Ready for Cockfights at AP: సంక్రాంతి బరికి సిద్ధమైన పందెం కోళ్లు.. 6 నెలల ముందు నుంచే శిక్షణ

author img

By

Published : Jan 11, 2022, 6:22 PM IST

Ready Cockfighting at AP

Ready Cockfights at AP: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. తెలుగు సంప్రదాయం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడిపందేలను సంక్రాంతి పండుగ జరిగే మూడురోజులు కోలాహలంగా నిర్వహిస్తారు. సంక్రాంతికి 6 నెలల ముందు నుంచే ఈ పందెం కోళ్లను సిద్ధం చేస్తారు.

సంక్రాంతి బరికి సిద్ధమైన పందెం కోళ్లు

Ready for Cockfights at AP: బరిలో దిగితే ప్రత్యర్థిని మట్టికరిపించాల్సిందే.. నెత్తురోడుతున్నా, చివరి రక్తం బొట్టు వరకు ఒటమిని అంగీకరించేది లేదు. పౌరుషానికి ప్రతీకగా నిలిచే పందెం కోళ్ల పట్టుదల చూస్తే ఎవరికైనా ఔరా అనిపించాల్సిందే. ప్రాణాలు వదులుతున్నా పోరులో వెన్నుచూపని తెగువ వెనక ఎంతో శ్రమ కఠిన శిక్షణ ఉంటుంది.

ఆరు నెలల ముందు నుంచే శిక్షణ..
సంక్రాంతి బరి కోసం 6 నెలల ముందు నుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. మేలురకం జాతి పుంజులను ఎంపిక చేసి వాటికి బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్‌ లడ్డూ, మటన్‌ కైమా, కోడిగుడ్లు పెట్టి పెంచుతారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్‌ మాత్రలు వేస్తారు. ఒక్కో కోడి పుంజుకు సుమారు 10వేల నుంచి 30వేల వరకు ఖర్చు చేస్తారు. వైరస్‌లు సోకకుండా పుంజులను ఊరిలో కాకుండా ప్రత్యేకంగా స్థలాన్ని లీజుకు తీసుకుని పెంపకానికి ఏర్పాట్లు చేస్తారు.

ఒక్కో పుంజు ధర. 30 వేల నుంచి లక్ష పైనే ..
స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి 6 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసేవారూ ఉన్నారు. పందెం కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే.. పందేలపై ఏ మేరకు ఆసక్తి చూపుతారో ఇట్టే అర్థమైపోతుంది. ఉదయాన్నే ఐదు గంటలకు కోడి పుంజులను బయటికి తీసి కాసేపు చల్లటి గాలి శ్వాస తీసుకునేలా చేసి చుట్టూ వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలిపెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజుల్లో ఎన్నో రకాలు ఉన్నా తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులకు పందెం నెగ్గే శక్తి ఎక్కువ. పూర్తిస్థాయిలో పందేలకు సిద్ధమైన ఒక్కో పుంజు 30 వేల నుంచి లక్ష రూపాయల పైన ధర పలుకుతుంది.

అది తెలియకపోతే... గెలుపు కష్టమే..
వేల రూపాయలు పెట్టి పుంజు కొనుగోలు చేసి, లక్షల రూపాయలు పందెం కాసినా... కుక్కుటశాస్త్రం తెలియకపోతే మాత్రం ఓడిపోక తప్పదు. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేస్తారు. భోగి రోజు గౌడ నెమలి, పండుగ పర్వదినాన కాకినెమలి, కాకి డేగలు గెలుపొందుతాయి. కనుమ నాడు డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో విజయం సాధిస్తాయని కుక్కుటశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవారు చెబుతున్నారు.

ఇదీ చదవండి..: TDP Protest on Heavy Prices : పెరిగిన ధరలపై..తెదేపా పోరుబాట...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.