ETV Bharat / state

హెపటైటిస్ నిర్మూలనకు మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌కేంద్రం.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Jan 8, 2021, 4:26 PM IST

అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమైన హెపటైటిస్‌ వైరస్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా హరియాణ రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమం విజయవంతం అవడంతో...దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చికిత్స కేంద్రాలను ప్రారంభించింది. రాష్ట్ర జనాభాలో రెండు శాతం ప్రజలు హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌ బారిన పడుతున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల పరిధిలోని రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ కేంద్రం ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో వైరస్‌ హెపటైటిస్‌కు అందుతున్న ఆధునిక వైద్యసేవలపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

modern Treatment center for hepatitis Tirupathi Chittoor District
హెపటైటిస్ నిర్ములనకు మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌ కేంద్రం

కాలేయ కాన్సర్‌ వంటి ప్రమాదమైన వ్యాధి రావడానికి కారణమైన హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2030 నాటికి కాలేయ వ్యాధులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో... జాతీయ స్థాయిలో హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందుకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. హెపటైటిస్‌ వైరస్‌ సోకిన వారిని గుర్తించి వారికి చికిత్స అందించడంతో పాటు... ఇతరులకు వ్యాప్తి చెందకుండా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రుల్లో... మోడల్‌ ట్రిట్‌మెంట్ ‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మోడల్‌ ట్రీట్మెంట్‌ కేంద్రంలో సేవలు ప్రారంభంమయ్యాయి. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా ఈ కేంద్రం ద్వారా సేవలు అందించనున్నారు. మంగళ, గురు వారాల్లో హెపటైటిస్‌ వైరస్‌ ప్రభావిత రోగులకు ఓపి నిర్వహిస్తున్నారు.

  • హెపటైటిస్‌ అంటే ఏమిటి?

హెపటైటిస్‌-బి అనేది వైరస్. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయానికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. మన రాష్ట్రంలో 2 శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఇది ముదిరితే లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ప్రతి ఏడాది స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వంటి వైరస్​లు సోకి అనారోగ్యం చెందే వారు అధిక సంఖ్యలో ఉంటారు. వీటితో పాటు హెపటైటిస్‌ బీ, సీ వైరస్ రోగులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. ప్రమాదకరమైన ఈ వ్యాధిని నిర్మూలించడానికి... కేంద్రం మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌ సెంటర్​ను ఏర్పాటు చేసింది. హెపటైటిస్‌ వైరస్‌ సోకేందుకు అవకాశం ఉన్న వారిని పరీక్షించడంతో పాటు పాజిటివ్‌ వచ్చిన రోగులకు నయం చేసే లక్ష్యంతో కార్యక్రమం అమలవుతోంది. -డాక్టర్‌ భారతి, రుయా ఆసుపత్రి సూపరెండెంటెంట్‌, తిరుపతి.

నేషనల్‌ వైరల్‌ హెపటైటిస్‌ కార్యక్రమం కింద రోగులకు ఖరీదైన ఔషధాలు, వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా లభించనున్నాయి. ఈ హెపటైటిస్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు విస్తృత స్థాయిలో కాలేయ పరీక్షలను చేయనున్నారు. హెపటైటిస్‌ వైరస్‌ సోకిన రోగులను ప్రారంభ దశలో గుర్తించకపోవడం ద్వారా పరిస్థితి విషమించే ప్రాణాలకే ప్రమాదం ఉంది.

- వాసుదేవనాయుడు, వైరాలజీ ప్రొఫెసర్‌, ఎస్వీ మెడికల్‌ కళాశాల.

రాష్ట్రంలో ఏర్పాటైన మూడు మోడల్ చికిత్స‌ కేంద్రాల్లో తిరుపతి ఒకటి. ఈ సెంటర్​లో వైరస్ సోకిన వారికి చికిత్స అందిచనున్నాం. హెపటైటిస్‌ బీ, సీ వ్యాధికి ప్రైవేటుగా చికిత్స చేయించుకోవాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స అందించనున్నాం. కేవలం పరీక్షలకు మాత్రం రూ.5000 ఖర్చు అవుతుంది. ఇది తక్కువ శాతం మందిలో ఉన్నప్పటికీ... చాలా ప్రమాదకరమైన వైరస్. అందుకే ఈ వ్యాధిని నిర్ములించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

- రఘురామనాయక్‌, మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌.

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. హెపటైటిస్ వైరస్‌ తో బాధపడే వారి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఈ వ్యాధి అంతరించి పోయే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.