ETV Bharat / state

వైకాపా ప్లీనరీలో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : చంద్రబాబు

author img

By

Published : Jul 8, 2022, 6:44 PM IST

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన బాబు.. వైకాపా సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ప్రతివర్గాన్నీ అవస్థలకు గురిచేస్తున్న ప్రభుత్వంపై పోరాటానికి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనను దునుమాడిన అధినేత.. తాను సంధించిన ప్రశ్నలకు ప్లీనరీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

babu
babu

వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న బాబు.. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. "వైకాపా ప్రభుత్వం ప్రజలపై ఎంత పెనుభారం మోపుతుందో చెప్పేందుకు వచ్చా. వైకాపా పాలనలో ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? జగన్ పాలన మొత్తం అవినీతిమయమైంది. ఈ ప్రభుత్వం నవ రత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతోంది. ఏం సాధించారని వైకాపా ప్లీనరీ నిర్వహిస్తున్నారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. దేశమంతా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఇక్కడ తగ్గించలేదు. తమిళనాడుకు వెళ్లి బైకుల్లో పెట్రోల్‌ నింపుకునే పరిస్థితి వచ్చింది. మద్యం ధరలు విపరీతంగా పెంచారు. మద్యం ధరలు పెంచి.. జగన్‌ వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారు. అయినా.. నాణ్యమైన మద్యం దొరకట్లేదు. రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు. ఈ మద్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారింది.

ఇష్టారీతిన విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ఘనత జగన్‌దే. తెదేపా హయాంలో పవర్‌లూమ్స్‌కు విద్యుత్‌ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇచ్చాం. తెదేపా వచ్చిన వెంటనే పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తాం. చేనేత కార్మికులకు జగన్ ఇచ్చిన పింఛన్ల హామీ ఏమైంది? ఒంటరి మహిళలు, వితంతువుల పింఛన్లు రద్దు చేశారు. చేనేత కార్మికులకు తెదేపా పూర్తి అండగా ఉంటుంది. నానో టెక్నాలజీ తీసుకువచ్చి కాలుష్యం లేకుండా చూస్తాం. కాలుష్య రహిత 'నగరి' తయారు చేసే బాధ్యత తీసుకుంటా. తెదేపా అధికారంలోకి వచ్చాక నగరిలో జౌళిపార్కు ఏర్పాటు చేస్తాం.

అమరావతిని ఆపారు.. పోలవరాన్ని నాశనం చేశారు. గ్రామంలో డ్రైనేజీ కట్టలేని వ్యక్తి.. 3 రాజధానులు కడతారా? కాలువ తవ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతారా? పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం మేమే పూర్తి చేశాం. తెదేపా అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ నీళ్లు ఇచ్చే వాళ్లం. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడానికి జగన్ సమాధానం చెప్పాలి.

వైకాపా హయాంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. జగన్‌ ఒకే ఒక్క ఆర్డరుతో 10 వేల పాఠశాలలు రద్దు చేశారు. అమ్మఒడి పథకం పెద్దబూటకం.. నాన్న బుడ్డీ మాత్రం వాస్తవం. విద్యుత్‌ 300 యూనిట్లు వాడితే 'అమ్మఒడి' రద్దు చేస్తారు. పాఠశాలల్లో 75 శాతం హాజరు లేకపోయినా 'అమ్మఒడి' రద్దు చేస్తారు. సీఎం చేస్తున్న తప్పులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మను రాజీనామా చేయించారు. జగన్‌ జీవితకాల వైకాపా అధ్యక్షుడిగా ఉంటారు.. ఇది ప్రజాస్వామ్యమా? పెగాసెస్ ఉపయోగించానని నాపై కేసు పెడతారంట. నేను ప్రజలకు భయపడతాను తప్ప, కేసులకు కాదు." అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.