ETV Bharat / state

స్టేట్ పోలీస్‌ మీట్‌లో ప్రతిభ కనబర్చిన యువకెరటాలు

author img

By

Published : Jan 8, 2021, 6:44 AM IST

అవరోధాలను అవలీలగా దాటేసే మానవరహిత రోవర్.. మనిషి వెళ్లలేని ప్రదేశాలకు సైనికుడిలా వెళ్లి సేవలందించే రోబో.. విహంగవీక్షణంతో నేరస్తుల కదలికలను పసిగట్టే డ్రోన్లు.. ఇలా ఎటు చూసినా సాంకేతిక మాయాజాలమే. తయారు చేసినవి ప్రోటో టైపే కావచ్చు. కానీ ప్రోత్సాహమిస్తే.. రక్షకభటులకు మద్దతుగా నిలబడతామంటున్నారు ఆ యువకులు. స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ప్రతిభాపాటవాలను పోలీసుల ఎదుట ప్రదర్శించారు.

youth-talent-at-the-state-police-meet-in-thirupathi
స్టేట్ పోలీస్‌ మీట్‌లో ప్రతిభ కనపర్చిన యువకెరటాలు

అకస్మాత్తుగా ఉగ్రమూకలు దాడి చేయవచ్చు. బాంబు దాడుల బెదిరింపులు ఎదురవ్వొచ్చు. మనిషి ప్రాణాలను కాపాడే సమయంలో పోలీసుల ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మరో దారి లేక సమాజ శ్రేయస్సు కోసం రక్షకభటులు అమరవీరులుగా మారిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సరికొత్త పరిశోధనలు ఆవిష్కృతం అవుతున్నాయి. యువ మేధోశక్తికి నిలువుటద్దంలా... స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌లో ఆకర్షించిన సాంకేతిక పరికరాలే ఇందుకు నిదర్శనం.

తక్కువ సమయంలో శత్రువుల కదిలికలను పసిగట్టి వారిపై ప్రతిదాడులకు దిగటానికి అత్యాధునిక సాంకేతికత అవసరం. ఆ స్థాయి పరిజ్ఞానం మనదేశంలో అందుబాటులో లేక... ఆయుధసంపత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ సరికొత్త ఆలోచనలతో కొందరు యువకులు తమ మేథస్సుతో ఆకట్టుకున్నారు. శ్రీసిటీలోని ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న మృణాల్ రాజ్... మానవరహిత రోవర్ ప్రోటో టైప్‌ను తయారు చేశారు. దీనికి ఓ రోబ్ హ్యాండ్ ను అమర్చి బాంబును నిర్వీర్యం చేసే సాంకేతికతను ఇనుమడింపచేయవచ్చు అంటున్నారు.

నర్సులా.. రోగులకు సేవలందించే రోబోను రూపొందించాడు చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన పవన్. మహిళలకు ఆపద ఎదురైనప్పడు ఒక బటన్ నొక్కిన వెంటనే ఐదుగురికి ఫోన్ కాల్ వెళ్లటంతో పాటు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లకు సమాచారం అందించేలా ఓ చిన్నపాటి పరికరాన్ని రూపొందించారు. ఏడోతరగతితోనే చదువు ఆపేసిన ఈ యువకుడు ఇప్పటివరకూ 30కి పైగా ఆవిష్కరణలను రూపొందించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలను అందుకున్నారు.

శత్రువుల కదిలికలను పసిగట్టగలిగేలా అతితక్కువ వ్యయంతో డ్రోన్లను రూపొందించాడు తిరుపతికి చెందిన వెంకట కామేష్.. ఇప్పటికే ఈ అంశంపై కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణా కళాశాలలో తర్ఫీదునిస్తున్నాడు.

యువ పరిశోధకుల ఆవిష్కరణలను నేరుగా పరిశీలించిన డీజీపీ గౌతం సవాంగ్.... వారి ప్రతిభను ప్రశంసించటంతో పాటు ఆ సాంకేతికతను.. పోలీసు వ్యవస్థకు ఉపయుక్తమయ్యేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు.

ఇదీచదవండి.

తిరుమలలో చోరీ... నగదు, చరవాణులు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.