ETV Bharat / state

ఇసుకే బంగారమాయె.. గుత్తేదారు జేపీ సంస్థ మాయాజాలం

author img

By

Published : Jul 22, 2022, 5:14 AM IST

అందరికీ అందుబాటులో ఇసుక ఉంటుందని.. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇస్తామని గనులశాఖ పత్రికా ప్రకటనలు ఇస్తోంది. అది చూసి ఇసుక కొనాలని వెళ్తే.. దొరకట్లేదు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఇసుక ధరలు పేర్కొన్నా.. మూడుచోట్లే అమ్ముతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదంతా గుత్తేదారు జేపీ పవర్‌వెంచర్స్‌ మాయాజాలం

sand-scam-in-andhrapradesh
sand-scam-in-andhrapradesh

'అందరికీ అందుబాటులో ఇసుక.. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక' అంటూ సీఎం జగన్‌ బొమ్మతో గనులశాఖ పత్రికా ప్రకటనలు ఇస్తోంది. అది చూసి ఇసుక కొనాలని వెళ్తే.. దొరకట్లేదు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఇసుక ధరలు పేర్కొన్నా.. మూడుచోట్లే అమ్ముతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదంతా గుత్తేదారు జేపీ పవర్‌వెంచర్స్‌ మాయాజాలం. వర్షాలు, వరదలతో ఇసుక కొరతను సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఛార్జీలతో కలిసి లారీ లోడ్‌కు సగటున రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది.

గోదావరి వరదలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని రీచ్‌లలో కొంతకాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న నీటితో.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఒక్క రీచ్‌లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కొరత లేకుండా చూసేందుకు కొన్ని నెలలుగా చాలాచోట్ల ఇసుక నిల్వచేశారు. రీచ్‌లలో తవ్వకాలకు అవకాశం లేనపుడు, నిల్వ కేంద్రాల నుంచి విక్రయాలు చేయాలి. కానీ జేపీసంస్థ నిల్వ కేంద్రాలను అరకొరగానే తెరవడంతో ఇసుక కొరత ఏర్పడి, ధర పెరుగుతోంది. ఈ విషయాన్ని గనులశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జేపీ సంస్థ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది.

.

ఉభయ గోదావరిలో మూడు కేంద్రాలే

  • ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు పాయింట్లలో ఇసుక నిల్వచేసినా.. తాడేపల్లిగూడెం, రావులపాలెం, లాలాచెరువు నిల్వ కేంద్రాల్లోనే ఇసుక అమ్ముతున్నారు.
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 చోట్ల ఇసుక నిల్వలు ఉంచినా.. రావులపాలెం, లాలాచెరువు కేంద్రాల్లోనే ఇసుక విక్రయిస్తున్నారు. అన్ని ప్రాంతాలవారూ ఇక్కడకు రావాల్సి వచ్చి, రవాణా ఛార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి.
  • ఉమ్మడి పశ్చిమగోదావరి అంతా కలిపి తాడేపల్లిగూడెంలోనే విక్రయిస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పందలపర్రు, పెండ్యాల, పీపర్రు, సిద్ధాంతం కేంద్రాల్లోనూ ఇసుక ఉన్నా.. విక్రయించడం లేదు.
  • రావులపాలెం, తాడేపల్లిగూడెంలో విక్రయిస్తున్న ఇసుక బాగోవడంలేదని కొనుగోలుదారులు చెబుతున్నారు. అక్కడ గత ఏడాది నిల్వచేసిన ఇసుక ఉండిపోవడంతో.. ముందుగా దాన్నే విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో రీచ్‌లు మూతపడగా.. చందర్లపాడు మండలం కాసరాబాద్‌ రీచ్‌లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, చిల్లకల్లు కేంద్రాల్లో ఇసుక నిల్వచేసినా, చాలాచోట్ల అమ్మడంలేదు. కాసరాబాద్‌లో ఇసుక లోడింగ్‌కు 24 గంటలపైనే పడుతోంది.
  • గుంటూరు జిల్లాలో పూర్తిస్థాయిలో స్టాక్‌ పాయింట్లు తెరవకపోవడంతో.. కృష్ణా జిల్లా నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు.

అమ్మో.. అంత వ్యయమా?
గతంలో రవాణా ఖర్చులతో కలిపి లారీ ఇసుక రూ.13-15 వేలకు లభించేది. ఇప్పుడది రూ.22-25 వేలకు చేరింది. ఈ ధర చూసి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకకే ఇంత ఖర్చయితే నిర్మాణాలు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉండే ఉచిత ఇసుక స్థానంలో ప్రభుత్వ ధరలతో విక్రయాలు తెచ్చారని, తీరా ఇప్పుడు అన్నిచోట్లా విక్రయాలు చేయకపోవడంతో రవాణాఛార్జీలతో అధిక భారం పడుతోందని నిర్మాణదారులు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: ప్రజలను బురదలో వదిలేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.