ETV Bharat / state

పోరస్ పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలంటూ.. కదంతొక్కిన గ్రామస్థులు

author img

By

Published : Apr 19, 2022, 5:36 AM IST

ప్రాణసంకటంగా మారిన పోరస్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలంటూ ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ప్రజలు పోరాటం ఉద్ధృతం చేశారు. ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయంటూ పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు.. ఉత్పత్తి ఆపాలంటూ గేటు బద్ధలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించే క్రమంలో తీవ్రమైన తోపులాట జరిగింది.

porus
porus

పోరస్‌ రసాయన పరిశ్రమను తొలగించాలంటూ ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రజలు ఆందోళన తీవ్రతరం చేశారు. పరిశ్రమను మూసేశామని చెబుతూనే పనులు చేస్తున్నారంటూ... తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉత్పత్తి వెంటనే ఆపేయాలంటూ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గేటు తోసుకుని లోపలికి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగాయి. కంపెనీ మొదటి గేటు వద్ద సెక్యూరిటీ గార్డుపై గ్రామస్థులు దాడి చేశారు. అస్వస్థతకు గురైన అతడ్ని... ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకుని సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన నూజివీడు డీఎస్పీ... ఆందోళకారులను అదుపు చేసేందుకు శ్రమించారు.

పోరస్ పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలంటూ.. కదంతొక్కిన గ్రామస్థులు

ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు.... గ్రామంలోపరిస్థితిని సమీక్షించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేయాలంటూ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ప్రాణాంతకంగా మారిన పోరస్‌ పరిశ్రమ వద్దంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిశ్రమలో ఎలాంటి పనులూ జరగడం లేదని... ఏలూరు జేసీ అరుణ్‌బాబు తెలిపారు. ప్రమాదం తర్వాత విద్యుత్‌ సరఫరా నిలిపేయడంతో పాటు... ఉన్నతాధికారులతో కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి : పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.