ETV Bharat / state

వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 7:05 AM IST

Updated : Jan 18, 2024, 11:42 AM IST

Annamayya_District_Collector_Girisha_Suspension
Annamayya_District_Collector_Girisha_Suspension

Annamayya District Collector Girisha Suspension: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీ ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వైఎస్సార్సీపీకి జీతగాళ్లుగా వ్యహరిస్తున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర

Annamayya District Collector Girisha Suspension : వైఎస్సార్సీపీకి తాబేదార్లుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడుతున్న పలువురు అధికారులకు ఈసీ కఠిన చర్యలకు దిగింది. 2021 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి అక్రమంగా డౌన్‌లోడ్‌ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి సహకరించిన ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా పనిచేసిన గిరీషా లోక్‌సభ ఉప ఎన్నికకు ఈఆర్‌ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆయన లాగిన్‌ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్‌ చేశారని రుజువైంది. వాటిపై ఫొటోలు మార్ఫింగ్‌ చేసి దొంగ ఓట్లు వేశారని, స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి.

Central Election Commission Action on Fake Votes : గిరీషా ఐడీతో వేల సంఖ్యలో ఎపిక్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో గుర్తించింది. ఈ ఘటనపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపక్రమించింది. వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు రెండేళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫిర్యాదుతో ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకుంది.

అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు - ఈనెల 22న ఓటర్ల తుది జాబితా: ఈసీ

గత కొన్ని నెలలుగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించారు. తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫాం-7 (Form-7) దరఖాస్తులు చేసి, విపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారులు, తటస్థుల ఓట్లను తొలగించారు. అయితే వారిపైన ఇప్పటి వరకు ఈసీ చర్యలు తీసుకోలేదు. విపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు కిమ్మనడం లేదు. ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు ఒక గిరీషాపై వేటు వేయడం కంటితుడుపు చర్యే అని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, వారికి తాబేదార్లుగా పనిచేస్తున్న అలాంటి గిరీషాలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లూ ప్రేక్షకపాత్ర వహించిన ఎన్నికల సంఘం ఇకనైనా కళ్లు తెరవాలి. అక్రమాలకు పాల్పడే, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న గట్టి సంకేతం పంపాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల్ని బెదిరించో, భయపెట్టో తప్పులు చేయించిన నాయకులపైనా కేసులు పెట్టాలి. ఉరవకొండ, పర్చూరు, చంద్రగిరి, విశాఖ తూర్పు ఇలా ఓటర్ల జాబితాలో అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతిచోటా సమగ్ర విచారణ జరపాలి. ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు పూనుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, సక్రమంగా జరుగుతాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. గిరీషాపైనో, ఉరవకొండలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు అధికారులపైనో చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకుంటే సరిపోదు.

ఎన్నికల జాబితాల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన ప్రధానమైన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లదే. సగానికిపైగా జిల్లాల్లో కలెక్టర్‌లు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి, వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వారి కళ్ల ముందే వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించినా, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, తటస్థుల ఓట్లు తీసేయిస్తున్నా కలెక్టర్లలో ఉలుకూ, పలుకూ లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన ఉండటం లేదు. చాలామంది పోలీసులూ అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు దిల్లీ వరకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయడమో, కోర్టును ఆశ్రయించడమో చేస్తే అప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. బాధ్యులపై చర్యలూ ఉండటం లేదు.

ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి: మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఖురేషీ

అనంతపురం జిల్లా ఉరవకొండ ఓటర్ల జాబితాలో అక్రమాలపై నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేసి, ఏడాది పాటు పోరాడితేగానీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక బృందం వచ్చి విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేలాక చర్యలు చేపట్టారు. 2020, 2021 సంవత్సరాల్లో ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్‌ఓలుగా వ్యవహరించిన భాస్కర్‌రెడ్డి, శోభ స్వరూపారాణి టీడీపీ మద్దతుదారులు ఓట్లను పెద్దసంఖ్యలో తొలగించారని తేలడంతో ఈసీ వారిని సస్పెండ్‌ చేసింది. కేశవ్‌లా దిల్లీ వరకు వెళ్లి ఎంత మంది పోరాడగలరు ? దిల్లీ నుంచి ఈసీ బృందం వచ్చి విచారణ జరపాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

రాష్ట్రంలో ఏ పల్లెలో, పట్నంలో చూసినా ఓటర్ల జాబితాలో కొల్లలుగా అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, వారికి వంతపాడుతున్న అధికారుల అక్రమాలకు అంతూపొంతూ లేదు. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఓట్లే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు. సున్నా డోర్‌ నంబరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో ఒకే డోర్‌ నంబర్, చిరునామాతో వందల ఓట్లు చేర్చారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించేశారు. అధికార పార్టీకి అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చారు.

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులు దాఖలు చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులపై 10 కేసులు నమోదయ్యాయి. పర్చూరు నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీ కీలక నేత ఓట్ల తొలగింపు వెనుక ఉన్నారు. కానీ నమోదైన పది కేసుల్లోను ఆయన ప్రస్తావనే లేదు. పోలీసు యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో కుట్రను బయట పెట్టేవారే లేరు. ఓట్ల తొలగింపులో పర్చూరులో పలువురు ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకూ ప్రమేయం ఉందని తేలటంతో వారు సస్పెండయ్యారు. మళ్లీ అక్కడి పోలీసులకే దర్యాప్తు బాధ్యత అప్పగించారు. ఇక నిష్పాక్షిక దర్యాప్తు ఎలా సాగుతుందో వారికే తెలియాలి.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నన్ని అక్రమాలు, అవకతవకలు రాష్ట్రంలో ఇంకెక్కడా జరిగి ఉండవు. అక్కడ టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వేల సంఖ్యలో ఫాం-7లు పెట్టారు. కానీ ఒకే ఒక్క కేసు నమోదైంది.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 2వేల 799 ఓట్లను తొలగించాలంటూ 30 మందికిపైగా గంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులు పెట్టారు. వారంతా వైఎస్సార్సీపీ వారే. పిఠాపురం నియోజకవర్గంలో 12వేల 500 ఓట్ల తొలగింపునకు 862 మంది ఫాం-7 దరఖాస్తులు చేశారు. గురజాల నియోజకవర్గంలోనూ భారీగా ఫాం-7 దరఖాస్తులు వచ్చాయి. కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా అవన్నీ సక్రమమేనని ఎన్నికల సంఘం తేల్చేయడం విస్మయానికి గురిచేస్తోంది.

వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారి ఓట్లను తొలగించడం వైఎస్సార్సీపీ వ్యవస్థీకృతం చేసేసింది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ఇదే తరహా నేరపూరిత కుట్రను అమలు చేసింది. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫాం-7 దరఖాస్తులు చేయించింది. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్య ఓట్ల తొలగింపులకు 12.50 లక్షల ఫాం-7 దరఖాస్తులు అందగా వాటిలో 80 శాతం వైకాపా సానుభూతిపరులు, నాయకులే చేసినట్టు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులన్నీ నీరుగార్చేశారు.

AP High Court questions Central Election Commission: ఓట్ల తొలగింపునకు అనుసరిస్తున్న విధానమేంటి.. సీఈసీకి హైకోర్టు ఆదేశం

Last Updated :Jan 18, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.