కుప్పంలో వైకాపా విధ్వంసం, శాంతియుత నిరసన పేరుతో బల ప్రదర్శన

author img

By

Published : Aug 25, 2022, 8:41 PM IST

Updated : Aug 26, 2022, 6:55 AM IST

kuppam
kuppam ()

Kuppam incident వైకాపా, తెదేపా ర్యాలీలు, తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీతో కుప్పం పట్టణం రణరంగమైంది. ఓ వైపు చంద్రబాబు పర్యటన సాగుతుండగానే వైకాపా చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతించారు. ర్యాలీ సందర్భంగా వైకాపా శ్రేణులు సృష్టించిన విధ్వంసం కుప్పం పట్టణం అట్టుడికేలా చేసింది. తెలుగుదేశం బ్యానర్లు, జెండాలు ధ్వంసం, అన్న క్యాంటీన్‌ విధ్వంసం వంటి వరుస ఘటనలతో ప్రశాంతతకు నిలయమైన కుప్పం అతలాకుతలమైంది.

కుప్పంలో వైకాపా కార్యకర్తల వీరంగం

TENSION AT KUPPAM : ప్రశాంతతకు నిలయమైన కుప్పం పట్టణం గురువారం రణరంగాన్ని తలపించింది. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజున వైకాపా కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతియుత నిరసనల పేరిట అనుమతి తీసుకున్న అధికార పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంతోపాటు గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్‌ రవిచంద్రపై దాడి చేశారు.

అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్దకు వెళ్లడానికి తెదేపా కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో చంద్రబాబు పీఏ మనోహర్‌, తెదేపా కార్యకర్త రాజుతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. దీనిని నిరసిస్తూ చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి అన్న క్యాంటీన్‌ వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వచ్చారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు.

.
.

వైకాపా దౌర్జన్యం, పోలీసుల వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. వైకాపా కార్యకర్తల దౌర్జన్యంపై తెదేపా శ్రేణులు స్పందించడంతో పట్టణంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కుప్పంలో దుకాణాలు, విద్యాసంస్థలు, బస్సుల రాకపోకలు ముందుగానే నిలిపేశారు. చంద్రబాబు పర్యటనలో వైకాపా శ్రేణుల ఆగడాలు, పోలీసుల ప్రేక్షకపాత్రపై తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి.

.
.

గురువారం ఉదయం 10.30కు చంద్రబాబు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి వాహనంలో బయలుదేరి 10.45 గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించాల్సి ఉంది. చంద్రబాబు పర్యటన తొలిరోజే బుధవారం రామకుప్పం మండలం కొంగనపల్లి, కొల్లుపల్లిలో వైకాపా కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టి రెచ్చగొట్టడంతో రాళ్ల దాడి జరిగింది. తమ పార్టీ కార్యకర్తలపై తెదేపా శ్రేణులు దాడి చేశాయని.. గురువారం కుప్పం పట్టణంలో శాంతియుత నిరసన చేస్తామని కుప్పం వైకాపా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్‌ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్యాలెస్‌ రోడ్డులోని భరత్‌ ఇంటికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుతో పాటు వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి ఉదయం 10.45 గంటలకు బస్టాండ్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం ఎదుట బైఠాయించారు. చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్యాలెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి, కాళ్లతో తొక్కారు. అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా బ్యానర్లను చించేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొందరు కార్యకర్తలు వి.కోట సీఐ ప్రసాద్‌బాబును నెట్టారు.

గురువారం అన్నదానం చేస్తున్న దాత, తెదేపా నాయకుడు రవిచంద్రబాబుపై తొమ్మిది మంది దాడి చేశారు. ఎమ్మార్‌రెడ్డి కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమారు గంటసేపు వైకాపా శ్రేణులు అన్న క్యాంటీన్‌ వద్దే అరుపులు, ఈలలతో నానా హంగామా సృష్టించినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. అధికార పార్టీ శ్రేణుల ఆగడాలను పోలీసు సిబ్బంది డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరిస్తుండగా పుంగనూరు ప్రాంతానికి చెందిన ఓ సీఐ వారిని వారించడంతో కెమెరాను తీసేశారు.

.
.

తెదేపా శ్రేణులతో కలిసి చంద్రబాబు బైఠాయింపు
కుప్పం పట్టణంలో వైకాపా నాయకులు, కార్యకర్తల దాష్టీకాలు, తెదేపా శ్రేణులపై దాడులు.. పోలీసుల చోద్యం చూడటాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బాబునగర్‌, పాతపేట, నేతాజీ రోడ్డు మీదుగా కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వచ్చారు. ఆయనతో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో బస్టాండ్‌ ప్రాంగణం నిండిపోయింది. ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వైపుగా తెదేపా శ్రేణులు దూసుకెళ్లే ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు తెదేపా కార్యకర్తలపై లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో లక్ష్మీపురానికి చెందిన రాజుకు గాయపడ్డారు. చంద్రబాబు అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా బ్యానర్లను చించి ధ్వంసం చేసిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ శ్రేణులతో పాటు బైఠాయించారు.

పోలీసుల తీరుపై విమర్శలు
వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద, పార్టీ శ్రేణులు ర్యాలీగా వస్తున్న సమయంలో పోలీసులు వారికి భారీగా భద్రత కల్పించారు. అన్న క్యాంటీన్‌, ప్యాలెస్‌ రోడ్డు మార్గంలో తెదేపా ఫ్లెక్సీలను చించేస్తున్నా పట్టించుకోలేదు. తెదేపా కార్యకర్తలు, నాయకులపై.. వైకాపా శ్రేణులు దాడికి దిగినా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సమయంలో ఈ విధంగా వ్యవహరిస్తారా? అంటూ స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

Last Updated :Aug 26, 2022, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.