పోలవరంపై ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశం.. ఎప్పుడంటే..!

author img

By

Published : Jan 9, 2023, 4:26 PM IST

Polavaram Backwater

Polavaram Backwater: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంశంపై కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఏపీ సహా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సీఎంలతో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశానికి సన్నాహకంగా ఈ నెల 13వ తేదీన కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది.

CM's meeting on Polavaram backwater: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై కేంద్ర జలసంఘం ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంతో పాటు పీపీఏ సమావేశంలో నీటి లభ్యతతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపు సమస్య ఉందంటూ తెలంగాణా, చత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

13 తేదీన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ భేటీ: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంశంపై కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఏపీ సహా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఏపీ, తెలంగాణా, ఒడిశా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలసంఘం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సన్నాహకంగా ఈ నెల 13 తేదీన కేంద్ర జలసఘంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంతో పాటు గోదావరీ నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

బ్యాక్ వాటర్ పై రీసర్వే కోసం డిమాండ్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ఇటీవల భద్రాచలం ముంపునకు గురైందని తెలంగాణా వాదిస్తోంది. బ్యాక్ వాటర్ పై రీసర్వే చేయించాలని డిమాండ్ చేసింది. దీంతోపాటు ఒడిశా, చత్తీస్​గఢ్ సైతం అభ్యంతరాలను తెలిపాయి. పోలవరం బ్యాక్ వాటర్​పై ఇప్పటికే శాస్త్రీయమైన అధ్యయనం నిర్వహించినట్టు పీపీఏ స్పష్టం చేసింది. ఇక తదుపరి ఉమ్మడి సర్వే అవసరం లేదని తేల్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్ వాటర్ విస్తరించే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది.

ముంపుపై తెలంగాణా తన నివేదిక: బ్యాక్ వాటర్ ముంపు అంచనాకు సంబంధించి కేంద్ర జలసంఘం నేతృత్వంలో వివిధ రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్​లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు 2022 డిసెంబరులో అన్ని రాష్ట్రాలు తమ అభ్యంతరాలతో కూడిన నివేదికలను అందజేశాయి. వాటిపై చర్చించడానికి ఢిల్లీలో ఈ నెల 13న మరోమారు సాంకేతిక కమిటీ సమావేశం కానుంది. గతేడాది జులైలో గోదావరికి వచ్చిన వరద కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయని పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే భద్రాచలం పట్టణంతోపాటు 100 గ్రామాలు, సాగు భూములు మునిగాయని తెలంగాణా తన నివేదికలో పేర్కోంది. ఈ అంశాలపై సాంకేతిక కమిటీ సమావేశంతో పాటు ముఖ్యమంత్రుల సమావేశంలోనూ చర్చించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.