ETV Bharat / state

రైతులకు సాయంగా ఆగ్రో మిషన్​ని ఆవిష్కరించారు.. ఎవరంటే..?

author img

By

Published : Feb 25, 2023, 3:33 PM IST

MULTI PURPOSE ECO FREINDLY AGRO MACHINE : వ్యవసాయంలో తనవాళ్లు పడుతున్న కష్టాన్ని చూసిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని... అద్భుత ఆవిష్కరణకు ప్రాణం పోసింది. వరి, గోదుమ పంట నూర్చడానికి పెద్ద రైతులంతా భారీ యంత్రాలు ఊపయోగిస్తుంటే... చిన్నసన్నకారు రైతు మాత్రం ఎందుకు ఉపయోగించకూడదని తనకు తాను ప్రశ్నించుకొంది. అందుబాటులో ఉన్న వ్యవసాయ పరికరాలను తాత అద్దెకు తెచ్చుకోలేక పడుతున్న కష్టానికి తానో పరిష్కారం చూపాలన్నశుభశ్రీ ప్రయత్నం ఫలించింది.తన ఆలోచనలకు రూపమిచ్చి మల్టి పర్సస్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్ రూపొందించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు పాఠశాల యాజమాన్యం పేటెంట్‌ హక్కులు తీసుకొనేందుకు యత్నిస్తామని ప్రకటించింది.

AGRO MACHINE
ఆగ్రో మిషన్

MULTI PURPOSE ECO FREINDLY AGRO MACHINE : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని పారామిత పాఠశాల విద్యార్థిని శుభశ్రీ సాహు సీబీఎస్ఈ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ 2022-23 విజేతగా నిలిచింది. జాతీయ స్థాయిలో సీబీఎస్సీ పాఠశాలల్లో “పర్యావరణ” విభాగంలో శుభశ్రీ రూపొందించిన నమూనా ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడంతో పాఠశాల విద్యార్దుల్లో ఆనంద వ్యక్తం అవుతోంది.. శుభశ్రీ తండ్రి లలిత్ మోహన్ సాహు.. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా.. ప్రాజెక్టు రూపకల్పనలో సలహాలు సూచనలు ఇచ్చారు.

సాధారణంగా రైతులు పండించిన వరిని కోసి ధాన్యం వేరు చేయాలంటూ ప్రస్తుతం అంతటా హార్వెస్టర్లు(వరికోత యంత్రాలు) వినియోగిస్తున్నారు. అయితే చిన్న సన్నకారు రైతులు హార్వెస్టర్ల వినియోగం తలకు మించిన భారంగా భావిస్తారు.. హార్వెస్టర్లు అద్దెకు తీసుకునే స్థోమత ఉండదు.అయితే వేసవి సెలవుల్లో ఒడిషాలోని తమ సొంతూరుకు వెళ్లినప్పుడు శుభశ్రీ ఈ కష్టాలను గుర్తించింది. వరికోసం చేనులో పంజగొట్టడం, ఎద్దులతో బంతి కొట్టించి వరి వేరు చేయడం.. తర్వాత వాటిని తూర్పార పడుతుండగా దుమ్మూదూళి నోట్లోకి, ముక్కుళ్లోకి పోయి అనారోగ్యానికి గురికావడం శుభశ్రీ కలత చెంది రైతులు పడుతున్న సమస్యకు తనవంతుగా ఏదైనా ఆలోచించి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శుభశ్రీ వివరించింది.

