ETV Bharat / state

బిడ్డ మనసును.. అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు!

author img

By

Published : Jul 28, 2021, 8:53 AM IST

తన చిన్నారి పిలుపు వల్ల.. తన లాంటి తల్లుల బాధను తెలుసుకుంది. తనకు కష్టం వచ్చిందని బాధపడకుండా.. తన బిడ్డ కోసం చదివింది. మానసికంగా ఎదగలేని పిల్లలకు మొదటగా టీచరైంది. తర్వాత తనో పదిమందికి అమ్మైంది. వాళ్ల బాగోగులు చూస్తున్నప్పుడు.. ఆర్థికంగా చితికిపోయినా తట్టుకుంది ఎందుకంటే తల్లి కదా. ఇప్పుడు తన చేతిలో ఎదిగిన పిల్లలు ప్రయోజకులుగా మారినపుడు.. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతుంది.

Specialized school  for Mental disability  children at east godavari district
వైవీఎస్‌ఎస్‌ జయలక్ష్మి

బిడ్డ మనసుని అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు! మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డలాంటి మరెందరో బిడ్డలకోసం ఆమె ఒక ప్రత్యేకమైన పాఠశాలని ఏర్పాటుచేశారు. ఆమెతోపాటు కుటుంబం మొత్తం ఈ యజ్ఞంలో పాల్గొనడం విశేషం...

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైవీఎస్‌ఎస్‌ జయలక్ష్మికి ఇద్దరు పిల్లలు. రెండో సంతానం సింధూరి. తను పుట్టుకతో మైక్రోసెఫలిస్‌ వ్యాధికి గురైంది. నాలుగేళ్ల వయసొచ్చే వరకూ ఒక్క మాటా మాట్లాడలేదు. పాఠశాలలో చేర్పిస్తే మార్పు వస్తుందేమో అనుకున్నారు. కానీ పిచ్చి పిల్లని చేర్చుకోమంటూ వాళ్లు ఇచ్చిన కఠినమైన సమాధానం ఆ తల్లి మనసుని తీవ్రంగా గాయపరిచింది. కొన్నాళ్లు ఆ బాధనుంచి తేరుకోలేకపోయారు. తర్వాత ఎంతో వెతగ్గా రాజమండ్రిలో ప్రత్యేక పాఠశాల ఉందని తెలుసుకుని అందులో చేర్చారు. అక్కడి టీచర్ల బృందం ప్రయోగాలు ఫలించి సింధూ తొలిసారి ‘అమ్మా’ అని పిలిచింది. ఏళ్ల నుంచి ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న జయలక్ష్మికి పట్టలేని సంతోషం కలిగింది. ఆ ఉత్సాహంతో తనూ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసి అదే పాఠశాలలో టీచరుగా చేరారు. అప్పటికీ సింధూరికి సాధారణ స్కూల్‌లో సీటు దొరకలేదు. ఇదంతా చూసి ఇలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు జయలక్ష్మి.

ఇంట్లోనే శిక్షణ....

తన కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగుడైన పొరుగింటి అబ్బాయికి కూడా ఇంట్లోనే శిక్షణ ప్రారంభించారు. ఈ విషయం చుట్టుపక్కల ఊళ్లకూ పాకింది. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లలను ఇక్కడ చేర్పించడం మొదలుపెట్టారు. కొద్దికాలంలోనే వారి సంఖ్య 40కి చేరుకుంది. దీన్ని వ్యవస్థీకృతం చేయాలని 2012లో గుంటూరు నవభారత్‌ నగర్‌లో ‘ప్రభాత సింధూరి పాఠశాల’ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పుడు 65 మంది శిక్షణ పొందుతున్నారు. ఉదయం 9 గంటలకు యోగాతో పాఠశాల ప్రారంభమవుతుంది. ఏడాది నుంచి 18 ఏళ్ల వయసున్న మానసిక దివ్యాంగులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక బీఈడీ చేసిన టీచర్లు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఫిజియోథెరపిస్టులతో కసరత్తులు చేయిస్తారు. తమ పనులు తాము సొంతగా చేసుకునేలా ప్రోత్సహిస్తారు. అక్షరాలు, అంకెలు, బొమ్మలు వంటివి గుర్తుపట్టడంలోనూ శిక్షణ ఇస్తారు. సృజనాత్మకత పెంపొందించే స్వయంఉపాధి మార్గాలనూ నేర్పిస్తారు. పిల్లలతో కొవ్వొత్తులు, ప్రమిదలు, క్లాత్‌బ్యాగులు, రాఖీల వంటివి తయారు చేయిస్తారు. శారీరకంగా ఎదుగుదల లేనివాళ్లకు, ఆటిజం పిల్లలకు ఫిజియోథెరపిస్టులతో తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ఓపెన్‌స్కూల్‌ ద్వారా పదోతరగతి పరీక్షలు రాయిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో పిల్లలు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తామునిలబడ్డారు.

ఇదీ చూడండి: ప్రకృతి ఒడిలో అమ్మ ప్రేమను అందిస్తున్న 'మధు' తుగ్నెట్‌

కుటుంబమంతా సేవలోనే...

జయలక్ష్మి భర్త శ్రీనివాస్‌ రూ.లక్ష వేతనాన్ని వదులుకొని పాఠశాల పనుల్లో నిమగ్నమయ్యారు. వీళ్ల అబ్బాయి ఆక్యుపేషనల్‌ థెరపీలో డిగ్రీ చేసి వీరికి సాయంగా నిలుస్తున్నాడు. ఆ ఇంటి కోడలు కూడా వీరి బాటలోనే నడుస్తూ ఇక్కడే టీచర్‌గా సేవలు అందిస్తోంది. జయలక్ష్మి అత్తమామలు పిల్లలకు మ్యూజిక్‌, పాటలు పాడించడంలో పాలు పంచుకుంటారు. ఈ క్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇల్లు, బంగారం అమ్మేశారు. వీరి అంకితభావం వృథా కాలేదు.

2016 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ట్రస్టు అండగా నిలిచింది. ఎన్‌ఆర్‌ఐలు కొందరు ఒక మినీ బస్సును ఇచ్చారు. భారతీయ స్టేట్‌బ్యాంకు ఒక వ్యాను సమకూర్చింది. దాతల విరాళాలతో ప్రస్తుతం పాఠశాల నిర్వహణ సజావుగా సాగుతోంది. అద్దె స్థలంలో ఉన్న ఈ పాఠశాలకు గుంటూరులోని స్తంభాలగరువులో శాశ్వత భవనం నిర్మిస్తున్నారు. అది పూర్తయితే ఎలాంటి ఆసరాలేని మానసిక దివ్యాంగులను కూడా చేరదీసి సేవలు అందిస్తామని జయలక్ష్మి వివరించారు.

ఇదీ చూడండి:

C. A. Bhavani Devi: 'అమ్మ నగలమ్మి ఫెన్సింగ్ కిట్​ కొన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.