ETV Bharat / state

రైలు టిక్కెట్లు అయిపోయాయి..! బస్సుల్లో ఛార్జీల బాదుడు..! సంక్రాంతికి ఊరెలా..!

author img

By

Published : Dec 31, 2022, 12:32 PM IST

Updated : Dec 31, 2022, 12:39 PM IST

BUS RESERVATIONS FULL : సంక్రాంతి పండుగకు రైల్లో సొంతూరు వెళ్దామనుకుంటున్నారా.. టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మీ ఊరెళ్లే ఏ రైళ్లోనూ బెర్తులు ఖాళీగా లేవు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే రైళ్లన్నింటిలోనూ బెర్తులు నిండిపోయాయి. కనీసం టికెట్ బుక్ చేసుకునేందుకూ అవకాశం లేదు. రైల్వే శాఖ అరకొరగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఏపాటికీ సరిపోవడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేకపోయినా.. మూడు సార్లు టికెట్ రేట్ల పెంపుతో భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు సంక్రాంతి పండుగ ముందు రోజుల్లో టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు.

TRAIN RESERVATIONS FULL
TRAIN RESERVATIONS FULL

TRAIN RESERVATIONS FULL : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈ సారీ ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. తక్కువ ఖర్చుతో రైలులో ఊరెళదామని ఆశపడితే నిరాశ తప్పదు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు మూడు రోజుల నుంచే బెర్తులు నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వెళ్లే రైళ్లలో ఇప్పటికే బెర్తులన్నీ నిండిపోయాయి.

అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో కనీసం టికెట్లు బుకింగ్ చేసుకునేందుకూ అవకాశం లేకుండా రిగ్రేట్ వస్తోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చే రైళ్లలో గోదావరి, ఫలక్​నామా, చార్మినార్, శాతవాహన, ఈస్ట్ కోస్ట్, నర్సాపూర్, కృష్ణా, కోనార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వీటన్నింటిలోనూ జనవరి 10వ తేదీ నుంచి వారం రోజుల పాటు బెర్తులన్నీ ఎప్పుడో నిండిపోయాయి.

దీంతో టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు కేంద్రాలకు వచ్చే ప్రయాణికులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. విజయవాడ నుంచి పలు జిల్లాలకు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక రైళ్ల పైనే ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే నామ మాత్రంగా కొన్ని రైళ్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించింది. ఇవి ఏ మాత్రమూ సరిపోని పరిస్థితి ఉంది.

రైళ్లో బెర్తులు లేకపోవడం.. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలను భరించలేని వారు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. పండుగకు ముందు రోజుల్లో ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా హైదరాబాద్- విజయవాడ, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు వందలోపే. ఇప్పటికే మూడు సార్లు టికెట్ ఛార్జీలు పెంచినందున అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేస్తే ఎవరూ బస్సెక్కరని ఆందోళన చెందిన ఆర్టీసీ యాజమాన్యం.. ఈసారి సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్-విజయవాడ మధ్య కేవలం 324 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వీటిలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. వీటిలోనూ సీట్లు నిండి వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణికలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.

సంక్రాంతి పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. ప్రయాణికుల జేబులు గుల్ల చేసేందుకు సర్వం సిద్దం చేశారు. పండుగ ముందు మూడు రోజుల్లో పలు ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల టికెట్ ధరలను డిమాండ్​ను బట్టి మూడింతల వరకు పెంచారు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఎసీ, స్లీపర్, నాన్​ ఏసీ సర్వీసుల్లో టికెట్ ధరలు విమాన టికెట్ ధరలకు సమానంగా పెంచారంచే దోపిడీ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నింటికీ ఆన్​లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అన్ని బస్సుల్లోనూ విపరీతంగా టికెట్ రేట్లు పెంచారు. ఆన్​లైన్ వెబ్​సైట్లలో టికెట్ ధరలు ఉంచి మరీ అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరు.

పండుగకు ఛార్జీల భారాన్ని భరించలేని కొందరు.. ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు తమ వద్ద ఉన్న కార్లు, మోటార్ బైక్​లపై సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పండుగకు ప్రయాణ భారాన్ని తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.