ETV Bharat / state

అకాల వర్షాలతో అన్నదాతకు కన్నీళ్లు.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Mar 21, 2023, 10:54 PM IST

Unseasonal rains
వర్షంతో రైతులు తీవ్రంగా నష్టం

Unseasonal rains: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్నా పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్షేతస్థాయి పరిస్థితులపై అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Unseasonal rains in AP: అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. కోతకొచ్చిన వరిపంట పూర్తిగా నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. అరటి చెట్లు పడిపోయాయి. మిర్చి పంట పూర్తిగా తడిచి దెబ్బతింది. నీట మునగడంతో వేరుశనగ పంట దెబ్బతింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతిన్నా పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరో రెండు రోజుల్లో కోతకోసి... దాన్యాన్ని ఇంటికి చేర్చాల్సిన రైతన్న.. అకాల వర్షంతో నేలకొరిగిన వరిపంటను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తూర్పు ప్రాంతమైన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పంటలు నీటమునిగాయి. రెండు నియోజకవర్గాల్లో దాదాపు మూడు వేల ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు దెబ్బతినగా ఉద్యానవన పంటలకు భారీనష్టం వాటిల్లింది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వరిపంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకొచ్చిన పంట వర్షం ధాటికి పడిపోవడంతో దాన్యం మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. మరో కోత కోయడానికి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో అత్యధికంగా సత్యవేడులో 37.6మి.మీ, వరదయ్యపాళెంలో 30.2మి.మీ. తొట్టంబేడులో 30మి.మీ., శ్రీకాళహస్తిలో 28.4మి.మీ. పిచ్చాటూరులో 26మి.మీ, పెళ్లకూరులో 21.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, బీఎన్ కండ్రిగ, నాగలాపురం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులు

"రెండు రోజుల క్రితం వచ్చిన వర్షాలకు మా పంట పూర్తిగా నష్టపోయాం.. పంట నష్టం అంచనా వేయడానికి వ్యవసాయాధికారులు రావడం లేదు. మా సమస్యలు వినడానికి కూడా అధికారు సిద్ధంగా లేరు. ఈ వర్షాల వల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వర్షాల వల్ల వేరు శనగ మద్దతు ధర 2వేలు అడుగుతున్నారు. అకాల వర్షాల వల్ల వేరు శనగకు చాలా నష్టం అయింది. వరి సైతం పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాం". -ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు

చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి పంట పూతదశలో ఉన్న సమయంలో వర్షాలు పడటంతో పూతతో పాటు, పిందెలు రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఆకు, కాయ కూరలకు అధిక ధర లభిస్తుందన్న ఆశతో సాగు చేశామని.. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం క్షేతస్థాయి పరిస్థితులపై అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.