ETV Bharat / state

RRR Movie: థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్ సందడి.. అభిమానుల హంగామా

author img

By

Published : Mar 25, 2022, 6:20 AM IST

Updated : Mar 25, 2022, 1:22 PM IST

RRR fans noise
RRR fans noise

RRR Movie: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం ఆర్​ఆర్​ఆర్... థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వడంతో.. అభిమానులతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల టిక్కెట్ల కోసం అభిమానులు ఆందోళనకు దిగారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్ చిత్రం గురించే చర్చ నడుస్తోంది. తెల్లవారక ముందు నుంచే థియేటర్ల వద్ద జనం సందడి నెలకొంది. బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో అన్నిచోట్లా బొమ్మపడిపోయింది. ఓవర్సీస్ హిట్ టాక్‌తో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. పూలదండలు, హారతులతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.

థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్ సందడి

థియేటర్ల యాజమాన్యం పకడ్బందీ చర్యలు : కర్నూలు జిల్లాలో అభిమానులతో ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మెగా, నందమూరి అభిమానులు తరలిరావడంతో ముందు జాగ్రత్త చర్యగా థియేటర్ల యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టింది. తెర ముందు ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోనూ థియేటర్ ప్రహరీ గోడలు, గేట్లకు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.

పోలీసు స్టేషన్‌లో అభిమానుల ఫిర్యాదు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో థియేటర్ వద్ద అభిమనులు ఆందోళనకు దిగారు. బెనిఫిట్‌ షో టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టలేదంటూ అద్దాలు, తలుపులు పగులగొట్టారు. అధిక ధరకు టిక్కెట్లు విక్రయిస్తున్నారంటూ కర్నూలు జిల్లా కోడుమూరు పోలీసు స్టేషన్‌లో అభిమానులు ఫిర్యాదు చేశారు.

అభిమానుల హంగామా: శ్రీకాకుళం జిల్లాలో ఆర్​ఆర్​ఆర్​ సినిమా సందడి చేస్తోంది. దాదాపు జిల్లాలోని అన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. బెనిఫిట్‌ షో నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు మెుదలైయ్యాయి. హీరోలకు భారీ కటౌట్‌లు, పోస్టర్లు ఏర్పాటు చేయడంతో థియేటర్లు మెుత్తం నిండిపోయాయి. మల్టీస్టారర్‌ కావడంతో... ఇద్దరు కథనాయుకులను సమానంగా చూపించారని అభిమానులు అంటున్నారు.

రామ్​చరణ్​, జూ.ఎన్టీఆర్​ నటకు అభిమానులు ఫిదా: నటన విశాఖలో ఆర్​ఆర్​ఆర్ బెనిఫిట్ షోతో సందడి మొదలైంది. ఆర్​ఆర్​ఆర్​ థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. రామ్​చరణ్​, జూ.ఎన్టీఆర్​ నటన అద్భుతంగా ఉందని టాక్ వినిపిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి కధ నేపథ్యంలో సాగిన దృశ్యాలు బాగున్నాయంటున్నారు. ఒక్క విశాఖ లో 16 థియేటర్​లలో ఆర్​ఆర్​ఆర్​ చిత్రం ప్రదర్శితమవుతోంది.

పండగే పండగ: విజయవాడ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సందడితో పండగ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. డీజేలు పెట్టి పెద్ద ఎత్తున డాన్సులు వేస్తూ.. తమ అభిమాన నటులపైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా సూపర్ హిట్ కావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఆటంకం: విజయవాడలోని అన్నపూర్ణ థియోటర్ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షోలో ఆటంకం కలిగింది. షో ప్రారంభమైన గంటలో స్క్రీన్ నిలిచిపోయింది.
దీనితో ఆగ్రహంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు థియేటర్​లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్​ఆర్​ఆర్ సినిమా కడపలో సందడి చేస్తోంది. కడప నగరంలోని ఏడు థియేటర్లలో సినిమా ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైంది. సినిమా విజయవంతం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం అంతా ఇంతా కాదు. కడప సాయి బాబా థియేటర్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇంటర్వెల్​కు ముందు సింహాలతో ఎన్టీఆర్ ఫైట్ మంత్రముగ్ధులను చేసిందని అభిమానులంటున్నారు. ఇద్దరు హీరోలను సరిసమానంగా చూపించారంటున్నారు. రాజమౌళి మరోసారి సూపర్​ హిట్​ సినిమా తీశారంటున్నారు.

