ETV Bharat / state

మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దు - ఘనంగా ముగిసిన తెలుగు మహాసభలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 9:04 AM IST

telugu_maha_sabhalu
telugu_maha_sabhalu

International Telugu Maha Sabhalu Concluded: ఏ భాషను నేర్చుకున్నా మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని వక్తులు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో మూడు రోజులపాటు ఘనంగా కొనసాగిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి కవులు, కళాకారులు , గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, నటులు, భాషాభిమానులు హాజరై తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.

మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దు - ఘనంగా ముగిసిన తెలుగు మహాసభలు

International Telugu Maha Sabhalu Concluded: తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరంలోని రాజానగరం మండలం గైట్ కళాశాల వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు (Telugu Maha Sabhalu) వైభవంగా సాగాయి. ప్రముఖుల ప్రసంగాలు, కవితా సమ్మేళనాలు, కవితా పఠనం, సాహితీ ప్రక్రియలపై సదస్సులు, సాంస్కృతిక కళాప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి తెలుగు వారు మహా సభలకు హాజరయ్యారు. ముగింపు సభకు నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

అంతర్జాతీయ రెండో తెలుగు మహాసభలు- పెద్దఎత్తున హాజరైన కవులు, రచయితలు

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. తెలుగులో మాట్లాడాలి తెలుగులో సంతకం చేయాలని నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ అన్నారు. పద్యం, అవధానం, కథ, నృత్యం, శిల్పం ఇలా ఎన్నో ప్రక్రియలున్న తెలుగు భాషను "సుందర తెలుగు " అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి పేర్కొన్నారని లా గణేశన్ గుర్తుచేశారు. అనంతరం ప్రముఖ కవి, గాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ అలపించిన గీతం విశేషంగా ఆకట్టుకుంది.

ప్రభుత్వాలు ఉచితాలు ఆపి ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందిస్తే చాలు : వెంకయ్యనాయుడు

ఉత్సవంలో కూచిపూడి రూపకర్త రాధేశ్యాం, ప్రముఖ సినీ కథానాయకుడు కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి, సినీ నటుడు ఆలీలకు (Actor Ali) పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ఆంధ్ర వాంగ్మయ పరిషత్‌ పుస్తకాన్నిఆవిష్కరించారు. అంతకుముందు హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ పంపిన వీడియో సందేశాన్ని వినిపించారు. అక్షర వ్యవసాయంతో తెలుగు భాషకు వన్నె తెచ్చిన నన్నయ విగ్రహం ఒకవైపు, వ్యవసాయంతో సిరులు పండించడానికి దోహదపడ్డ సర్ ఆర్థర్ కాటన్ (Sir Arthur Cotton) విగ్రహం మరోవైపు పెట్టి నిర్వహించిన ఈ సభలు అద్వితీయమని జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి అభిప్రాయపడ్డారు. ఏ జాతి తమ భాష , సంస్కృతి రక్షించుకోదో ఆ జాతికి మనుగడ ఉండదని మహాత్మాగాంధీ అన్న మాటలను గుర్తుచేశారు.

జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో తెలుగు యువత పతకాల పంట- విద్యార్థులపై ప్రశంసల వెల్లువ

మాతృభాషను మరిచిపోవడం క్షేమించరాని నేరమని జస్టిస్‌ యు దుర్గప్రసాదరావు అన్నారు. ప్రతి ఒక్కరు తెలుగు మాట్లాడాలి రాయాలి అని సూచించారు. తెలుగు గొప్పతనం ప్రపంచమంతటా తెలియాలని అన్నారు. రెండు అంతర్జాతీయ మహాసభల నిర్వహణ పట్ల కవులు, రచయితలు ఆనంద వ్యక్తం చేశారు. చివరిరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మూడో అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4,5 తేదీల్లో అమరావతిలో నిర్వహిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.