ETV Bharat / state

ఎర్రచందనం స్మగ్లర్​కు అసెంబ్లీ సీటు! - వైసీపీ సర్కార్ అండతో జోరుగా దందా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 6:16 PM IST

YSRCP Leaders Supporting Red Sandalwood Smugglers: ఎర్రచందనం దుంగలు శేషాచలం అడవుల్లో ఉంటాయి! మరి ఆ దుంగలు దొంగిలించే దొంగలు ఎక్కడుండాలి! అందులో ఆలోచించడానికేముంది? కటకటాల వెనుకే కదా! గత ప్రభుత్వంలో ఎర్రదొంగలు జైల్లోనే ఉండేవాళ్లు! వైసీపీ అధికారంలో కొచ్చాక వాళ్లకు మహర్దశ పట్టింది! జైలుయోగం పోయి రాజభోగం మొదలైంది. నాటి స్మగ్లర్లే ఇప్పుడు అధికార పార్టీకి చోదకశక్తులు! ఎంచక్కా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసుకుంటారు. వైసీపీకు కావాల్సిన వనరులు సమకూరుస్తారు! ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో అంగ, అర్థబలం అన్నీ తామై అధికార పార్టీకి అండదండగా నిలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో పెద్దరికం వెలగబెడుతున్న ఓ నాయకుడు వారికి అండదండలు అందిస్తున్నారు.

YSRCP_Leaders_Supporting_Red_Sandalwood_Smugglers
YSRCP_Leaders_Supporting_Red_Sandalwood_Smugglers

YSRCP Leaders Supporting Red Sandalwood Smugglers: ఎర్రచందనం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకే ప్రత్యేకమైన సహజ వనరు! ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి అదే చోదక శక్తిగా మారింది. ఆ రెండు జిల్లాల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లర్లే బలం, బలగం! ఎలాగంటారా? దుంగల దొంగలే వైసీపీకు ఆర్థిక ఆక్సిజన్ అందిస్తున్నారు. స్మగ్లింగ్‌ సొమ్మునే తమ రాజకీయ ఉన్నతికి పెట్టుబడిగా పెడుతున్నారు.

స్మగ్లర్లకు, వైసీపీకు మధ్య సంబంధాలు క్రమంగా ఎన్నికల అనుబంధంగా మారిపోతున్నాయి. దానికి నిదర్శనం విజయానందరెడ్డి! ఈయనో పేరుమోసిన స్మగ్లర్‌! ఒకప్పుడు సాధారణ కారు డ్రైవర్‌. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగి కోట్లకు పడగలెత్తారు! 2014లో అప్పటి ప్రభుత్వం పీడీ యాక్ట్‌ ప్రయోగించటంతో కొన్నాళ్లు జైల్లో గడిపారు! గత ఎన్నికల్లో కొందరు వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డే పెట్టుబడి పెట్టారనే ఆరోపణలున్నాయి!

వైసీపీ అధికారంలోకొచ్చాక విజయానందరెడ్డికి జగన్‌ ఏపీఎస్​ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు! 2024 అసెంబ్లీ ఎన్నికలకు చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అధికారం అండతో గత నాలుగున్నరేళ్లుగా విజయానందరెడ్డి తన అనుచరుల ద్వారా అడ్డూఅదుపులేకుండా స్మగ్లింగ్‌ నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం

కొల్లం గంగిరెడ్డి! అందరికీ అంతర్జాతీయ స్మగ్లర్‌గానే తెలుసు. కానీ రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైసీపీకు ఆయనే పెద్దదిక్కు. నియోజకవర్గంలో పార్టీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. 2014లో తెలుగుదేశం అధికారంలోకొచ్చక నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు పారిపోయాడు గంగిరెడ్డి. అంతర్జాతీయ స్మగ్లర్లతో ఉన్న సంబంధాలు అడ్డు పెట్టుకుని బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, కౌలలాంపూర్‌ వంటి దేశాల్లో దాదాపు 10 నెలలు తలదాచుకున్నాడు!

చంద్రబాబు హయాంలో ఏపీ పోలీసులు ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేయించారు. అలా శ్రీలంకకు మకాంమార్చుతూ మారిషస్‌ విమానాశ్రయంలో చిక్కిన గంగిరెడ్డిని ఏపీ పోలీసులు పట్టుకొచ్చి జైల్లో వేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక గంగిరెడ్డి దందాలకు అడ్డేలేదు! అధికారం చేతుల్లో ఉండటంతో నాలుగున్నరేళ్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా నడిపిస్తున్నాడు. ఇప్పటికే అనేక మంది ఎర్ర స్మగ్లర్లు వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా మారిపోయారు.

రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిషత్‌ అధ్యక్షుడు ముద్దా వెంకట సుబ్బారెడ్డి పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్‌. కొన్నికేసుల్లో అరెస్టై జైలుకూ వెళ్లొచ్చారు! కొల్లం గంగిరెడ్డికి సమీప బంధువు కూడా! మరో స్మగ్లర్ చీకంపల్లి నాగేశ్వరరెడ్డి వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మంగారిమఠం మండల పరిషత్‌ అధ్యక్షుడు వీరనారాయణరెడ్డికి సోదరుడు.

Red Sandal Smuggling: కొత్త తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్​..ఈసారి ఎలా అంటే..!

మరో స్మగ్లర్‌ గజ్జల శ్రీనివాసరెడ్డి పీలేరు నియోజకవర్గం కంభంవారిపల్లె మండల వైసీపీ జెడ్పీటీసీ శృతి భర్త! వైసీపీలో మండల స్థాయిలో కీలక నాయకుడిగా ఉన్నాడు! నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి స్మగ్లింగ్‌ను గత ప్రభుత్వం పీడీ యాక్ట్‌ పెట్టి కట్టడి చేయగా వైసీపీ ఏలుబడిలో అక్రమాలకు అండదండలు అందాయనే విమర్శలున్నాయి.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్లచిమ్మనపల్లె ఎంపీటీసీ అభినవ్‌. అంతకుమించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు! ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కర్ణాటకలోని కోలార్‌లో గతేడాది పోలీసులకు పట్టుబడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగిరివారిపల్లెకు చెందిన వైసీపీ నేత నాగభూషణం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ చిక్కారు. ఇలా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో గతంలో చిన్నాచితకా స్మగ్లర్లుగా ఉన్నవారు సైతం వైసీపీ ఏలుబడిలో బడా స్మగ్లర్లుగా మారారు.

స్మగ్లింగ్‌ ద్వారా సంపాదించిన డబ్బు పెట్టుబడిగా పెట్టి కొంతదరు స్థానికసంస్థలప్రజాప్రతినిధులుగా మారగా, మరికొందరు నామినేటేడ్‌ పదవులు దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పార్టీలో పెద్దమనిషి, ఆయన కుమారుడు, తిరుపతి పక్కనున్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వీళ్లను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్​: అక్రమ రవాణాకు అటవీ సిబ్బంది సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.