ETV Bharat / state

గంజాయి రవాణాపై కొనసాగుతున్న దాడులు.. 1500 కేజీల పట్టివేత

author img

By

Published : Nov 14, 2021, 10:32 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు విస్తృత దాడులు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా.. తూర్పు గోదావరి జిల్లాలో.. ఒడిషా నుంచి అక్రమంగా తరలిస్తున్న 1500 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు.

police ride continuing on ganja transport
గంజాయి రవాణాపై కొనసాగుతున్న దాడులు

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని సుకుమామిడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి కూలీల ద్వారా కాలినడకన సుకుమామిడికి గంజాయి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి పాత ఫర్నీచర్ తరలించే ఐషర్ వ్యాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా యూపీలోని ముజాఫరాబాద్‌ తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. ముగ్గురిని అరెస్ట్‌ చేయగా...మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

గుంటూరులో ముగ్గురు అరెస్టు..

లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 21 లిక్విడ్ గంజాయి బాటిల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు గుంటూరు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోగులమూడి శివన్నారాయణ.. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మందు, సిగరెట్టు, పేకాట లాంటి చెడు వ్యసనాలకు బానిసైన శివన్నారయణకు సినిమా హాల్​లో ఆపరేటర్​గా పని చేస్తున్న కళ్లగడ్డ సమీర్ కుమార్, పిడుగురాళ్లకు చెందిన జంపు అమరలింగేశ్వర రావులతో పరిచయం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసై ఈ ముగ్గురు.. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో లిక్విడ్​ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. శనివారం నల్లపాడు వద్ద బాటిళ్లలో లిక్విడ్ గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. లిక్విడ్ గంజాయి బాటిళ్లు, ఓ ద్విచక్రవాహం స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీ జేస్సీ ప్రశాంతి వివరించారు.

మరో కేసులో ఇద్దరు అరెస్టు

ఆటోలో ప్రయాణిస్తున్న యువకుడుని కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈనెల 11న గుంటూరు జిల్లా లింగాయపాలెం అడ్డరోడ్డు వద్ద దారి మళ్లించి ఆటోలో ఉన్న విట్సన్​ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి రూ.10 వేలతోపాటు సెల్ ఫోన్ లాక్కున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు రాఘవ, రాంబాబును అరెస్టు చేయగా.. మరో నిందితుడు గోపి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి వివరించారు.

'అక్రమ రవాణాకు పాల్పడ్డ ముగ్గురు యువకులు చదుకున్న వారే. చెడు వ్యవసానాలకు బానిసై వాళ్లు.. సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికల పై నిఘా ఉంచాలి' అని డీఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో నల్లపాడు సీఐ ప్రేమయ్య, ఎస్సై ఆరోగ్యరాజు, భరత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి.. : ACCIDENT: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై భార్య దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.