ETV Bharat / state

AP New Districts : జిల్లాల విభజనపై అసంతృప్తి... సుదీర్ఘకాల డిమాండ్లను పట్టించుకోలేదని వాదన

author img

By

Published : Jan 27, 2022, 3:23 AM IST

AP New Districts: కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

AP New Districts
AP New Districts

AP New Districts: కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను... మరో జిల్లా పరిధిలోకి తీసుకురావడంపై కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది.

నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాలవారు వ్యతిరేకిస్తున్నారు.పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలు నగరానికి దగ్గర్లో.. పాణ్యం, గడివేముల నంద్యాలకు సమీపంలో ఉంటాయి. జిల్లా విభజన జరిగితే కల్లూరు, ఓర్వకల్లు మండలాల్ని కర్నూలు జిల్లాలో కలపాలని కల్లూరు పరిరక్షణ సమితి ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వారి ఆకాంక్ష నెరవేరినట్టయింది. కానీ పాణ్యం, గడివేముల మండలాల వారికి ఇబ్బందిగా మారింది. నంద్యాలకు 5-15 కి.మీ. దూరంలో ఉన్న తమను కర్నూలు జిల్లాలో కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు.

రాజంపేట విషయంలో వైకాపా నేత మండిపాటు

రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలంటూ భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌) ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి నుంచి, బీటీ కళాశాల వరకు మంగళవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. మదనపల్లె జిల్లాసాధన ఐకాస ఆధ్వర్యంలో బిందెల గౌతమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై రాజంపేట మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మర్రి రవి సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైకాపా ఓడిపోతుందన్నారు. కావాలంటే రాయచోటిని, మదనపల్లెని కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తమను ఉంచితే కడప జిల్లాలో ఉంచాలని, లేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ రాజంపేట మండలం కొత్తబోయినపల్లెలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద తెదేపా నేతలు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేశారు.

కందుకూరు వాసుల ఆగ్రహం

ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడం, కందుకూరు శాసనసభ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంపై ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కందుకూరు ఒంగోలుకి 44 కి.మీ. దూరంలో ఉంది. నెల్లూరు వెళ్లాలంటే 111 కి.మీ. దూరం ప్రయాణించాలి.

  • మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
  • కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మార్కాపురం డివిజన్‌గా ఉండగా, అదే అసెంబ్లీ స్థానం పరిధిలో పొదిలి కేంద్రంగా రెండో డివిజన్‌ ఏర్పాటు చేయడానికి బదులు, కనిగిరి కేంద్రంగా ఏర్పాటు చేయాలని తెదేపా నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.
  • బాపట్ల జిల్లాలో... బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 17 కిలోమీటర్లే. వాటి పరిధిలోని మండలాలకు, జిల్లా కేంద్రాలకు మధ్య చాలా దూరం ఉందని స్థానికులు అంటున్నారు.

పెదకూరపాడులోనూ..

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని.. లేకపోతే పెదకూరపాడును గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విజయవాడ దగ్గర్లోనివి మచిలీపట్నం జిల్లాలోకా?

విజయవాడకు దగ్గర్లోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో చేర్చడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటినీ ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

అశాస్త్రీయ విభజన

శ్రీకాకుళం జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, సనపల నర్సింహులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు.

  • చీపురుపల్లి రెవెన్యూడివిజన్‌ ఏర్పాటుచేయాలని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు.
  • అరకు లోక్‌సభ స్థానం చాలా పెద్దదైనందున మూడు జిల్లాలుగా చేయాలని ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర డిమాండ్‌ చేశారు. విలీన మండలాల్ని కలిపి, తూర్పుగోదావరి ఏజెన్సీని రంపచోడవరం జిల్లాగా, విశాఖ ఏజెన్సీని పాడేరు జిల్లాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్ని కలిపి మరో జిల్లాగా చేయాలని కోరారు.

ఇదీ చదవండి

AP New Districts: జిల్లా కేంద్రంగా రాయచోటి.. రాజంపేట వైకాపా నేతల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.