ETV Bharat / state

Polavaram Project: గుంతలను పూడ్చేందుకు.. రూ.800 కోట్లు పెట్టాల్సిందే

author img

By

Published : Apr 15, 2022, 4:14 AM IST

పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఏర్పడ్డ ఇసుక కోత, పెద్ద పెద్ద గుంతలను పూడ్చేందుకు రూ.800 కోట్లకు పైగా నిధులు అవసరమని నిపుణులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు పోలవరం పనులకు అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లే. పోలవరంలో గోదావరి నదీగర్భం పెద్ద ఎత్తున కోసుకుపోయిన విషయం తెలిసిందే.

Polavaram
Polavaram

పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ వరదలకు ఏర్పడ్డ ఇసుక కోత, పెద్ద పెద్ద గుంతలను పూడ్చేందుకు డ్రెడ్జింగే మెరుగైన పరిష్కారమని నిపుణులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకు రూ.800 కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు పోలవరం పనులకు అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లే. పోలవరంలో గోదావరి నదీగర్భం పెద్ద ఎత్తున కోసుకుపోయిన విషయం తెలిసిందే. 2020 భారీ వరదలకు ఎగువ కాఫర్‌ డ్యాంలో రెండుచోట్ల వదిలిన భాగాల నుంచి పెద్ద ఎత్తున వడి, వేగంతో ప్రవాహాలు రావడంతో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఈ కోత ఏర్పడింది. దీంతో అక్కడి భూ భౌతిక పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన రాతి, మట్టికట్టతో నిర్మించాల్సిన డ్యాం డిజైన్లు ఖరారు చేయాలంటే అక్కడి ఇసుక కోత, గుంతలు పడ్డ సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిల్లీలో వరుసగా కేంద్రమంత్రి వద్ద సమావేశంలో దీనిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

పోలవరం తాజా సమస్యలపై అనేకమంది నిపుణులు తర్జనభర్జనలు పడుతూ సమస్యలను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా దిల్లీ ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు, దిల్లీ ఐఐటీ విభాగాధిపతి రమణ, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్‌ జానకిరామయ్యలతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి ఇసుక కోత సమస్య పరిష్కారానికి సూచనలు ఇవ్వాలని కోరారు. అక్కడ డ్రెడ్జింగ్‌ చేయాలని వారు సూచించారు. కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ ముఖ్యులు ఈ ఆలోచనతో విభేదించారు. పోలవరంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని మొత్తం తోడివేసి తర్వాతే అక్కడ ఇసుక నింపాలన్నారు. నిపుణుల బృందం రెండు ప్రతిపాదనల పైనా సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలిసింది. మొత్తం నీటిని తోడాలంటే రూ.2,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని తేల్చినట్టు సమాచారం. మరోవైపు డ్రెడ్జింగ్‌ సాయంతో ఇసుకను అక్కడ నింపి వైబ్రో కాంపాక్షన్‌ విధానంలో దాన్ని గట్టిపరచాలని ప్రతిపాదించారు. ఇందుకు సుమారు రూ.800 కోట్లకు పైగా ఖర్చవుతుందని లెక్కలు వేశారు.
ఈ రెండు ప్రతిపాదనలను దిల్లీలో కేంద్ర జలసంఘం నిపుణులు, డీడీఆర్‌పీ సభ్యులు, వీఎస్‌ రాజు తదితర నిపుణుల బృందం, పోలవరం అధికారులు బుధవారం కలిసి చర్చించినట్లు తెలిసింది. నీటిని తోడివేసి ఇసుక నింపడమంటే భారీ వ్యయం అవుతున్నందున అది కష్టమని నిర్ణయానికి వచ్చారు. డ్రెడ్జింగ్‌లో రూ.800 కోట్లతోనే సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నందున అటువైపు మొగ్గు చూపారు.

పోలవరం నదీగర్భంలో దిగువన మైనస్‌ 12 మీటర్ల కోత స్థాయి నుంచి ఎగువన +15 మీటర్ల వరకు డ్రెడ్జింగు విధానంలో ఇసుకను నింపాలని యోచిస్తున్నారు. దాన్ని గట్టిపరిచాక తిరిగి +15 నుంచి +8 మీటర్ల వరకు ఉన్న ప్రాంతంలో ఇసుకను తొలగించి అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మిస్తూ రావాలనే అంచనాకు వచ్చారు. ఈ మేరకు పూర్తి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఐఐటీ నిపుణులు నేరుగా పోలవరం వచ్చి అక్కడి పరిస్థితులు చూస్తారని సమాచారం. ఈ అంశాలన్నింటినీ త్వరలో కేంద్రమంత్రి ముందుంచి నిర్ణయం తీసుకుంటారు.

ఇదీ చదవండి: Polavaram Canal: పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.