ETV Bharat / state

3 రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

author img

By

Published : Aug 2, 2020, 5:55 AM IST

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగాయి. శనివారం ఉదయం నుంచే అమరావతి గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎడం పాటిస్తూ ఇళ్ల ముందు, వీధులు, గ్రామకూడళ్లలో అమరావతి ఐకాస, నల్ల జెండాలతో నినదించారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలంలో పవిత్ర మట్టికి ఏపీ పరిరక్షణ సమితి యువజన విభాగం పూజలు చేసింది. అయోధ్యలోని శ్రీరామమందిర భూమిపూజకు అమరావతి మట్టి, నీరు పంపుతామని వారు తెలిపారు.

amaravathi protest news
amaravathi protest news

అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు. మందడం, వెలగపూడి, బోరుపాలెం, తుళ్లూరు, పెదపరిమి, అబ్బురాజుపాలెం, రాయపూడి దీక్షా శిబిరాల్లో రైతులు నిరసనలు తెలిపారు. అనంతవరంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. నీరుకొండలో గాంధీ విగ్రహం వద్ద నినదించారు.

‘అమరావతి వెలుగు’లో భాగంగా రైతులు, మహిళలు విద్యుద్దీపాలను ఆర్పేసి ఇళ్ల ముందు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సేవ్‌ అమరావతి పేరుతో ముగ్గులు వేశారు. 3రాజధానుల వల్ల తమకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ వీడియో సందేశాలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయపోరాటం కొనసాగుతుందని అమరావతి ఐకాస ప్రకటించింది. అన్ని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో నిరసనలు కొనసాగించాలని కోరింది.

రాష్ట్రవ్యాప్తంగా 103 నియోజకవర్గ కేంద్రాలు, 320 మండలకేంద్రాల్లో తమ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయని తెదేపా వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నరసరావుపేటలో తెదేపా బాధ్యుడు అరవిందబాబుల నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. గుంటూరు తూర్పు, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, చిలకలూరిపేట, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉద్యమించారు. సత్తెనపల్లిలో న్యాయదేవత విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అప్పికట్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వినుకొండలో తెదేపా, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. కృష్ణా జిల్లా నందిగామలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. వారు మందడం శిబిరాన్ని సందర్శించారు. గన్నవరం, మైలవరం, వీరులపాడులోనూ నిరసనలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు, కలిగిరి, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరుల్లో పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు.

కొడవలూరులో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఒంగోలు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని తన నివాసంలో జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కదిరిలోనూ ఆందోళనలు చేపట్టారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కుప్పంలోని శాంతిపురంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తిరుపతిలో సుగుణమ్మ, మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌లు స్వగృహాల్లోనే నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురె డ్డి కార్యాలయంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి) నిరసన తెలిపారు. కర్నూలులో జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఆందోళన చేపట్టారు.

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తమ ఇంటి ప్రధాన ద్వారానికి నల్లజెండా కట్టారు. సీతానగరం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలలో ఆందోళనలు కొనసాగాయి. పెద్దాపురంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప, అమలాపురంలో తెదేపా బాధ్యుడు ఆనందరావు ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు నిరసన చేపట్టారు. ఆచంట, భీమవరం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, భీమడోలులో నల్లబ్యాడ్జీలను ధరించారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆందోళన చేశారు.

ఇదీ చదవండి: విశాఖ హెచ్​ఎస్​ఎల్​లో ఘోర ప్రమాదం...11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.