే
ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే

అమరావతి పరిరక్షణ ఉద్యమ శంఖారావం ఆన్‌లైన్‌ వేదికగా ప్రతిధ్వనించింది. రాజధాని ఉద్యమం మొదలై 500వ రోజుకి చేరిన సందర్భంగా... ‘‘ఆంధ్రుల బతుకు, భరోసా, భవిత కోసం అమరావతి ఉద్యమ భేరి’ పేరుతో శుక్రవారం అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ, దళిత జేఏసీ వర్చువల్‌ సభ నిర్వహించాయి. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో ఆన్‌లైన్‌ వేదికను ఎంచుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ మనసు మార్చుకుని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించేంత వరకు... 5వేల రోజులైనా ఉద్యమాన్ని నడుపుతామని ఉద్యమ సారథులైన మహిళలు, రైతులు ప్రకటించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ సహా పలువురు న్యాయకోవిదులు, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుతోపాటు పలువురు రాజకీయ నాయకులు, విశ్రాంత అధికారులు, సామాజికవేత్తలు, జాతీయ రైతు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, రైతు జేఏసీ నాయకుడు పువ్వాడ సుధాకర్‌ తదిరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మందడం, తుళ్లూరు, రాయపూడి, కృష్ణాయపాలెం వంటి రాజధాని గ్రామాల్లోని నిరసన శిబిరాల నుంచి పలువురు మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.

ఉద్యమ గీతాల సీడీ ఆవిష్కరణ
మందడం, వెలగపూడి, తుళ్లూరు వంటి రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తూనే... జెండాలు, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలతో హోరెత్తించారు. శిబిరాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నప్పుడు మందడం శిబిరంలో ఎల్‌ఈడీ తెరపై రైతులు, మహిళలు పువ్వులు చల్లారు. ఉద్ధండరాయునిపాలెం శిబిరంలో బుద్ధుడి విగ్రహం ఆవిష్కరించారు. రాయపూడి శిబిరంలో ‘దళిత చైతన్య గీతిక’ పేరుతో రూపొందించిన ఉద్యమ గీతాల సీడీని ఆవిష్కరించారు.

1.54 లక్షల ట్వీట్లు
రాజధాని ఉద్యమానికి మద్దతిస్తూ ట్విటర్‌లో సందేశాలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1.54 లక్షల ట్వీట్‌లు వచ్చాయి. ‘నేను ఆంధ్రోడిని.. నా రాజధాని అమరావతి’, ‘రైతే రాజు.. అమరావతే మన రాజధాని’, ‘మా యువత భవిష్యత్తు.. అందరి బాధ్యత’, ‘రైతుల త్యాగఫలం.. అమరావతి జననం’, ‘రాజధాని లేని రాష్ట్రం కోసం భూమి త్యాగం చేస్తే.. ఇంత కక్షా..’ ‘నేను ఆంధ్రప్రదేశ్‌ మహిళను.. అమరావతికి నా మద్దతు’ అంటూ... వివిధ పార్టీల నేతలు, రైతులు, పలు దేశాల్లోని ప్రవాసాంధ్రులు ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి

కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట

Last Updated : May 1, 2021, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.