ETV Bharat / state

వచ్చే ఎన్నికలపై భాజపా ఫోకస్.. అధికారమే లక్ష్యంగా ప్లానింగ్

author img

By

Published : Nov 17, 2022, 9:49 AM IST

BJP Planning for TS Assembly Elections : ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో తదుపరి కార్యాచరణపై కమలదళం దృష్టిపెట్టింది. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉండడంతో పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తోంది. ముందస్తుకు వెళ్లినా సిద్ధంగా ఉన్నామని చెప్పిన భాజపా రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు తమకు మరింత సమయం దొరికిందని భావిస్తోంది. బలహీనంగా ఉన్న నియోకవర్గాల్లో పట్టు సాధించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం సరికొత్త ఎత్తుగడలను సంధించేందుకు సిద్ధమవుతోంది.

BJP
BJP

BJP Planning for TS Assembly Elections : రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్తా ఏంటో కమలదండు నిరూపించుకుంది. తమ ఉనికే లేనిచోట 86 వేలకు పైగా ఓట్లు రాబట్టడంతో వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది.

BJP Planning for TS Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కమలనాథులు సరికొత్త ఎత్తుగడలు ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. తెరాసను ఢీకొట్టేందుకు నేతల మధ్య పని విభజన చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపాన్ని తగ్గిస్తే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదంచేస్తుందని యోచిస్తోంది. నేతలకు అప్పగించిన పనిని పూర్తిచేయడంతోపాటు అందుకు సంబంధించిన నివేదికలను అధిష్టానం కోరనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావిస్తున్న రాష్ట్ర అధినాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో మందుకెళ్లాలని నిర్ణయించింది. తెరాస ఎత్తుగడలను తిప్పికొట్టడానికి రాష్ట్ర నాయకులు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. మునుగోడు ఉపఎన్నికలో నేర్పిన గుణపాఠాలనుంచి బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

నిత్యం జనంలో ఉండేలా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని కార్యక్రమాల రూపకల్పనకు హైకమాండ్ ఆదేశించింది. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడంపైనే దృష్టిసారించాలని శ్రేణులకు సూచించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, అర్వింద్, రఘునందన్‌రావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ఇంఛార్జ్‌ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.