ETV Bharat / state

అమలాపురం డివిజన్‌లో రసకందాయంగా రాజకీయం

author img

By

Published : Feb 18, 2021, 10:26 AM IST

అమలాపురం డివిజన్‌లో రాజకీయం రసకందాయంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే ఉండటంతో.. వాటిని ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు.

Politics that has become fruitful in the Amalapuram division
అమలాపురం డివిజన్‌లో రసకందాయంగా మారిన రాజకీయం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌లో రాజకీయం రసకందాయంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం.. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో వ్యక్తిగతంగా కలవడంతోపాటు ప్రచార రథాలు, డిజిటల్‌ మీడియా.. ఇలా ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. డివిజన్‌లోని 273 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా అన్ని మార్గాలనూ వినియోగించుకుంటున్నారు. సర్పంచి స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు పగలంతా ప్రచారంలో మునిగితేలి.. రాత్రి విందు రాజకీయాలకు తెర లేపుతున్నారు. వార్డుల వారీగా పేరున్న నాయకులు, ప్రజల్లో పట్టున్న కార్యకర్తలను గుర్తించి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసి.. ఆయా వార్డుల్లో పరిస్థితిని తెలుసుకుని.. ఏవిధంగా ముందుకువెళ్తే ఓట్లు పడతాయి.? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రత్యర్థి అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్న నాయకుల బలహీనతలను తెలుసుకోవడం.. వారిని నయానో.. భయానో దారికి తెచ్చుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం గ్రామీణ మండలాలతో పాటు.. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.

● ఎత్తుకు పైఎత్తులు..

గ్రామాల్లో తమ పట్టును నిలుపుకొనేందుకు రాజకీయ పార్టీలు తాము మద్దతిస్తున్న అభ్యర్థి విజయానికి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నిస్తున్నారు. సామాజిక సమీకరణలు తెరమీదకు తీసుకువచ్ఛి. ‘మీ వర్గానికి చెందిన వారు సర్పంచి అవుతారు.. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ రాదు’ మీరంతా ఆ అభ్యర్థికే మద్దతివ్వాలని.. సమావేశాలు నిర్వహించి మరీ చెబుతున్నారు. మీ ఇంటిపేరు వారికే వార్డు సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడికే అవకాశం ఇచ్చాం.. సర్పంచి, వార్డులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని ముక్తాయింపునిచ్చి ఓటర్లలో సెంటిమెంటు రగులుస్తున్నారు.

● కోరినంతనే...

అమలాపురం డివిజన్‌లోని చాలా గ్రామాల్లో ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. పంచాయతీల్లో ఆవాసప్రాంతాలకు ప్రచారానికి వెళ్లిన సందర్భంగా అక్కడ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటిని క్షణాల్లో సమకూరుస్తున్నారు. ఓ మేజర్‌ పంచాయతీలో తాను మద్దతుగా ఉన్న అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓ నాయకుడు వంతెన నిర్మాణానికి సామగ్రిని సమకూర్చారు. పలు చోట్ల వార్డుల వారీగా ఓటర్లకు నోట్లు పంచడానికి జాబితాలను సిద్ధం చేశారు. పరిస్థితులను బట్టి.. ప్రత్యర్థి అభ్యర్థి ఇచ్చే దానికంటే రెట్టింపు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చే కొంతమంది ఓటర్లకు ఇప్పటికే ఫోన్‌ పే, గూగుల్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బులు పంపినట్లు తెలుస్తోంది. మద్యం సంగతైతే చెప్పనక్కర్లేదు. వారం ముందు నుంచే అన్ని గ్రామాల్లోనూ పంపిణీ జరుగుతోంది. ఈ రెండు రోజులు మరింత భారీగా పంచడానికి నాయకులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి: రామోజీ ఫిలింసిటీలో "హార్లీడేవిడ్​సన్​" రేసర్ల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.