ETV Bharat / state

YCP MLA Land Kabja: అడ్డూఅదుపు లేకుండా వైఎస్సార్​సీపీ నేతల కబ్జాలు.. ఈసారి రూ.20కోట్ల ల్యాండ్​పై కన్ను

author img

By

Published : Jul 21, 2023, 10:08 AM IST

YCP MLA Land Kabja in Anantapur: అనంతపురంలో 20 కోట్ల విలువైన భూమి కాజేసేందుకు వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధి పథకం పన్నారు. అన్ని హక్కు పత్రాలు ఉన్నా.. అధికారం ఉపయోగించి అసలు యజమానులను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ఐటీఐకి చెందిన భూమిగా కళాశాల ప్రిన్సిపాల్‌తో ఫిర్యాదు చేయించి తమపైనే అక్రమ కేసులు పెట్టించారని భూ యజమానులు వాపోతున్నారు.

danda
danda

YCP MLA Land Kabja in Anantapur: అనంతపురంలో వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధి 20 కోట్ల రూపాయల విలువైన భూమి కాజేయడానికి రంగంలోకి దిగాడు. 93 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిపై కన్నేసిన ఆ ప్రజాప్రతినిధి.. తన పవర్ ఉపయోగించి యజమానులను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అన్ని హక్కు పత్రాలున్నప్పటికీ, ప్రభుత్వ ఐటీఐకి చెందిన భూమిగా కళాశాల ప్రిన్సిపల్​తో ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు పెట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

బళ్లారి జిల్లాలో కలిసి ఉన్నప్పుడు పావుగడ తాలుకాకు చెందిన శీతయ్యశెట్టి అండ్ కో సంస్థ భాగస్వాములు, లత్తవరం నాగప్పతో కలిసి కంబళ్ల వ్యాపారం చేశారు. నాగప్ప ఆ సంస్థకు కొంత మొత్తం బకాయి పడటంతో ఆ మొత్తానికి సరిపడా అనంతపురం కోర్టు రోడ్డులో ప్రభుత్వ ఐటీఐకి సమీపంలో.. సర్వే నెంబర్ 254-2‍లోని ఎకరా భూమిని శీతయ్యశెట్టి అండ్ కోకు 1930 జనవరి 25న రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు 93 ఏళ్లుగా శీతయ్య శెట్టి వారసులు భూమిని చూసుకుంటున్నారు. ఇది పట్టాభూమి అయినా ఎవరూ రాలేదని స్థానిక ప్రజాప్రతినిధి దాన్ని కాజేసే ఎత్తుగడ వేశారు. కానీ ఈలోగా యజమానుల మూడో తరానికి చెందిన వారసులు.. తగిన పత్రాలతో భూమి వద్దకు వచ్చారు. వారిని ఆధారాలు చూపాలని ఆ ప్రజాప్రతినిధి కోరారు.

1930 నాటి డైక్లాట్ మొదలు అన్ని ఆధారాలు చూపగా.. తనకు 40 సెంట్ల భూమి ఇస్తేనే మీ భూమిని సబ్ డివిజన్ చేస్తారని ప్రజాప్రతినిధి హెచ్చరించాడు. శీతయ్యశెట్టి అండ్ కో సంస్థలోని నలుగురు భాగస్వాముల వారసులు 15 మంది వరకు ఉన్నారు. వీరంతా పది సెంట్లు ఇస్తామని.. తమను ఇబ్బంది పెట్టొద్దని ప్రజాప్రతినిధిని వేడుకున్నారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. తమ భూమిని దక్కకుండా రెవెన్యూ, పోలీసు అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చారని యజమానులు వాపోయారు.

స్పందనలో కలెక్టర్‌ను కలిసి తమ భూమిని సర్వే చేయించాలని భూ యజమానులు కోరారు. సర్వేశాఖ ఏడీ ఆధ్వర్యంలో భూమి కొలతలు జరిగాయి. ఎకరా భూమి శీతయ్యశెట్టికి చెందినదిగా తేల్చారు. ఆమేరకు భూ యజమానులకు ఎండార్స్​మెంట్ పత్రం, భూమి స్కెచ్ ఇచ్చారు. అధికారుల సూచనతో భూమిలో కంప చెట్లు తొలగించేందుకు యజమానులు వెళ్లగా.. ప్రజాప్రతినిధి గన్ మెన్ తమను బెదిరించే ప్రయత్నం చేశారని బాధితులు వాపోయారు. కానీ తాము లొంగకపోయే సరికి.. కక్ష పెంచుకున్న ప్రజాప్రతినిధి.. భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారంటూ.. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ద్వారా అనంతపురం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయించారని వాపోయారు. పోలీసులు తమను స్టేషన్​కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలున్నా.. MLA భూమి దక్కకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధితులు వాపోయారు.

భూమికి సంబంధించిన హక్కు పత్రాలు సమర్పించాలని పోలీసులు ఇరు పక్షాలను కోరగా.. శీతయ్యశెట్టి వారసులు అన్ని పత్రాలు ఇచ్చారు. కానీ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. భూమి మాత్రం తమదేనని కొత్తగా బాధ్యతలు తీసుకున్న మరో ప్రిన్సిపాల్ చెబుతున్నారు. భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని యజమానులు వాపోతున్నారు. తమకు సహకరించకుండా వైసీపీ ప్రజాప్రతినిధి వారిపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.