ETV Bharat / state

POLAVARAM : పోలవరం డయాఫ్రం వాల్‌ విధ్వంసం... ఎవరిదీ వైఫల్యం?

author img

By

Published : Apr 23, 2022, 4:28 AM IST

POLAVARAM
POLAVARAM

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విధ్వంసం.! తాజాగా చర్చనీయాంశమవుతున్న విషయం. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గోడ ధ్వంసమైందని జలవనరుల శాఖ మంత్రి ఆరోపిస్తుంటే.. నివేదికలు, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగినంత సమయం ఉన్నా.. నిర్మాణం చేపట్టకుండా.. కాలయాపన చేయడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని.. మాజీ ఇంజినీరింగ్ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం పోలవరం పనులను ఆపేయడమే అసలు సమస్యకు కారణమన్నది వారి బలమైన వాదన..

చాలినంత సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడిందా? కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో కలిపి 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే మిగిలింది. అదీ మట్టి పని. వరదల కాలం, కరోనా నెల తీసేసినా ఈ పని చేయడానికి చాలినంత సమయం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా భవిష్యత్తు ఇబ్బందులను అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే 2020 వరదల్లో విధ్వంసం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో జరిగిన చర్చలు, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశాల మినిట్స్‌ ఆధారంగా పరిశీలిస్తే పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం, అత్యవసర పనులు కూడా... ఉన్న సమయంలో పూర్తి చేయకపోవడమే పెను సమస్యలకు దారి తీసిందన్న వాదనకు బలం చేకూరుతోందని విశ్రాంత ఇంజినీరింగు అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త టెండర్లు పిలవొద్దని, అలా చేస్తే ప్రాజెక్టు భవితవ్యమే అనిశ్చితిలో పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2019 ఆగస్టులోనే హెచ్చరించినా వారి సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి.

2018 నవంబరులో ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించారు. మే నెల వరకు అంటే ఏడు నెలల్లో 38.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తిచేశారు. దిగువ కాఫర్‌ డ్యాంలో అంత కన్నా ఆలస్యంగా పనులు ప్రారంభించారు. 3.37 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తిచేశారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో ఇక చేయాల్సింది కేవలం మట్టి పని మాత్రమే. ఆ పనులు పూర్తి చేసేందుకు 2020 వరదల కాలం వరకు చాలా సమయం ఉన్నా పూర్తిచేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2020 మే నాటికి కాఫర్‌ డ్యాంలు పూర్తిచేయాలని చెప్పింది. 2020 వరదల్లో గోదావరి నదీగర్భం కోసుకుపోయింది. డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఇప్పుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలా అన్న సవాలు ఎదురయింది. రూ.వందల కోట్ల అదనపు భారం పడబోతోంది. పోలవరంలో అనవసర కాలయాపన చేయకుండా పనులు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది.

పనులు ఆపేయడమే అసలు సమస్య కాదా?

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాలు సమాంతరంగా చేయాలని పాత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్లింది. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాంల నిర్మాణాలు సమాంతరంగా చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీలూ ఆమోదించాయి. పోలవరంలో ఏ పని చేయాలన్నా వారి ఆమోదం తప్పనిసరి. 2019 జూన్‌ నాటికే ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు రావడంతో పోలవరం పనులు మందగించాయి.

* 2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పోలవరం పనులను నిలిపివేసింది. కొత్తగా రివర్స్‌ టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. 2019 అక్టోబరులో టెండర్ల కార్యక్రమం నిర్వహించింది.

పోలవరం అథారిటీ అడ్డు చెప్పలేదా?

పోలవరం పనులు ఆపేయడం తగదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయంది. పోలవరం పనుల్లో తగిన పురోగతి ఉన్నందున గుత్తేదారుణ్ని మార్చవలసిన అవసరం లేదంది. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్లు ఖరారు చేసుకుంటే ఆ తర్వాత పనులు త్వరగా పూర్తిచేయొచ్చని సూచించింది. కొన్ని అంశాలు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోకుండా పనులు నిలిపివేసి రివర్స్‌ టెండర్లు నిర్వహించింది. 2019 నవంబరులో కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించింది. తర్వాత కూడా పనులు వేగంగా సాగలేదు. నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు (కరోనా ఉద్ధృతి పెరిగే వరకు) ఆరు నెలల సమయం ఉన్నా ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌ల్లో మిగిలి ఉన్న పని, దిగువ కాఫర్‌ డ్యాం పని చేసి ఉంటే ఈ విధ్వంసం వాటిల్లే అవకాశం లేని మాట వాస్తవం కాదా అన్నది చర్చనీయాంశమవుతోంది.

35.82 లక్షల క్యూ.మీ. పని చేయలేరా?

