ETV Bharat / state

ఇగ్లూ థియేటర్‌.. ఇందులో సినిమా చూశారంటే థ్రిల్ అవ్వాల్సిందే!

author img

By

Published : Dec 3, 2022, 12:29 PM IST

Igloo Theater: వినోద రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంలు రావటంతో.. సినిమా థియేటర్ల కోసం భారీ పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా అది నగరాలకే పరిమితమవుతోంది. ఇక గ్రామీణ ప్రాంతవాసులు థియేటర్‌లో సినిమా చూడాలంటే నగరాలకు వెళ్లక తప్పని పరిస్థితి. వినోదాన్ని ముంగిట్లోకి తెచ్చేందుకుగానూ తొలి ఇగ్లూ థియేటర్‌ ఉత్తర తెలంగాణాలో రూపుదిద్దుకుంది. మంచు ప్రాంతాల్లో నిర్మించే ఎస్కిమో తరహా ఇగ్లూను తలపిస్తున్న ఈ థియేటర్‌ సరికొత్త అనుభూతిని పంచుతోంది.

Igloo Theater
ఇగ్లూ థియేటర్‌

Igloo Theater: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్మించిన ఇగ్లూ సినిమా థియేటర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది. మంచు ప్రాంతాల్లో ఎస్కిమోలు నిర్మించుకొనే ఇళ్ల తరహాలో కేవలం అర ఎకరంలో ఈ బుల్లితెర థియేటర్‌ను నిర్మించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు సినిమా చూడాలంటే 40కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌ లేదా జగిత్యాలకు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఓ భారీ థియేటర్ నిర్మించేందుకు కొందరు ప్రయత్నాలు చేసినా.. ఆ స్థాయిలో ప్రేక్షకులు వస్తారా అన్న సందేహంతో వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలోనే తక్కువ సీట్ల సామర్ద్యంతో ఇగ్లూ థియేటర్ నిర్మించారు. 100 సీట్ల సామర్ధ్యం.. 42అడుగుల వృత్తం విస్తీర్ణంలో రోజుకు 5షోలు ప్రదర్శించే విధంగా ఈ ఇగ్లూ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇగ్లూ థియేటర్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. దక్షిణాదిలో ఇలాంటి థియేటర్లు ఉన్నా.. రాష్ట్రంలో ఖమ్మం ప్రాంతంలో మాత్రం ఇలాంటి తరహాలో థియేటర్‌ కొనసాగుతోంది.

ఈ ప్రయత్నం సరికొత్తగా ఉంది: రాజారాంపల్లిలో ఏర్పాటైన ఈ థియేటర్‌.. ధర్మపురి, ధర్మారం, వెల్గటూరు మండలాల ప్రజలకు వినోదాన్ని పంచనుంది. గ్రామీణ ప్రజల కోసం చేసిన ఈ ప్రయత్నం సరికొత్తగా ఉందని మంత్రి కొప్పుల కితాబిచ్చారు. ముంబయిలోని ఛోటు మహారాజ్‌ ఫ్రాంచైస్ ఒప్పందం మేరకు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. నలుగురు భాగస్వాములు.. ప్రజలను ఆకర్షించే విధంగా నిర్మించిన ఈ థియేటర్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు తరలివస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు సినిమా వినోదం: ఛోటు మహారాజన్‌ హాల్స్‌గా పిలిచే ఇగ్లూ థియేటర్లు.. మహారాష్ట్రలోని అకోలా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌, ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాయి. ఫైబర్‌ వుడ్‌లాంటి సామగ్రితో స్వల్పకాలిక వ్యవధిలోనే ఈ ఇగ్లూ థియేటర్‌ నిర్మించారు. ఇగ్లూ థియేటర్‌లో సినిమా చూస్తుంటే మల్టీప్లెక్స్‌లో చూసిన అనుభూతి కలుగుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు. పెట్టుబడులు తగ్గించుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న థియేటర్లు అందుబాటులోకి వస్తే సినిమా వినోదం మారుమూలకు అందుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

"గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇగ్లూ థియేటర్​ను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇది ఒక కొత్త అంశం. సాధారణంగా జిల్లా కేంద్రాల్లో థియేటర్​లు ఉండటం చూశాం. ఇక్కడి ప్రజలకు మంచి వినోదాన్ని ఇస్తుంది. పిల్లలతో కలిసిరావడానికి ఇక్కడ మంచి వసతులు ఏర్పాటు చేశారు." - కొప్పుల ఈశ్వర్‌, సంక్షేమశాఖ మంత్రి

ఇగ్లూ థియేటర్‌లో సినిమా చూశారంటే థ్రిల్ అవ్వాల్సిందే!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.