ETV Bharat / state

గంజాయి అక్రమ రవాణా.. బాపట్ల, గుంటూరులో పట్టుబడ్డ ఆరుగురు

author img

By

Published : Mar 21, 2023, 4:21 PM IST

Updated : Mar 21, 2023, 7:09 PM IST

Police Arrested Ganjai Smuggling Gang
గంజాయి అక్రమ రవాణా

Police Arrested Ganjai Smuggling Gang: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లాలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముగ్గురిని చేశారు. అలాగే గుంటూరు జిల్లాలో ముగ్గురిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు.

Police Arrested Ganjai Smuggling Gang : విశాఖ నుంచి చెన్నైకు 140 కిలోల గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా వివరాలు తెలిపారు. రంపచోడవరానికి చెందిన వేమలపూడి గవాస్కర్‌.. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నాడు. గతంలో కూడా గంజాయి రవాణా చేస్తూ విశాఖ జిల్లా కృష్ణా దేవిపేట పోలీసులకు రెండుసార్లు పట్టుబడ్డాడు. రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై వచ్చిన అతడు గంజాయి వ్యాపారం చేస్తున్న బుజ్జితో చేతులు కలిపాడు.

140 కిలోల గంజాయి స్వాధీనం : కారు అద్దెకు తీసుకుని గంజాయిని చెన్నైకి చేర్చితే 1.20 లక్షల రూపాయలు చెల్లిస్తానని బుజ్జితో ఒప్పందం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజఒమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన లగిజే ఈశ్వర ప్రసాద్‌ ద్వారా కారు తీసుకుని కొయ్యూరు మండలం కర్రి దారబాబుతో కలిసి 140 కిలోల గంజాయిని విశాఖ స్టీల్‌ ప్లాంటు సమీపంలో ఈ నెల 18న తీసుకుని చెన్నై బయలుదేరారు. 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోల్‌కతా, చెన్నై జాతీయ రహదారిపై మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద సీఐ ఫిరోజ్‌, ఎస్​ఐ కమలాకర్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు కారును వెనక్కి తిప్పి పారిపోవటానికి ప్రయత్నం చేశారు.

సీఐ, ఎస్​ఐలు పోలీసు సిబ్బందితో కలిసి పట్టుకుని కారులో అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. దారబాబు, ఈశ్వర ప్రసాద్‌, గవాస్కర్​ను అరెస్టు చేశారు. మరో నిందితుడు అయిన బుజ్జిని అరెస్టు చేయాల్సి ఉంది. గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన మార్టూరు సీఐ, ఎస్​ఐ, పోలీసు సిబ్బందిని వకుల్‌ జిందాల్‌ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

గతేడాది 102 కేసులు.. 224 మంది అరెస్టు : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని గుంటూరు సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా సెబ్ అదనపు ఎస్పీ డీఎన్ మహేష్ తెలిపారు. మందపాటి వీరాంజనేయులు, బెజవాడ శ్రావణ్ కుమార్, సోమరౌతు సాయి ఆదిత్యను అరెస్టు చేశామన్నారు. విద్యార్థులు, యువత లక్ష్యంగా ఈ ముఠా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గత ఏడాది కాలంగా గంజాయి రవాణాకు సంబంధించి 102 కేసులు పెట్టి 224 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. 275 కేజిల పొడి గంజాయి, 2.174 లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి రవాణా కేసులో బైండోవర్లు చేసినా, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా కట్టడి కావటం లేదన్నారు. ప్రజలు కూడా గంజాయి రవాణాపై తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ఇవి చదవండి

Last Updated :Mar 21, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.