ఇంతకూ శుభశ్రీ రూపొందించిన యంత్రం ఉపయోగాలు తెలుసుకుంటే ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద ఆలోచన ఎలావచ్చిందా అని ఆశ్చర్య పోక తప్పదు. రైతుల ప్రయోజనం కోసం “మల్టీ ఫంక్షనల్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మెషిన్” ద్వారా అనేక పనులు చేసుకోవచ్చు. కోసిన వరి లేదా, గోదుమ పంటను ఈ మిషన్లో వేస్తే... వడ్లను వేరు చేయవచ్చు. అంటే ధాన్యం నూర్పిడి చేస్తుందన్న మాట. ఇలా చేసే క్రమంలో ధాన్యం పూర్తిగా వరి నుంచి వేరుపడి... అందులోని దుమ్ముదూళి మిషన్ లోనే వేరు పడిపోతుంది. ఇదే తరహాలో గోదుమ పంట కోసి మిషన్లో వేస్తే గోధుమలు వేరే, అందులోని గోధుమ గడ్డి వేరేగా అయిపోతాయి. ఇలా వచ్చిన ధాన్యాన్ని లేదా గోధుమమలు సంచుల్లో నింపి.. ఇదేమిషన్ పై కుట్టు వేసే విధంగా కూడా ఈ మిషన్ రూపకల్పన చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా ధాన్యం, గోధుమలు వేరు చేసిన తర్వాత వచ్చిన గడ్డిని ఇదే మిషన్లో వేస్తే.. పశువుల మేతకు కావాల్సిన విధంగా కట్ చేస్ చాపర్ లాగా కూడా ఈ మిషన్ ను వాడుకోవచ్చు. అంతేకాదు.. కూరగాయలు, పండ్లు లాంటివి వేస్తే పశువులు మేసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి.. ఇలా అనేక రకాల పనులు చేసి పెట్టే ఈ యంత్రానికి ఎలాంటి ఇంధనమూ అవసరం లేదు. ఈ యంత్రం నడిచేందుకు వీలుగా అమర్చిన మోటార్లు రన్ కావాడనికి సోలార్ ఎనర్జీని వాడుకునే ఏర్పాటు చేసారు. యంత్రం పై భాగంలో అమర్చిన సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో బ్యాటరీ ఛార్జింగ్ చేసి.. ఆ విద్యుత్​తో యంత్రం పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ మిషన్ సైజు చాలా చిన్నగా ఉండటం వల్ల విప్పదేసి ఎక్కడికైనా సునాయాసంగా తీసుకెళ్లవచ్చని శుభశ్రీ, ఆమెకు గైడుగా పనిచేసిన తండ్రి లలిత్ మోహన్ సాహు చెప్పారు.

అటు పర్యావరణ హితంగానూ, ఇటు రైతుకు మేలు చేసే విధంగానూ రూపొందించిచన ఈ వినూత్నమైన వర్కింగ్ మోడల్‌ను జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినప్పుడు న్యాయనిర్ణేతలు అబ్బుర పడ్డారు. దీంతో.. దేశవ్యాప్తంగా అనేక సైన్స్ మోడల్స్ వచ్చినా.. మల్టి పర్పస్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్ కే మొదటి స్థానం దక్కింది.. లలిత్ మోహన్ సాహు ఆధ్వర్యంలో శుభశ్రీ అభివృద్ధి చేసిన నమూనా రాష్ట్ర స్థాయిలో, అటు జాతీయ స్థాయిలోనూ ఉత్తమ నమూనాగా నిలిచింది. జనవరి 2024లో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్​కు కూడా ఈ మోడల్​కు ఎంట్రీ కూడా సాధించింది.

ఇందులో ఉపయోగించిన పరికరాలన్నీ కూడా బయట సులభంగా దొరికేవేనని.. భవిష్యత్తులో మరింతగా దీన్ని అభివృద్ధి చేసి అధిక పవర్ వినియోగించుకునే విధంగా తయారు చేయవచ్చని శుభశ్రీ వివరించింది. ప్రస్తుతం ఈ యంత్రం 15 వేల ఖర్చుతో రూపొందించినప్పటికీ.. అధిక సంఖ్యలో ఇలాంటి యంత్రాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే కేవలం 5 వేల ఖర్చుతో అందించవచ్చని చెబుతున్నారు శుభశ్రీ భవిష్యత్తులో ఈ యంత్రానికి అధనంగా బరువు తూచే ఏర్పాట్లు, ధాన్యం నాణ్యతను మరింత పెంచే ఏర్పాట్లు చేసే విధంగా రూపకల్పన చేయాలనకుంటున్నట్లు శుభశ్రీ తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ లాంటి ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్న యువత ఓ వైపు అద్భుతాలు సాధిస్తుంటే... ఓ చిన్నారి విద్యార్థిని రైతుల తరపున ఆలోచన చేసి.. వారి కష్టాన్ని గుర్తించి ఓ పరికరం తయారు చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. పాఠశాల ఛైర్మన్ ప్రసాద రావు. ఈ పరికరానికి పేటెంట్ తీసుకుని మరింత అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామంటున్నారు.

రైతుల గురించి ఆలోచించి ఓ వినూత్న పరికరానికి ప్రాణం పోసిన శుభశ్రీ వివరించే విధానం కూడా అందరిని కట్టి పడేస్తుంది. చిన్న వయస్సులోనే తన ఆలోచనకు ప్రాణం పోయడమే కాదు.. మాతృభాష ఒడియా అయినప్పటికి తెలుగు సహా ఏడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఈ చిన్నారి.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనం ఆశిద్దాం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.