ETV Bharat / state

అధికారుల నిర్ణయంతో.. పాతకాల్వ వాసులకు తప్పని ఇబ్బందులు

author img

By

Published : Nov 27, 2021, 8:16 AM IST

తాగడానికి నీరు లేక పాతకాల్వ ప్రజల అవస్థలు
తాగడానికి నీరు లేక పాతకాల్వ ప్రజల అవస్థలు

ఆ ఊరంతా నీటి ప్రవాహమే.! బయటకు వెళ్లాలంటే ఆచితూచి అడుగేయాలి.! అదుపుతప్పితే మళ్లీ నిలబడటంఅనుమానమే ! తిరుపతి శివారులోని పేరూరు చెరువు ప్రవాహ మళ్లింపు తెచ్చి పెట్టిన కష్టాలివి.! వారానికిపైగా వానలతో అల్లాడిన స్థానికులు.. ఇప్పుడు చెరువుకు గండికొట్టడంతో తలెత్తిన ముంపుతో ఇబ్బందులు పడుతున్నారు.

తాగడానికి నీరు లేక పాతకాల్వ ప్రజల అవస్థలు

తిరుపతి నగరాన్ని వరదనీటితో ముంచెత్తిన పేరూరు చెరువు నీటి మళ్లింపు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కొందరి నేతల స్వప్రయోజనాలతో పాటు నాలాలను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టిన వారిని కాపాడేందుకు అధికారులు తమ గ్రామం వైపు నీటిని మళ్లించి తమను ముంపునకు గురి చేశారని పాతకాల్వ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా వ్యతిరేకించినా.. నిరసనలకు దిగినా పోలీసు సాయంతో వరద నీరు తమ గ్రామంపైకి మళ్లించిన అధికారులు..గ్రామం ముంపునకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పేరూరు చెరువు నీటిని విడుదల చేయడంతో గ్రామంలోకి వెళ్లే రహదారి కోతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణముఖి నది నుంచి వరద కాల్వ ద్వారా వచ్చిన నీటితో పేరూరు చెరువు నిండిపోయింది. వరద నీరు అధికంగా వస్తుండటంతో ఎన్టీఆర్‌ కాలనీ వైపున ఉన్న పేరూరు చెరువు తూములను ఎత్తి నీటిని కిందకు వదిలేశారు అధికారులు. వరదనీరు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మీదుగా తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. వరదనీటితో తిరుపతి నగరవాసులు ఇబ్బందులు పడుతుండటంతో.. అధికారులు పేరూరు బండ సమీపంలో జాతీయ రహదారి పక్కన చెరువు కట్ట మట్టి తొలగించి వంతెన ద్వారా నీటిని పాతకాల్వవైపు విడుదల చేశారు. నీటిని మళ్లించేందుకు పేరూరు బండ సమీపంలో రహదారిని తొలగించిన అధికారులు.. పాతకాల్వ గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్​ను సైతం తొలగించారు. నాలుగు రోజులు గడుస్తున్నా పైపులైను పునరుద్దరించకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాతకాల్వ వాసులు వాపోతున్నారు. తమ ఆస్తులు కాపాడుకోవటానికి కొందరు నేతలు తమ గ్రామంలోకి నీటిని విడుదల చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో పేరూరు చెరువుపై వరదనీటి నుంచి ఒత్తిడి తగ్గించడానికే పాతకాల్వవైపు మళ్లించామని.. ప్రమాదకర స్థాయికి చేరి ప్రవహిస్తున్న చెరువుల్లో పేరూరు చెరువు ఉండటంతో చెరువు కట్ట ప్రమాదబారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు.

ఇన్ని రోజులు వర్షాలు, వరదలతో ఇబ్బంది పడ్డ తమను ఆదుకోవాల్సిన అధికారులు.. చెరువుకు గండి కొట్టి తమను మరింత ఇబ్బందుల పాలు చేశారని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

అప్పుల బాధ తాళలేక ఎలుకల మందు తిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.