ETV Bharat / state

వారిని శిక్షించకపోతే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు: చంద్రబాబు

author img

By

Published : May 6, 2020, 7:39 PM IST

అధికార పార్టీ నాయకులు అదే పనిగా తెదేపా సానుభూతి పరులు, ఇతర వర్గాల ప్రజలపై దాడులు చేయడం పరిపాటి అయ్యిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహించారు. చిత్తూరు జిల్లాలో ఓ మహిళా రైతుకు చెందిన మామిడి చెట్లను వైకాపా నాయకులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు.

chandra
chandra

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్​కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నాయకులు అదేపనిగా తెదేపా సానుభూతి పరులు, ఇతర వర్గాల ప్రజలపై దాడులు చేయడం పరిపాటి అయ్యిందని ధ్వజమెత్తారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లి పంచాయతీ కొత్త నాగురుపల్లి గ్రామంలో ఢిల్లీ రాణి అనే మహిళా రైతుకు చెందిన 100 మామిడి చెట్లను నరికేయడం అందుకు ఒక ఉదాహరణ అని వివరించారు. ఆమెకు ప్రభుత్వమే సేద్యం చేసుకునేందుకు భూమి మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే రాణి తెదేపా సానుభూతిపరురాలు అనే అక్కసుతోనే కొందరు వైకాపా నాయకులు ఆమె భూమిలోకి అక్రమంగా చొరబడి, ఫెన్సింగ్ ధ్వంసం చేసి మామిడి చెట్లను నరికేశారని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకులకు సంబంధించి ఇటువంటి భయానక చర్యలు రాష్ట్రంలో మున్నెన్నడూ చూడలేదన్నారు. వీరిని శిక్షించకుండా ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై విచారణ జరిపి... కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీతో పాటు లేఖను చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపారు.

ఇదీ చదవండి:

'మద్యం అమ్మకాలకు నిబంధనల్లేవ్​.. పంటల అమ్మకానికి ఎందుకు..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.