మొత్తం ఎగువ కాఫర్‌ డ్యాం పని 73.94 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని. 2019 మే నాటికే అందులో 38.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని ఆరు నెలల్లోనే చేశారు. అందువల్ల మిగిలిన 35.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని కూడా అదే సమయంలో చేయొచ్చు. వరదల వల్ల ఈ డ్యాంలు పూర్తి చేసుకోవడమే ముఖ్యమైన నేపథ్యంలో ఆ ఒక్క పనిమీదే దృష్టిసారిస్తే ఇంకా ఎక్కువ యంత్రాలు వినియోగిస్తే అంతకన్నా తక్కువ సమయంలోనే చేయొచ్చని చెబుతున్నారు. అలాంటిది 2020 జులైలో వరదలు వచ్చేవరకూ ఏకంగా ఏడాది కాలం అందుబాటులో ఉంది. పైగా నవంబరు నుంచి జూన్‌ వరకు 8 నెలల కాలం ఉంది. కరోనా ఏప్రిల్‌ నెలాఖరుకు పెరిగింది. ఆ నెల తీసేసినా ఏడు నెలల కాలం ఉంది. దిగువ కాఫర్‌ డ్యాంలో మిగిలి ఉన్న పని కూడా 25.46 లక్షల క్యూబిక్‌ మీటర్లే. ఈ రెండూ మట్టితో నిర్మించే డ్యాంలే. కొత్త ప్రభుత్వం వాటిని పూర్తి చేయకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందనే అభిప్రాయం విశ్రాంత ఇంజినీరింగు అధికారుల నుంచి వినిపిస్తోంది.

ఎప్పుడు ఈ విధ్వంసం? పనులకు చాలినంత సమయం లేదా?

2020 వరదల్లోనే పోలవరంలో విధ్వంసం జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ మార్చి 22న అసెంబ్లీలో పోలవరంపై చర్చలో స్వయంగా ఇదే విషయం చెప్పారు. ఆ వరదల వరకూ ఉన్న సమయాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకుని ఉంటే ఈ సమస్య తలెత్తి ఉండేదా?
2019 వరదల్లోనే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ప్రభుత్వంలోని ఒకరిద్దరు చెబుతున్నారు. 2020 జనవరి 24న పోలవరం ప్రాజెక్టు అథారిటీ 11వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డయాఫ్రం వాల్‌ ధ్వంసం విషయాన్ని మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. 2019 డిసెంబరు 27-31 మధ్య కేంద్ర నిపుణుల కమిటీ పోలవరాన్ని సందర్శించిన తర్వాతే ఈ సమావేశం జరిగింది. తదుపరి డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశం ముందు కొన్ని సాంకేతిక సమస్యలను ఎజెండా అంశాలుగా చర్చిస్తున్నామని ఎస్‌ఈ పోలవరం అథారిటీకి తెలియజేశారు. ఆ ఎజెండాలో డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న అంశమే లేదు. 2019 వరదల్లో పోలవరానికి ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ఆ మినిట్స్‌ ద్వారా అర్థమవుతోంది.కొత్త ప్రభుత్వం పోలవరంలో చేసింది ఏమిటి? ఎంత స్థాయి పని?

కొత్ర ప్రభుత్యం పోలవరంలో చేసింది ఏమిటి? ఎంత స్థాయి పని?

2021 జనవరిలో ప్రస్తుత ప్రభుత్వ అధికారులే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో స్పష్టంగా 2019కి ముందు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వ హయాంలో అప్పటివరకు ఎంత పని జరిగిందో స్పష్టంగా వివరించారు. ఈ ప్రభుత్వం పోలవరంలో ఎంత పని చేసిందో ఈ అధికారులే స్పష్టంగా పేర్కొన్నారు.
* 2019 మే నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పోలవరం పనులు ఆపేసింది. 2019 నవంబరులో మేఘా ఇంజినీరింగు కంపెనీ పోలవరం పనులు చేపట్టింది. ఆ తర్వాత 2021 జనవరిలో జగన్‌ ప్రభుత్వంలోని అధికారులు సిద్ధం చేసిన నివేదిక చెప్పినది ఇదీ..

పోలవరం ప్రధాన డ్యాంలో మొత్తం ఎంత పని చేయాలి? 2019 మే చివరి నాటికి పాత ప్రభుత్వంలో ట్రాన్స్‌ట్రాయ్‌, నవయుగ కలిసి ఎంత పని చేశాయి...ఆ తర్వాత కొత్త ప్రభుత్వ హయాంలో ఎంత జరిగింది?

పెను సమస్యలు ఏంటి?

? 2020లో గోదావరికి వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్‌ 1290 మీటర్ల నుంచి 1447 మీటర్ల వరకు కోసుకుపోయింది. ఎడమ వైపున మరికొంత కోత ఏర్పడింది. మొత్తం 300 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. 2.5 నుంచి 3.5 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఇంజినీర్లు గుర్తించారు. దీన్ని ఎలా సరిదిద్దాలన్నది ప్రశ్న.
? అదే 2020 వరదలకు నదీగర్భంలో ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మించాల్సిన చోట మొదటి గ్యాప్‌లో 30 మీటర్ల మేర, రెండో గ్యాప్‌లో 36.5 మీటర్ల మేర గుంత ఏర్పడింది. 12 మీటర్ల లోతు నుంచి ఇసుక కోసుకుపోయి ఈ గుంతలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయి... ప్రధాన రాతి, మట్టికట్టతో డ్యాం నిర్మించాలంటే ఇసుక నింపి గట్టిదనం ఏర్పరచాలి. అక్కడ మళ్లీ ఇసుకతో నింపడం పెద్ద సమస్యగా మారింది.

...

ఇదీ చదవండి: Polavaram Project: పోలవరం సవాళ్లపై మేధోమథనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.