తిరుపతిలో ఆర్​ఆర్​ఆర్: ​ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మెుదలైంది. హీరోలకు పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లును అభిమానులు ఏర్పాటు చేశారు. హీరోల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ... టెంకాయలను కొట్టారు. నాలుగు సంవత్సరాల తరువాత తమ కథనాయకుల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. థియేటర్ల ముందు డప్పులు కొట్టి డ్యాన్స్‌లు చేస్తున్నారు. బెనిఫిట్‌ షోతోనే థియేటర్లు అన్ని కోలహాలంగా మారాయి. ఈ సినిమా ఎవరి ఊహకు అందదని... ఎన్నో రికార్డులను సృష్టిస్తోందని అభిమానులు అంటున్నారు.

గుంటూరులో హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు: గుంటూరులోని థియేటర్ల వద్ద ఆర్ఆర్‌ఆర్‌ సినిమా కోలాహలం నెలకొంది. తెల్లవారుజాము నుంచే సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. థియేటర్ల వద్ద ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కటౌట్లకు పాలాభిషేకం చేసి... హారతులు ఇచ్చారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అభిమానం చాటుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా కావడం... ఇద్దరు అగ్రకథానాయకులు ప్రధాన పోషిస్తుండటంతో.... అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సినిమా అంచనాలకు మించి ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా ఫ్లెక్సీల ముందు కొబ్బరికాయలు కొట్టి.... ఆనందం వ్యక్తంచేశారు.

సినిమా విడుదల సందర్భంగా భారీ కేక్​ కట్​ చేసిన ఎమ్మెల్యే: కృష్ణాజిల్లా నందిగామ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు నటించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కేక్​ను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కట్​ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం అభిమానులతో కలిసి కొద్దిసేపు సినిమా చూశారు. సినిమా భారీ హిట్ కావటం పట్ల సినీ హీరోలకు, నటులకు, అభిమానులకు సౌమ్య అభినందనలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం రికార్డులు బద్దలుకొడుతుందని తెలిపారు.

ఎన్టీఆర్ జెండాలతో బైకు ర్యాలీ: కృష్ణాజిల్లా కైకలూరులో తెలుగు సినిమా అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్​ఆర్​ఆర్​​​ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది. పలు థియేటర్ల దగ్గర డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. పోలీసులు థియేటర్ల వద్దకు చేరుకొని ట్రాఫిక్​కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. తీన్మార్ డప్పు వాయిద్యాలతో ఎన్టీఆర్ రామ్ చరణ్ చిత్రపటాలకు అభిమానులు పాలాభిషేకం నిర్వహించి... చిత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో కైకలూరు కోలాహలంగా మారింది. నియోజకవర్గ ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు వీరాబత్తిన సుధ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఉన్న భారీ జెండాలతో... నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

అనంతపురంలో ఆర్​ఆర్​ఆర్​ హంగామా: అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షో లు మొదలైపోయాయి. థియేటర్ల దగ్గర ప్రముఖ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే మార్నింగ్ షోలకు వెళ్లే అభిమానులు కూడా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. రాత్రి నుంచి అభిమాన హీరోలకు పాలాభిషేకాలు భారీ గజమాలతో అలంకరించారు. అనంతపురం కేంద్రంలోని థియేటర్లో ఉదయం ఐదు గంటలకే బెనిఫిట్స్ షోలను ప్రదర్శించారు. ఇప్పటికే సినిమా భారీ అంచనాలతో విడుదలైన ఆర్ఆర్​ఆర్​ సినిమా భారీ విజయాన్ని అందుకుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఇదీ చదవండి:

'ఆర్​ఆర్​ఆర్'.. ఈ నాలుగు పాత్రలు చాలా కీలకం​!

Last Updated :Mar 25, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.